Go First Air Lines: విమానం ఎగరనంటోంది..! ఎందుకు ? ఏమిటీ ? ఎలా ?

మీరు లక్షాధికారి కావాలనుకుంటున్నారా ? అయితే వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ఒక ఎయిర్‌లైన్ సంస్థను స్థాపించండి.! విమానయాన రంగంపై ఇంతకు మించిన పెద్ద సెటైర్ ఇంకేమైనా ఉంటుందా ? ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ అంటేనే పెద్ద లాస్ ‌అని విమానాలు నడిపి డబ్బులు సంపాదించాలనుకుంటే కోట్లకు పడగలెత్తిన వాళ్లు కూడా లక్షాధికారులుగా మారిపోతారని బ్రిటన్ వ్యాపార దిగ్గజం రిచర్డ్ బ్రాన్సన్ ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు ఆయన మాటలు గుర్తు చేసుకోవడానికి కారణం మనదేశంలో మరో విమాన సంస్థ చాప చుట్టేసింది. ఇక విమానాలు తిప్పడం మా వల్ల కాదంటూ గో ఫస్ట్ సంస్థ దివాళా పిటిషన్ దాఖలు చేయడం దేశీయ విమానయాన రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మరోసారి చర్చకు పెట్టింది. ప్రముఖ వ్యాపార సంస్థ వాడియా గ్రూప్ నిర్వహిస్తున్న గో ఫస్ట్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు స్వచ్చందంగా దివాళా పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు దేశీయ విమానయాన రంగంలో కూడా కుదుపు మొదలయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 4, 2023 | 05:30 PMLast Updated on: May 04, 2023 | 5:42 PM

Go Air As Go First In Financial Crisis

వాడియా గ్రూప్ సమర్పించు.!

ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని వాడియా గ్రూప్‌కు తెలుసు. అయినా మిగతా వాటికి భిన్నంగా తమదైన శైలిలో నిర్వహిస్తే.. గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ డొమెస్టిక్ ఎయిర్ లైన్ ఇండస్ట్రీలో నెంబర్ వన్‌గా నిలుస్తుందని వాడియా గ్రూప్ భావించింది. బాంబే డైయింగ్, బ్రిటానియా, నేషనల్ పెరాక్సైడ్, బాంబే రియాల్టీ, టెక్నో ఇంజినీరింగ్ వంటి ఎన్నో సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్న వాడియా గ్రూప్ 2005లో గో ఫస్ట్ అంటూ విమానయాన రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. విమాన ప్రయాణం అంటేనే లగ్జరీ అనుకునే రోజుల్లో సామాన్య ప్రజలు కూడా విమానం ఎక్కేలా తక్కువ రేట్లకే సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి ప్రత్యర్థి సంస్థలతో పోటీని తట్టుకుంటూ ఇండియన్ ఏవియేషన్ సెక్టార్‌లో 10 శాతం మార్కెట్ షేర్‌ను సాధించింది. గో ఎయిర్ నుంచి గో ఫస్ట్ గా ప్రస్థానాన్ని విజయవంతంగా మొదలు పెట్టింది.

అప్పుడు ఐపీఓ..ఇప్పుడు దివాళా..!

సంస్థను మరింత విస్తరించేందుకు సరిగ్గా సంవత్సరం క్రితం IPOకు కూడా సిద్ధమయ్యింది గో ఫస్ట్ సంస్థ. భారీగా నిధులు సమీకరించుకోవడం ద్వారా సర్వీసులను పెంచి నెంబర్ వన్ ‌గా మార్చాలన్నది వాడియా గ్రూప్ ప్లాన్. కానీ సంవత్సరం తిరిగే సరికి కథ అడ్డం తిరిగింది. రోజు వారీ నిర్వహణకు కూడా నిధుల సమస్య తలెత్తడంతో పాటు అనేక సాంకేతిక కారణాలతో దివాళా తీస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు టిక్కెట్స్ బుక్ చేసుకున్న వారికి పూర్తిస్థాయిలో రిఫండ్ ఇచ్చేస్తామని సంస్థ తెలిపింది.

గో ఫస్ట్ మునిగిందా ? ముంచేశారా ?

54 విమానాలు..35 గమ్యస్థానాలతో మిడిల్ క్లాస్ ఎయిర్ క్యారియర్‌గా మంచి లాభాలే ఆర్జించింది. 2020లో ఇండిగోతో పోటీపడి మరీ రెవెన్యూ జెనరేట్ చేసింది. అల్ట్రా లో కాస్ట్ కారియర్‌గా విమాన ప్రయాణికులకు బాగానే కనెక్ట్ అయ్యింది. తక్కువ నిర్వహణ ఖర్చులతో జర్నీని కొనసాగించింది. మరి ఒక్కసారిగా గో ఫస్ట్ దివాళా తీసే స్థాయికి ఎందుకు పడిపోయింది. ఆర్థికపరమైన సమస్యలు ఎంత పెద్ద విమానయాన సంస్థకైనా కచ్చితంగా ఉంటాయి. కోవిడ్ లాంటి సంక్షోభాలతో మూతబడ్డ ఎయిర్ లైన్స్ కూడా ఉన్నాయి. అయితే గో ఫస్ట్ విషయంలో కేవలం ఫైనాన్షియల్ ఇష్యూస్ మాత్రమే కాదు… దీని వెనుక ఇంజన్ సమస్యలు కూడా ఉన్నాయ్.

