Chandrayaan-3: భారత్‌తో రష్యా పోటీ..! అంతరిక్షంలో గెలిచేదెవరు..?
చందమాను జయించేందుకు చంద్రయాన్-–3 గతనెల 14న నింగిలోకి ఎగిరింది. చంద్రుడి కక్ష్యలోకి చేరి జాబిల్లికి చేరువవుతోంది. మరో రెండు వారాల్లో చందమామను రోవర్ ముద్దాడబోతోంది.
Chandrayaan-3: భారత్, రష్యాల మధ్య పోటీ నేలమీద కాదులేండి. అంతరిక్షంలో.. ఇంకా చెప్పాలంటే చంద్రుడిపై…ఎవరికీ అందని ఘనతను అందుకోవాలని ఇస్రో తహతహలాడుతుంటే మీకంటే ముందే మేం అడుగుపెడతాం అంటోంది రష్యా.
50 ఏళ్ల తర్వాత రష్యా..!
చందమాను జయించేందుకు చంద్రయాన్-–3 గతనెల 14న నింగిలోకి ఎగిరింది. చంద్రుడి కక్ష్యలోకి చేరి జాబిల్లికి చేరువవుతోంది. మరో రెండు వారాల్లో చందమామను రోవర్ ముద్దాడబోతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ఘనతను ఈసారైనా అందుకోవాలని ఇస్రో పట్టుదలతో ఉంది. కష్టసాధ్యమైన ఆ ఫీట్‌ను గతంలో సాధించలేకపోయినా.. ఈసారి మాత్రం గెలుపు మనదేనన్న నమ్మకంతో ఉన్నారు శాస్త్రవేత్తలు. అయితే మనకు రష్యా పోటీకి వస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై తానూ అడుగు పెడతానంటోంది. ఆగస్టు 11న రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్ ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపనుంది. సోయజ్-2 ప్రిగెట్ బూస్టర్‌ను మోసుకుని లూనా-25 నింగిలోకి ఎగరనుంది. 1976 తర్వాత రష్యా చేపడుతున్న తొలి లూనార్ ల్యాండర్ ప్రయోగం ఇది.
ఆగస్టు 23న మన చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించనుంది. అదే సమయంలో లేదా దానికంటే కాస్త ముందు రష్యా రోవర్ కూడా చంద్రుడిపై అడుగుపెడుతుంది. ఆగస్టు 11న నింగిలోకి ఎగరనున్న రష్యా రోవర్ ఐదురోజుల పాటు జర్నీ చేసి చంద్రుడి కక్ష్యలోకి ఎంటరవుతుంది. ఆ తర్వాత ఐదు నుంచి వారం రోజుల పాటు చంద్రుడి చుట్టూ తిరిగి ఆ తర్వాత ల్యాండింగ్ అవుతుంది. మన చంద్రయాన్ చంద్రుడిపై అడుగు పెట్టేందుకు 40రోజులకు పైగా తీసుకుంటే.. రష్యా మిషన్ మాత్రం కేవలం 12-–14రోజులు మాత్రమే తీసుకుంటుంది. అయితే మనది తక్కువ ఖర్చుతో పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన మిషన్. రష్యా అంత పవర్‌ఫుల్ ఇంజన్లు మన దగ్గర లేవు. అయినా ఉన్నదాంతోనే మనం ఆ ఘనతను సాధించాం. ఎప్పుడో 50 ఏళ్ల క్రితమే చంద్రుడిని జయించిన రష్యా ఇప్పటికీ దక్షిణ ధృువంలో అడుగుపెట్టలేకపోయింది. కానీ మనం మాత్రం దాన్ని సుసాధ్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం.
ముందు అడుగుపెట్టేది ఎవరు..?
రెండు రోవర్లు కాస్త అటూ ఇటుగా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నించినా దేని ప్రత్యేకత దానిదే. ఇవి రెండు ల్యాండ్ అయ్యే ప్రదేశాలు వేరువేరు. అలాగే మన రోవర్ రెండువారాలు మాత్రమే పనిచేసేలా డిజైన్ చేశారు. కానీ రష్యా ల్యూనా-25మాత్రం సురక్షితంగా ల్యాండ్ అయితే ఏడాది పాటు విధులు నిర్వర్తించనుంది. ఈ రెండు ఒకదానికొకటి ఎదురుపడే అవకాశాలు లేవని సైంటిస్టులు చెబుతున్నారు. లూన్-25 రోబోటిక్ చేతులతో ఉపరితలానికి ఆరు ఇంచుల కింద ఉన్న రాళ్లను కూడా వెలికితీయగలదు. నిజానికి దీన్ని 2021లోనే ప్రయోగించాలని చూసినా రెండేళ్లు ఆలస్యమైంది.
అక్కడే ఎందుకు..?
దక్షిణ ధ్రువం ఉపరితలం చాలా రఫ్‌గా ఉంటుంది. అందుకే ఇక్కడ ల్యాండ్ కావడం కష్టం. దక్షిణ ధ్రువంపైనే నీటి జాడలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక్కడ మంచు జాడలు ఉన్నాయని దాన్నుంచి ఆక్సిజన్, తాగునీరు తయారు చేసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ అక్కడ అడుగుపెట్టడం కష్టమైన పనే. అయినా ఇస్రో దాన్నే ఛాలెంజ్‌గా తీసుకుంది. రష్యా, భారత్ ఎవరి మిషన్ ముందుగా చంద్రుడిపై అడుగు పెట్టినా అది రికార్డే. రెండు దేశాలు ఆ ఘనతను సాధించాలని కోరుకుందాం.