Home Loan EMI: ఇళ్ల ఈఎంఐలు తగ్గేదెప్పుడు..? ఆర్‌బీ‌ఐ ఏమంటోంది..!

కరోనా సమయంలో గృహరుణ వడ్డీరేట్లు బాగా తగ్గాయి. కానీ గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం వడ్డీరేట్లు భారీగా పెరిగాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ రెపోరేటు పెంచుకుంటూ పోయింది. దాని ప్రభావం గృహరుణ వినియోగదారులపై గట్టిగానే పడింది. ఈఐఎం ఒక్కసారిగా పెరిగిపోయింది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 2, 2023 | 08:37 AMLast Updated on: Aug 02, 2023 | 8:37 AM

Home Loan Emis Are Not Reducing Because Of This Reason

Home Loan EMI: గృహ రుణ వినియోగదారులందరి మనసులోని ప్రశ్న ఇది. భారీగా పెరిగిన ఈఎంఐ భారం తగ్గేదెప్పుడు.. ఊరట కలిగేదెప్పుడు అనే. కానీ ఇప్పట్లో ఆ అవకాశం కనిపించడం లేదు. మార్కెట్ పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. ఎందుకంటే..!
కరోనా సమయంలో గృహరుణ వడ్డీరేట్లు బాగా తగ్గాయి. కానీ గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం వడ్డీరేట్లు భారీగా పెరిగాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ రెపోరేటు పెంచుకుంటూ పోయింది. దాని ప్రభావం గృహరుణ వినియోగదారులపై గట్టిగానే పడింది. ఈఐఎం ఒక్కసారిగా పెరిగిపోయింది. తక్కువలో తక్కువ తీసుకున్నా రూ.2 వేల నుంచి 3 వేల వరకూ భారం పడింది. అదే కాస్త ఎక్కువ మొత్తం తీసుకున్నవారికి ఆ భారం ఇంకాస్త ఎక్కువే. తక్కువ వడ్డీరేటు కదా అని సొంతిల్లు కూడబెట్టుకోవడానికి ప్రయత్నించిన మధ్యతరగతి వారిది మింగలేని, కక్కలేని పరిస్థితి.
ఎంత కాలం వేచి చూడాలి..?
త్వరలో గృహరుణాలపై ఈఎంఐ తగ్గకపోతుందా అని ఎదురు చూస్తున్న వారు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఇంకా చెప్పాలంటే వచ్చే ఏడాది జూన్ వరకూ ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత రెపోరేటు 6.5శాతాన్ని మరికొంత కాలం కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. రాయిటర్స్ ఇటీవల ఆర్థిక వేత్తలతో నిర్వహించిన సర్వేలోనూ వచ్చే ఏడాది మార్చి వరకు రెపోరేటు ఇలాగే ఉంటుందని మెజారిటీ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలంటే ఇది తప్పనిసరని వారు అంటున్నారు.
ద్రవ్యోల్బణం టెన్షన్
వడ్డీరేట్లను నిర్ణయించే ద్రవ్యోల్బణం వరుసగా నాలుగు నెలలు తగ్గింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలోగానే గత నెలలో 4.81శాతానికి పెరిగింది. వచ్చే మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరం వరకు సగటున ద్రవ్యోల్బణం ఐదుశాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ పెట్టుకున్న 4శాతం కంటే ఇది ఒకశాతం అధికం. ఇన్‌ఫ్లేషన్ అదుపులోకి వచ్చే వరకు ఆర్‌బీఐ వెనక్కు తగ్గదు.
వచ్చే ఏడాది జూన్ వరకూ తగ్గవా..?
జూన్‌లో రాయిటర్స్ నిర్వహించిన సర్వే ప్రకారం 2024 మార్చి చివరకు రెపోరేటును రిజర్వ్ బ్యాంక్ పావుశాతం తగ్గిస్తుందని, ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని ఆర్థికవేత్తలు భావించారు. కానీ తాజా సర్వేలో వచ్చే ఏడాది తొలి త్రైమాసికం అంటే జూన్ చివరకు కానీ రెపోరేటు 25బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం లేదు. అంటే అప్పటివరకు గృహరుణాలపై ఈఎంఐలు తగ్గే అవకాశం లేదన్నమాట. ఆర్‌బీఐ ఇదే రేపోరేటును కొనసాగించినంత కాలం బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించవు. అంటే ఈఎంఐల భారం తగ్గదన్నమాట.
ఏంటీ రెపోరేటు..?
రెపోరేటు అనే పదం ఆర్‌బీఐ సమీక్షల సమయంలో తరచూ వినబడే మాట. ఆర్‌బీఐ కమర్షియల్ బ్యాంకులకు ఏ రేటుకు వడ్డీకి అప్పు ఇస్తుందో ఆ రేటునే రెపోరేటు అంటారు. రెపోరేటు పెరిగితే బ్యాంకులపై వడ్డీభారం పెరుగుతుంది. దాన్ని వినియోగదారులకు బ్యాంకులు బదిలీ చేస్తాయి. గతేడాది ఏప్రిల్ వరకు రెపోరేటు 4శాతంగా ఉండేది. దీంతో బ్యాంకులు తక్కువ ధరకే గృహరుణాలు ఇచ్చాయి. కానీ ఆ తర్వాత ఏడాదిలోనే రెండున్నరశాతం అంటే 250 బేసిస్ పాయింట్లు పెంచేసింది. రెపోరేటు ఆరున్నర శాతానికి చేరడంతో బ్యాంకులు ఇస్తున్న గృహరుణ వడ్డీ 9శాతం దాటిపోయింది.