Laptops: కెమెరాలు, ప్రింటర్ల రేట్లు పెరుగుతాయా..? వీటిపై ఆంక్షలెందుకు..!

ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్‌ల దిగుమతిని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగమే ఆంక్షలు. నవంబర్1 తర్వాత వీటిని దిగుమతి చేసుకోవాలంటే ఆయా కంపెనీలు ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 11, 2023 | 11:59 AMLast Updated on: Aug 11, 2023 | 11:59 AM

Governments Ban On Import Of Laptops Computers Means For Customers

Laptops: వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ చివరి నుంచి ఇవి దిగుమతి చేసుకోవాలంటే లైసెన్స్ ఉండాలి. మరి ఇది కేవలం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతో ఆగుతుందా..? ఈ జాబితాలో చేరే మరిన్ని వస్తువులేంటి..?
పెరిగిన కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల అమ్మకాలు..!
వ్యక్తిగత అవసరాలకు వాడుకునే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్‌ల దిగుమతిని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగమే ఆంక్షలు. నవంబర్1 తర్వాత వీటిని దిగుమతి చేసుకోవాలంటే ఆయా కంపెనీలు ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ధరలు పెరుగుతాయన్న భయంతో వీటి విక్రయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నవంబర్1 తర్వాత ఇవన్నీ పరిమిత దిగుమతుల కేటగిరి కిందకు వస్తాయి. ఆపిల్, హెచ్‌పీ, ఏసస్, లెనోవా వంటి కంపెనీలు తాము సాధారణంగా దిగుమతి చేసుకునే పీసీలు, ల్యాప్‌టాప్‌ల కంటే దాదాపు 50శాతం అధికంగా దిగుమతి ఆర్డర్లు పెట్టాయి. త్వరలో పండగ సీజన్ రాబోతోంది. సంవత్సరం మొత్తం జరిగే విక్రయాల్లో దాదాపు 20శాతం ఈ సమయంలోనే జరుగుతాయి. ఆ సమయానికి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా లైసెన్స్ వచ్చేసరికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ముందు జాగ్రత్తగా సాధ్యమైనంతగా దిగుమతి చేసుకుంటున్నాయి కంపెనీలు.
ప్రింటర్లు. కెమెరాలు కూడా..!
ఈ ఆంక్షలు కేవలం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లకే పరిమితం కాబోవడం లేదు. మరిన్ని వస్తువులను ఈ కేటగిరిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కెమెరాలు, ప్రింటర్లు, హార్డ్ డిస్క్‌లు, టెలీఫోనిక్-టెలిగ్రాఫిక్ పరికరాల భాగాలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లను ఈ జాబితాలో చేర్చే అంశాలను పరిశీలిస్తోంది. వీటితో పాటు యూరియా, యాంటీ బయాటిక్స్, టర్బోజెట్స్, రిఫైన్డ్ కాపర్, లిథియం ఇయాన్ ఎక్యూమలేటర్స్, అల్యూమినియం స్క్రాప్, జీడిపప్పు, సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్ దిగుమతులను కూడా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటిని కూడా పరిమిత దిగుమతుల కేటగిరిలో చేర్చే అవకాశాలున్నాయి. అంటే వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్-1 (ఐటీఏ-1)కింద వచ్చే 250 డ్యూటీ ఫ్రీ వస్తువులపై కూడా రివ్యూ చేస్తోంది. వీటిలో కొన్నింటిని ఆ జాబితా నుంచి తొలగించే అవకాశాలు లేకపోలేదు. అంటే ఇప్పటివరకు పన్ను పరిధిలో లేని వస్తువులకు కూడా ఇకపై ట్యాక్స్ చెల్లించక తప్పదు.
ఎందుకీ ఆంక్షలు..?
ఐటీఏ-1 కింద ఉన్నవి మినహా పైన పేర్కొన్న వస్తువులన్నింటికీ మనం పన్నులు కడుతున్నాం. ఇకపై వాటికి మరింత చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం చెబుతున్న కారణం దేశీయంగా తయారీని ప్రోత్సహించడం. మోడీ ప్రభుత్వం మేకిన్ ఇండియా క్యాంపెయిన్ మొదలుపెట్టింది. ఆ దిశగా పలు చర్యలు తీసుకుంది. కానీ అనుకున్న స్థాయిలో అది సక్సెస్ కాలేదు. కానీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల దేశీయంగా తయారీకి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని క్యాష్ చేసుకుంటూ దేశీయ తయారీ రంగానికి మరింత ఊపునిచ్చేందుకు కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక దిగుమతులు తగ్గించడానికి మరో కారణం వాణిజ్య లోటును కట్టడి చేయడం. ప్రింటర్లు, కీబోర్డులు, హార్డ్ డిస్క్‌ల వంటి వాటి దిగుమతికి గత ఆర్ధిక సంవత్సరంలో రూ.83.44వేల కోట్లు ఖర్చు చేశాం. దీనివల్ల వాణిజ్య లోటు పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒకప్పుడు చైనా ప్రపంచ తయారీ కేంద్రంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. చైనాను ప్రపంచదేశాలు నమ్మట్లేదు. పెద్ద పెద్ద కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. కొన్ని కంపెనీలు దేశంలో అడుగు పెట్టాయి కూడా. భారత్‌ను ఉత్పత్తి కేంద్రంగా మార్చుకుంటున్నాయి. దీన్ని మరింత పెంచేందుకే కేంద్రం ఆంక్షల కత్తి వేలాడదీస్తోంది. దీంతో బలవంతంగా అయినా దేశీయ తయారీవైపు అడుగు పెట్టక తప్పని పరిస్థితి కంపెనీలకు కల్పిస్తోంది. మరి ఈ ఆంక్షలు ఎంత మేర మేకిన్ ఇండియాను పరుగులు తీయిస్తాయో చూడాలి మరి.