కొంచెం తగ్గు బంగారం ఆకాశానికి నిచ్చెనేస్తున్న పసిడి ధరలు
బంగారం ధరలు...కిందికి దిగి రానంటున్నాయి. రోజు రోజుకి పైపైకి ఎగబాకుతున్నాయి. కనకం కమ్ డౌన్ అంటున్నా...నో వే...ఛాన్సే లేదంటోంది.

బంగారం ధరలు…కిందికి దిగి రానంటున్నాయి. రోజు రోజుకి పైపైకి ఎగబాకుతున్నాయి. కనకం కమ్ డౌన్ అంటున్నా…నో వే…ఛాన్సే లేదంటోంది. లక్ష వైపు పరుగులు పెడుతోంది. పెరుగుతున్న ధరను చూసి…జనం బెంబేలెత్తిపోతున్నారు. బంగారం ధరలను ఆపతరమా అన్నట్లు పరిస్థితులు తయారవుతున్నాయి.
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ధర పెరగడమే తప్పా…తగ్గడం తెలియదంటోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పసిడి ధరలు…జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. గతేడాది డిసెంబరులో 79వేల రూపాయలు ఉంది. నెలన్నర రోజుల్లోనే దాదాపు 10వేలు హైక్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 88,970గా ఉంది. కిలో వెండి ధర రూ.99,540గా ఉంది. స్పాట్ గోల్డ్..ఔన్స్ గోల్డ్ ధర 2,929.40 డాలర్లు ఉంటే…ఔన్స్ సిల్వర్ ధర 32.65 డాలర్లుగా ఉంది. ఫిబ్రవరి 1న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 84,490 ఉంది. తాజాగా 88,970 రూపాయలైంది. 20 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర…దాదాపు 4 వేల రూపాయలు పెరిగింది.
పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. అంతేకాదు.. పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. ఇంట్లో ఎలాటి శుభకార్యాలు జరిగినా…ఒక గ్రాము బంగారమైనా కొనడానికి ఆసక్తి చూపుతారు. ధర ఎంత పెరిగింది…ఎంత ఉందన్న విషయాన్ని పట్టించుకోరు. ఎందుకు భారతీయులకు, బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. అందుకే…బంగారం ధరలు రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్నాయి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు…రియల్ ఎస్టేట్ పై ఇన్వెస్ట్ చేసే జనం కూడా…బంగారం బంగారమే అంటున్నారు. ఎందుకంటే దాని ధర పెరగడమే తప్పా…తగ్గడం అంటూ జరగడం లేదు. గత 50 రోజుల్లోనే దాదాపు 9వేలకుపైగాన పెరిగింది.
భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఇలానే కొనసాగితే…ఈ ఏడాది బంగారం ధరలు బాగా పెరిగే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నూతన సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర 85 నుంచి 90 వేలు దాటుతుందని వ్యాపారులు లెక్కలు వేశారు. అయితే నిపుణులు, వ్యాపారులు ఊహించని విధంగా…పసిడి ధరలు…నీ దూకుడు…సాటెవ్వరు అన్నట్లు రన్నింగ్ చేస్తోంది. ప్రభుత్వాల ద్రవ్య విధానాలు, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇలానే కొనసాగితే, బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.
ఒకవేళ భౌగోళిక రాజకీయ సంక్షోభాలు తగ్గి, రూపాయి విలువ క్షీణిస్తే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే మన దేశంలో పెరుగుతుంది. తగ్గితే…ఇక్కడు ఆటోమెటిక్ గా డౌన్ అవుతుంది. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. దీంతో డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతోంది.