Gold Rush: గోల్డ్ రష్.. కొనేందుకు ఎగబడుతున్న జనం.. టార్గెట్ రూ.80వేలు!
మున్ముందు బంగారం ధరలు ఇంకా పెరగొచ్చనే ఆందోళనల నడుమ ఈ ఏడాది అక్షయ తృతీయ (ఏప్రిల్ 22) సందర్భంగా బంగారం అమ్మకాలు జెట్ స్పీడ్‌తో జరిగాయి. ఈసారి నవంబరు 10న రాబోయే ధనత్రయోదశికి కూడా పసిడి అమ్మకాలు భారీ ఎత్తునే ఉంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి
Gold Rush: గోల్డ్ రేటు రెక్కలు తొడుగుతోంది. తులం బంగారం ధర దాదాపు రూ.10,000 పెరిగి రూ.60వేల దరిదాపులకు చేరింది. అయితేనేం గోల్డ్ సేల్స్ మాత్రం కొంచెం కూడా తగ్గకపోగా.. ఇంకా పెరుగుతూ పోతున్నాయి. పసిడి డిమాండ్ ఏకంగా 11 ఏళ్ల గరిష్టానికి చేరింది. అంటే ధరల పెరుగుదల ప్రభావం పసిడి డిమాండ్‌పై లేదనే చెప్పొచ్చు. గత ఏడాది వ్యవధిలో గోల్డ్ డిమాండ్ దాదాపు 18 శాతం పెరిగింది. గత సంవత్సరం (2022లో) ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి) ఏకంగా 1136 టన్నుల బంగారాన్ని కొనడం వల్లే ఈ రేంజ్‌లో గోల్డ్ రేటు పెరుగుతోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. 2021లో ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు 450 టన్నుల బంగారం మాత్రమే కొన్నాయని, 2022లో రెట్టింపు కంటే ఎక్కువ స్థాయిలో (1136 టన్నుల) పసిడి కొనుగోలుకు ఎగబడ్డాయని గుర్తు చేస్తున్నారు.
నవంబరు 10 ధన త్రయోదశి నాటికి ..
మున్ముందు బంగారం ధరలు ఇంకా పెరగొచ్చనే ఆందోళనల నడుమ ఈ ఏడాది అక్షయ తృతీయ (ఏప్రిల్ 22) సందర్భంగా బంగారం అమ్మకాలు జెట్ స్పీడ్‌తో జరిగాయి. ఈసారి నవంబరు 10న రాబోయే ధనత్రయోదశికి కూడా పసిడి అమ్మకాలు భారీ ఎత్తునే ఉంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈనేపథ్యంలో గోల్డ్ వ్యాపారులు కొత్త కొత్త ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కొంత నగదు చెల్లిస్తే.. ధన త్రయోదశి నాటికి ధరలు పెరిగినా ఇప్పుడున్న రేటుకే గోల్డ్‌ను కొనుక్కునే ఛాన్స్ ఇస్తామని కొన్ని గోల్డ్ షాపులు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు అడ్వాన్స్‌గా చెల్లించే అమౌంట్‌ను.. ధన త్రయోదశి రోజు కొనే గోల్డ్ బిల్లు నుంచి మినహాయిస్తామని కస్టమర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. వచ్చే ఏడాది నాటికి తులం గోల్డ్ రేటు రూ.80 వేలను తాకొచ్చనే వార్తల నడుమ గోల్డ్ కొనుగోలుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు.
ఎవర్‌గ్రీన్ మెటల్.. అందుకే..!
పొదుపు మాధ్యమంగా.. పెట్టుబడి సాధనంగా.. అవసరానికి పనికొచ్చే ఆర్థిక వనరుగా.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే సామర్థ్యం గోల్డ్ సొంతం. అందుకే అది ఎవర్ గ్రీన్ మెటల్‌గా యావత్ ప్రపంచాన్ని శాసిస్తోంది. చివరకు ప్రభుత్వం అమ్మే గోల్డ్ బాండ్స్ కొనుగోళ్లకు కూడా విశేష స్పందన లభిస్తోంది. గోల్డ్‌పై అవసరానికి లోన్స్ తీసుకొనే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు బంగారు నగలను తాకట్టు పెట్టుకుని, ఆ రోజు మార్కెట్ విలువలో 70 నుంచి 80 శాతం వరకు లోన్‌గా ఇస్తాయి. ఒకేసారి మొత్తంగా లేదా కొద్దికొద్దిగా ఈ రుణాన్ని తీర్చే వెసులుబాటు ఉండటం ప్లస్ పాయింట్‌గా మారుతోంది. రూ.100కు 65 పైసల నుంచి 80 పైసల వడ్డీ మాత్రమే ఉండటం పెద్ద అడ్వాంటేజ్.