గో ఫస్ట్ కొంప ముంచిన ఇంజన్ సంస్థ

ఏ విమానయాన సంస్థైనా దివాళా తీసే పరిస్థితి వచ్చిందంటే.. దానికి అంతర్గత కారణాలతో పాటు బయట నుంచి ప్రభావితం చేసే అంశాలు కూడా ఉంటాయి. ఎయిర్ లైన్స్ నడపాలంటే ఎయిర్ బస్ , బోయింగ్ వంటి పెద్ద సంస్థల నుంచి విమానాలను కొనుగోలు చేయాలి లేదా లీజ్‌కు తీసుకోవాలి. ఇతర కంపెనీల నుంచి ఇంజన్లను కూడా తెచ్చుకోవాలి. ఇంజన్ల సరఫరా విషయంలో గో ఫస్ట్ సంస్థకు Pratt & Whitney సంస్థకు మధ్య ఒప్పందం ఉంది. గో ఫస్ట్ విమానాలకు ఈ సంస్థే ఇంజన్లను సరఫరా చేయాలి. సాంకేతిక సమస్యలున్న ఇంజన్లు ఇవ్వడం కారణంగా… గో ఫస్ట్ కొన్ని సంవత్సరాలుగా అనేక సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. 2018లో ఇంజన్ల లోపాల కారణంగా 10 శాతం గో ఫస్ట్ విమాన సర్పీసులు రద్దయితే 2021 వచ్చే సరికి ఆ సంఖ్య 50 శాతానికి చేరుకుంది. గో ఫస్ట్ దగ్గరనున్న 54 విమానాల్లో సగం ఎప్పుడూ ఎయిర్‌పోర్టు గ్యారేజ్‌కే పరిమతయ్యే పరిస్థితులు వచ్చాయి. నాణ్యమైన ఇంజన్లను సరఫరా చేయకపోవడంపై గో ఫస్ట్ న్యాయ పోరాటం కూడా చేసింది. Pratt & Whitneyకు వ్యతిరేకంగా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌లో పంచాయితీ నడుస్తోంది.ఎలాంటి సమస్యలు లేని పది ఇంజన్లను గో ఫస్ట్ ‌కు ఏప్రిల్ లోపో సమకూర్చాలని ఆర్బిట్రేషన్ సెంటర్ ఆదేశించినా.. వాటిని Pratt & Whitney పాటించలేదని ఆ సంస్థ ఆరోపిస్తోంది.

ఇంజన్ పనిచేయదు..విమానం ఎగరదు

సగానికిపైగా విమానం ఇంజన్లు పనిచేయకపోతే గో ఫస్ట్ సంస్థైనా ఏం చేయగలుగుతుంది. తక్కువ ధరలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు తీసుకెళ్లి ఇండిగో వంటి సంస్థలకు గట్టి పోటీ ఇచ్చిన సంస్థ చివరకు ఆర్థికంగా కూడా సంక్షోభంలో చిక్కుకుంది. పనిచేయని ఇంజన్ల పాపం…గో ఫస్ట్ సంస్థ నెత్తిన గత ఆర్థిక సంవత్సరం నాటికే 1800 కోట్ల రూపాయల నష్టాన్ని ఉంచాయి. ఈ తరహా ఇంజన్ల సమస్యను ఇండిగో కూడా ఎదుర్కొన్నా… 2009లోనే 20 బిలియన్ డాలర్లతో వేరే సంస్థతో ఒప్పందం కుదుర్చుతుంది. ఇండిగో ముందే మేల్కోవడం వల్ల గో ఫస్ట్ తరహాలో దివాళా తీసే పరిస్థికి చేరుకోలేదు. గో ఫస్ట్ దివాళా తీయడంతో ఆ భారం రుణాలిచ్చిన బ్యాంకులపైనా పడింది. దాదాపు 6 వేల కోట్ల రూపాయలను గో ఫస్ట్ రుణంగా తీసుకుంది. కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్క్రీమ్‌ను ప్రవేశపెట్టింది. దాని ద్వారా 1300 కోట్లను రుణంగా తీసుకుంది గోఫస్ట్.

గోఫస్ట్‌కు భవిష్యత్తు ఉందా ?

ఇదే ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీని వేధిస్తున్న ప్రశ్న. ఎయిర్ డెక్కన్, ఎయిర్ సహారా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్‌వేస్ తరహాలో గో ఫస్ట్‌ కూడా పూర్తిగా మూతపడుతుందా అన్న ఆందోళన విమానయానరంగంలో ఉంది. వాడియా గ్రూప్ ఈ సంస్థను వదిలించుకుంటే గోఫస్ట్ ఇక కోలుకోలేదు. పోనీ ఎవరైనా దీన్ని కొన్ని నడపుతారా అంటే ఆ స్థాయి ఆసక్తి ఉన్న సంస్థలు కనిపించడం లేదు. దీంతో రోజుకు కనీసం 40 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన గో ఫస్ట్ కథ కంచికి చేరుతుందోమోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.