Hindenburg: ట్విట్టర్‌ కో ఫౌండర్‌కు హిండెన్‌బర్గ్ షాక్‌

హమ్మయ్య.. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఈసారి మన జోలికి రాలేదు అంటూ ఊపిరి పీల్చుకుంటున్నాయి భారతీయ సంస్థలు. ఈ మధ్య అదానీని ముంచేసిన ఈ రీసెర్చ్‌ సంస్థ ఈసారి ట్విట్టర్‌ సహవ్యవస్థాపకుడు జాక్‌డోర్సేకు చెందిన సంస్థపై పడింది. దీంతో ఆ సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2023 | 12:04 PMLast Updated on: Mar 25, 2023 | 12:04 PM

Hindenburg Effect On Twitter

ఆర్థిక సేవలు, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవల సంస్థ ‘బ్లాక్‌’ భారీ అక్రమాలకు పాల్పడిందన్నది హిండెన్‌బర్గ్‌ లేటెస్ట్‌ నివేదిక సారాంశం. ఖాతాదార్ల సంఖ్యను ఎక్కువ చేసి చూపించి సంస్థ షేరు విలువను కృత్రిమంగా పెంచేశారన్నది ఆరోపణ. ఖర్చుల వివరాలను తక్కువ చేసి చూపారని దీంతో సంస్థ లాభాల్లో ఉందని నమ్మేలా చేశారంటోంది. ఇలా పెట్టుబడిదారులను, ప్రభుత్వాన్ని బ్లాక్‌ మోసం చేసిందన్నది హిండెన్‌బర్గ్‌ వాదన. బ్లాక్‌ వినియోగదారుల్లో ఎక్కువ మంది నేరస్థులు, అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారు ఉన్నారంటోంది హిండెన్‌బర్గ్‌… బ్యాంకింగ్ వ్యవహారాలకు దూరమైన నేరస్తులకు..బ్లాక్‌ బ్యాంకింగ్ సేవలను దగ్గర చేసిందని.. వారు స్కామ్‌ల్లో దోచుకున్న సొమ్మును తరలించడానికి ఇది ఉపయోగపడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా ఖాతాదారులు నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా కేవలం ఎకౌంట్‌ను మాత్రమే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేదని, కస్టమర్‌ను మాత్రం బ్యాన్‌ చేసేది కాదని హిండెన్‌బర్గ్‌ ఆరోపిస్తోంది. డ్రగ్‌ డీలర్స్‌, కిడ్నాపర్లు, సెక్స్‌ట్రాఫికర్లు, డబ్బుకోసం హత్యలు చేసేవారికి నగదు సరఫరాకు బ్లాక్‌ యాప్‌ వరంలా మారిందన్నది మరో సంచలన ఆరోపణ.

ఈ బ్లాక్‌ సంస్థను ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే నెలకొల్పారు. గతంలో దీన్ని స్వేర్‌ అని పిలిచేవారు. దీని మార్కెట్‌ విలువ 44బిలియన్ డాలర్లు.. వ్యాపారస్తులు, సామాన్యులకు ఇది పేమెంట్స్‌, మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందించేది. దీని కార్యకలాపాలు ఇటీవల భారీగా పెరిగాయి. రెండేళ్లపాటు ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలపై రీసెర్చ్‌ చేసిన హిండెన్‌బర్గ్ సంచలన విషయాలు బయటపెట్టింది. మాజీ ఉద్యోగులు, అధికారులు, వాటాదారులు, ఇండస్ట్రీ నిపుణుల ఇంటర్వ్యూలను ప్రచురించింది. ఈ సంస్థ ఖాతాల్లో 40 నుంచి 75శాతం నకిలీవి లేదా ఆర్థిక అవకతవకలకు సంబంధించినవి లేదా డూప్లికేట్‌ అని మాజీ ఉద్యోగులు చెప్పారంటోంది. డొనాల్డ్‌ ట్రంప్‌, ఒబామా, ఎలాన్‌మస్క్‌ ఇలా సెలబ్రిటీల పేర్లతోనూ ఫేక్‌ ఎకౌంట్లు క్రియేట్‌ చేశారని ఆధారాలు బయటపెట్టింది హిండెన్‌బర్గ్‌.

ఈ సంస్థ వ్యవస్థాపకులతో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయిన ఇండియన్ అమృతా అహుజా, మేనేజర్‌ గ్రాస్సాడోనియా కూడా సంస్థ షేరుపై భారీగా పెట్టుబడులు పెట్టారని చెబుతోంది. కరోనా సమయంలో వ్యవస్థాపకులు సుమారు 100 కోట్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించారని హిండెన్‌బర్గ్‌ తన రిపోర్ట్‌లో ప్రకటించింది.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ దెబ్బకు బ్లాక్‌ షేర్లు నేలకు దిగాయి. ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల సంపద మాయమైపోయింది. జాక్‌ డోర్సే సంపద దాదాపు 5వేల కోట్లు తగ్గిపోయింది. గురువారం ఏకంగా 14.8శాతం పడిపోయిన బ్లాక్‌ షేరు శుక్రవారం కూడా పతనమైంది. 2020లో కరోనా తర్వాత ఆ సంస్థ షేర్లు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ సంస్థపై రెగ్యులేటర్లు దృష్టిపెడుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మాత్రం షేరు విలువ మరింత పడిపోవడం ఖాయం.

జనవరి 24న హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అదానీ గ్రూప్‌పై విడుదల చేసిన నివేదిక మన మార్కెట్లను కుదిపేసింది. ఆ దెబ్బకు 11లక్షల 52వేల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది. అదానీ కౌంటర్లలోని దాదాపు అన్ని షేర్లు 52వారాల కనిష్టస్థాయిని తాకాయి. ఆ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. నివేదిక వచ్చి రెండు నెలలైనా అదానీ షేర్లు ఏ మాత్రం కోలుకోలేదు. ఇప్పుడు బ్లాక్‌పై పడింది. రానున్న రోజుల్లో ఇది ఇంకెన్ని సంస్థలను టార్గెట్‌ చేస్తుందో చూడాలి.