Twitter X: మస్క్ మరో సంచలనం.. ట్విట్టర్ ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్..!

ట్విట్టర్ ఎక్స్‌పై మొబైల్ నెంబర్ లేకుండానే ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. కాల్స్ చేసే వాళ్లకు, రిసీవ్ చేసుకునే వాళ్లకు ఇంటర్నెట్, ట్విట్టర్ అకౌంట్ ఉంటే సరిపోతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2023 | 03:33 PMLast Updated on: Aug 31, 2023 | 3:53 PM

Elon Musk Announces Audio Video Calls On X For Android

Twitter X: స్పేస్ ఎక్స్, ట్విట్టర్ ఎక్స్ సీఈవో సరికొత్త సంచలనానికి తెరతీయబోతున్నారు. ట్విట్టర్/ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ కూడా చేసుకునే కొత్త ఫీచర్‌‌ను అందుబాటులోకి తేనున్నాడు. గతంలో కాల్స్ చేసుకోవాలంటే సిమ్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇంటర్నెట్ ద్వారా స్కైప్, ఇతర ప్లాట్‌ఫామ్స్‌పై కాల్స్ చేసుకునే అవకాశం ఉండేది.

ఆ తర్వాత జూమ్ సహా అనేక ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. తర్వాత వాట్సాప్ కూడా ఇదే ఫీచర్ తీసుకొచ్చింది. వాట్సాప్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చనే సంగతి తెలిసిందే. అయితే, దీనికి సిమ్ కార్డ్ లేదా మొబైల్ నెంబర్ అవసరం. అయితే, ట్విట్టర్ ఎక్స్‌పై మొబైల్ నెంబర్ లేకుండానే ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. కాల్స్ చేసే వాళ్లకు, రిసీవ్ చేసుకునే వాళ్లకు ఇంటర్నెట్, ట్విట్టర్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు మస్క్ వెల్లడించాడు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వాట్సాప్, జూమ్ వంటి వాటికి గట్టి పోటీనిస్తుంది. త్వరలోనే ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లపై ఈ ఫీచర్ పని చేస్తుంది. అలాగే విండోస్, మ్యాక్ కంప్యూటర్ల నుంచి కూడా ట్విట్టర్ అకౌంట్లోకి లాగిన్ అయి కాల్స్ చేసుకోవచ్చు.

ఎక్కడినుంచి ఎక్కడికైనా కాల్స్ చేసుకునే వీలుంటుంది. గత ఏడాది ట్విట్టర్‌‌ను సొంతం చేసుకున్న మస్క్.. ప్లాట్‌ఫామ్‌పై అనేక మార్పులు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చారు. వెరిఫైడ్ అకౌంట్లకు సంబంధించి పెయిడ్ మెంబర్‌‌షిప్, డైలీ ట్వీట్స్ లిమిట్స్ వంటి అనేక మార్పులు చేశాడు. తాజాగా కాల్స్ ఫీచర్‌‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలోకి కూడా అగుగుపెట్టాడు. ఎక్స్ఏఐ పేరుతో స్టార్టప్‌ను నెలకొల్పారు. ఈ స్టార్టప్ ద్వారా ఈ కాల్స్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్‌విదియా కార్పొరేషన్ నుంచి వేలాది ప్రాసెసర్‌లను మస్క్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.