CEIR System: పోయిన ఫోన్లను బ్లాక్ చేయొచ్చు.. 17 నుంచి ఫోన్ బ్లాకింగ్ సిస్టమ్ అమలు
ఇది అమల్లోకి వస్తే పోయిన తమ ఫోన్‌లోని సమాచారాన్ని ఇతరులు యాక్సెస్ చేయకుండా కాపాడుకోవచ్చు. అంటే ఫోన్ ఇతరులు వాడుకునే అవకాశం ఉండదు. ఎవరికైనా ఫోన్ దొరికినా లేదా కొట్టేసినా అది నిరుపయోగమే.

CEIR System: ఎవరి ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా వెంటనే చాలా మంది చేసే పని.. మొబైల్ నెంబర్ బ్లాక్ చేయడం. సిమ్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు చాలా మంది వెంటనే సిమ్ బ్లాక్ చేయిస్తారు. దీనివల్ల చోరీ చేసిన వాళ్లు ఆ ఫోన్‌ను మాత్రం వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఇకపై ఇలాంటి సందర్భాల్లో మొబైల్ ఫోన్‌ను కూడా బ్లాక్ చేయించవచ్చు. దీనికి తగ్గ సాంకేతికతను కేంద్రం ప్రభుత్వం అభివృద్ధి చేయించింది. ఈ టెక్నాలజీని ఈ నెల 17 నుంచి అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. సెంటర్ ఫర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీమేటిక్స్ (సీడాట్) ఈ టెక్నాలజీని రూపొందించింది.
ఇది బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమలుకానుండగా.. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీన్ని సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ (సీఈఐఆర్) సిస్టమ్ పేరుతో అమలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వ్యవస్థను అమలు చేసేందుకు తగ్గట్లుగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు సీడాట్ సీఈవో రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఇది అమల్లోకి వస్తే పోయిన తమ ఫోన్‌లోని సమాచారాన్ని ఇతరులు యాక్సెస్ చేయకుండా కాపాడుకోవచ్చు. అంటే ఫోన్ ఇతరులు వాడుకునే అవకాశం ఉండదు. ఎవరికైనా ఫోన్ దొరికినా లేదా కొట్టేసినా అది నిరుపయోగమే. ఇంతకీ ఈ సర్వీస్ ఎలా పని చేస్తుందంటే.. ప్రతి మొబైల్ ఫోన్‌కు సంబంధించి ఐఎంఈఐ నెంబర్‌ను ముందే వెల్లడించాలి. మొబైల్ నెట్‌వర్క్ సంస్థల వద్ద ఐఎంఈఐ నెంబర్ల లిస్ట్ ఉంటుంది. దీంతో కొత్తగా సృష్టించే ఐఎంఈఐ నెంబర్లు కలిగిన మొబైల్స్ తమ నెట్‌వర్క్ పరిధిలోకి వస్తే వెంటనే టెలికాం సంస్థలు గుర్తిస్తాయి.
దీని ద్వారా ఈ సంస్థలు అప్రమత్తమవుతాయి. సీఈఐఆర్ సిస్టమ్, మొబైల్ నెట్‌వర్క్ సంస్థల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా పోయిన ఫోన్లను ఐఎంఈఐ నెంబర్ల ఆధారంగా ట్రాక్ చేయడంతోపాటు బ్లాక్ కూడా చేయొచ్చు. ఫోన్లు ఎవరి చేతిలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా.. పోయిన లేదా చోరీకి గురైన ఫోన్లను ఇలా బ్లాక్ చేయవచ్చు. దీంతో ఆ ఫోన్లు పని చేయవు. ఇలా కొట్టేసిన ఫోన్లు పని చేయకుండా ఉంటే దొంగతనాలు కూడా తగ్గుతాయి. అలాగే చోరీకి గురైన ఫోన్ ఎక్కడుందో కూడా సులభంగా కనిపెట్టవచ్చు. ఈ విధానాన్ని అమలు చేసి ఇటీవల కర్ణాటకలో రెండున్నర వేలకుపైగా ఫోన్లను రికవరీ చేశారు.