Germany Recession : జర్మనీలో ఆర్థిక మాంద్యం.. సంక్షోభం అంచున ఏ దేశాలు ఉన్నాయి.? భారత్ పరిస్థితేంటి ?

జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం మెరుగుపడకపోయినా.. రానున్నత్రైమాసికాల్లోనూ నెగిటివ్ గ్రోత్ కనిపించినా... అమెరికా, బ్రిటన్ మాంద్యంలో కూరుకుపోయినా... అప్పుడు మాత్రం మన దేశానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే ఆ పరిస్థితి రాదనే ఆశాభావంతో భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 27, 2023 | 09:39 PMLast Updated on: May 27, 2023 | 9:39 PM

Germany Worlds Fourth Largest Economy Enters Recession What About India

కొన్నిదేశాల ఆర్థిక పరిస్థితి చేస్తుంటే ప్రపంచానికి మళ్లీ గడ్డుకాలం రాబోతుందా అని భయపడాల్సి వస్తుంది. కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకుని అన్ని దేశాలు గాడిన పడుతున్నాయనుకుంటున్న సమయంలో మళ్లీ సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీ అధికారికంగా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిపోయింది. అమెరికా సహా మెజార్టీ దేశాలు చరిత్రలో ఎప్పుడూ చూడనంతగా ద్రవ్యోల్బణంతో సతమతమవుతుంటే… జర్మనీ ఏకంగా మాంద్యంలోకి జారుకుంది. యూరోప్‌లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీ మాంద్యం బారిన పడటం ప్రపంచ దేశాలకు ప్రమాద సంకేతంగానే చెప్పాలి. వరుసగా రెండు త్రైమాసికాలు నెగిటివ్ గ్రోత్‌ను నమోదు చేయడంతో జర్మనీకి టెక్నికల్‌గా మాంద్యాన్ని చవిచూస్తోంది. 2022 చివరి త్రైమాసికంలో మైనస్ 0.5 శాతం వృద్ధి రేటు నమోదు చేసిన జర్మనీ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనూ మైనస్ 0.3శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో నెగెటివ్ వృద్ధి రేటు రావడంతో జర్మనీకి ఆర్థిక మాంద్యాన్ని భరించాల్సిన పరిస్థితి వచ్చింది.
జర్మనీలో ఆర్థికమాంద్యానికి కారణమేంటి ?
ఏ దేశంలోనైనా ప్రజలు ఎప్పుడైతే ఖర్చు పెట్టడం మానేస్తారో.. అప్పుడు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోతుంది. జర్మనీలోనూ ఇప్పుడు అదే జరుగుతుంది. గత కొంతకాలంగా జర్మనీ ప్రజలు స్పెండింగ్‌కు దూరంగా ఉన్నారు. మరీ అత్యవసరమై పీకలమీదకు వస్తే తప్ప జేబులో నుంచి డబ్బులు తీయడం లేదు. దీనికి కారణం అధిక ద్రవ్యోల్బణం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారిగా జర్మనీలో అత్యధికంగా ద్రవ్యోల్బణం 7.9 శాతంగా నమోదైంది. దీంతో నిత్యవసర వస్తువులు సహా అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం యూరోప్‌లో ఎనర్జీ క్రైసిస్‌కు దారితీసింది. ఇంధన ధరలకు రెక్కలు రావడంతో ఆ ప్రభావం పారిశ్రామిక రంగంపై పడింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించడంలో జర్మనీ రాజకీయ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. దీంతో ఆ ప్రబావం నేరుగా ప్రజలపై పడింది. జర్మన్ల బడ్జెట్ తలకిందులైపోయింది. దీంతో ప్రజలు ఆచితూచి ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. పబ్లిక్ స్పెండింగ్ గడిచిన కొన్ని నెలల్లో 5 శాతానికి పైగా తగ్గిపోయింది . ఇదే పరిస్థితి వచ్చే త్రైమాసికాల్లో కూడా కొనసాగితే జర్మనీ మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతుంది.
జర్మనీ ఆర్థిక మాంద్యం మిగతా దేశాలను వెంటాడుతుందా ?
యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థకు జర్మనీ బ్యాక్ బోన్ లాంటిది. జర్మనీలో చోటు చేసుకునే ఆర్థిక విపరిణామాలు ఆదేశంతో పాటు యూరప్‌ను, ఇతర ప్రపంచదేశాలను కూడా వెంటాడతాయి. అంతేకాదు జర్మనీ భవిష్యత్తు కూడా ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో ముడిపడి ఉంటుంది. జర్మనీ స్థూల జాతీయోత్పత్తిలో 32 శాతం వాటా ఆదేశ ఎగుమతులదే. అయితే ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. చైనాకు జర్మన్ కార్ల అమ్మకాలు 24 శాతం పడిపోయాయి. ఇక ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా ఈ మధ్య కాలంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. జర్మన్ బాటలో ఇప్పుడు ఏ దేశం ఆర్థిక మాంద్యానికి చేరువలో ఉంది అన్న చర్చ జరుగుతుంది. బ్లూమ్‌బర్గ్ లెక్కల ప్రకారం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోబోయే దేశాల్లో బ్రిటన్ ముందు వరుసలో ఉంది. బ్రిటన్ లో రిసెషన్ రావడానికి 75 శాతం అవకాశాలున్నాయి. ఆ తర్వాత క్యూలో అమెరికానే ఉండబోతోంది.
భారత్‌లో కూడా ఆర్థిక మాంద్యం వస్తుందా ?
యూరోప్‌తో పాటు ఐరోపా దేశాలు షేక్ అయినా…భారత్ కూడా ఆర్థిక మాంద్యం ముప్పులోకి వెళ్లే అవకాశాలు ఏమాత్రం లేవని బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది. అయితే జర్మనీ సంక్షోభ ప్రభావం మాత్రం భారత్ పై కచ్చితంగా ఉంటుంది. మొత్తం యూరోప్‌లోనే భారత్‌తో వాణిజ్యం చేస్తున్న అతిపెద్ద దేశం జర్మనీ మాత్రమే. ఇండియా-జర్మనీ మధ్య జరుగుతున్న వాణిజ్యం విలువ 20 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. దుస్తులు,స్మార్ట్ ‌ఫోన్లు, లెదర్ ఉత్పత్తులను భారత్ జర్మనీకి ఎగుమతి చేస్తుంది. ఆ దేశంలో తలెత్తిన ఆర్థిక మాంద్యం కారణంగా ఈ ఎగుమతులు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతానికి బిందాస్…కానీ
జర్మనీ ఆర్థిక మాంద్యాన్ని చూసి ఇప్పటికిప్పుడు భారత్ భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం మెరుగుపడకపోయినా.. రానున్నత్రైమాసికాల్లోనూ నెగిటివ్ గ్రోత్ కనిపించినా… అమెరికా, బ్రిటన్ మాంద్యంలో కూరుకుపోయినా… అప్పుడు మాత్రం మన దేశానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే ఆ పరిస్థితి రాదనే ఆశాభావంతో భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళుతుంది.