Home Loans: గృహరుణం మళ్లీ పెరగబోతోందా…? వడ్డీ రేట్ల బాదుడు ఇంకెంతకాలం…?

హోం లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నారా...? ఏడాది కాలంగా పెరుగుతున్న వడ్డీరేట్లతో చుక్కలు చూస్తున్నారా...? మరోసారి వడ్డీరేట్లు పెరుగుతాయా...? పెరిగితే మళ్లీ ఎంత పెంచొచ్చు....? ఎప్పుడు పెంచొచ్చు....?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2023 | 02:41 PMLast Updated on: Feb 15, 2023 | 2:41 PM

Home Loans Costs High

హోం లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నారా..? ఏడాది కాలంగా పెరుగుతున్న వడ్డీరేట్లతో చుక్కలు చూస్తున్నారా..? మరోసారి వడ్డీరేట్లు పెరుగుతాయా..? పెరిగితే మళ్లీ ఎంత పెంచొచ్చు…? ఎప్పుడు పెంచొచ్చు..? మీకు ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలా..? అయితే ఈ స్టోరీ మీకోసమే..

మొన్నే 25బేసిస్ పాయింట్లు పెంచిన RBI ఏప్రిల్‌లో మరోసారి బెండు తీసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంటే ఈ నెలలో ఓమారు వడ్డీవాయింపు తప్పదు.. మళ్లీ ఏప్రిల్‌లో ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ మరికొంత పెంచే అవకాశాలున్నాయి. అంటే రెండు నెలల్లో రెండుసార్లు వడ్డింపుకు రెడీ కావాలన్నమాట..

ఇటీవలే RBI రెపోరేటు 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీన్ని కమిటీలోని కొందరు వ్యతిరేకించినప్పటికీ మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఓకే చేశారు. ఇక వడ్డీరేట్ల బాదుడుకు బ్రేక్ పడుతుందని అంతా భావించినా ఏప్రిల్‌లో మరోసారి వడ్డీరేట్లు (Interest rates) పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. రీటైల్ ద్రవ్యోల్బణం పెరగడం ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆర్‌బీఐ డేంజర్ లైన్ 6శాతాన్ని దాటేసింది. మూడునెలల గరిష్ఠస్థాయి 6.52శాతానికి చేరింది. దీంతో ఏప్రిల్‌ ఆర్‌బీఐ మరో 25బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందని ఫారిన్ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. టోకు ద్రవ్యోల్బణం తగ్గినా రీటైల్ ద్రవ్యోల్బణం పెరగడం విశేషం. దీంతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ రేట్లు పెంచక తప్పదంటున్నారు. ఇన్‌ఫ్లేషన్ కట్టడికి ఆర్‌బీఐ అమలు చేస్తున్న విధానం వడ్డీరేట్ల వాయింపే.. సో మరోసారి బాదుడు రెడీ అయిపోవాల్సిందే.

ఇటీవల పెంచిన 25బేసిస్‌ పాయింట్లను తీసుకుంటే రెపోరేటు 6.5శాతానికి చేరుకుంది. గతేడాది మే నుంచి తీసుకుంటే 250 బేసిస్‌ పాయింట్లు పెరిగినట్లైంది. ఒక్కో బేసిస్ పాయింట్ 0.01శాతానికి సమానం. అంటే వడ్డీరేటు రెండున్నర శాతం పెరిగినట్లు.. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే 2022 మేలో ఓ వ్యక్తి SBIనుంచి పదేళ్ల కాలపరిమితితో 30లక్షల గృహరుణం తీసుకుని ఉంటే 6.65శాతం ప్రకారం ఈఎంఐ 34వేల 294 రూపాయలుగా ఉంది. కానీ ఇప్పుడు 8.9శాతం వడ్డీరేటుతే అదే ఈఎంఐ 37వేల 841రూపాయలకు చేరింది. అంటే దాదాపు మూడున్నర వేల రూపాయల భారం పెరిగింది. ఇటీవల పెంచిన రెపోరేటును కూడా పరిగణలోకి తీసుకుంటే అది మరికాస్త పెరుగుతుంది.

ఏడాదికాలంగా వరుసగా వడ్డీరేట్లు పెరుగుతున్నాయి. ఓ మోస్తరు అపార్ట్‌మెంట్ తీసుకున్నవారిపై కూడా నెలకు నాలుగైదు వేల రూపాయల భారం పెరిగిపోయింది. ఇది నెలవారీ బడ్జెట్‌ను తల్లకిందులు చేసింది. వడ్డీరేట్లు తక్కువ ఉన్నాయి కదా అని ధైర్యం చేసి ఇల్లు కొన్న మధ్యతరగతి మానవులు ఇప్పుడు తప్పుచేశాంరా బాబు అని తలపట్టుకుంటున్నారు. కానీ రిజర్వ్ బ్యాంక్ మాత్రం అప్పుడే ఏమైంది ముందుంది మొసళ్ల పండగ అంటోంది. ఏం చేస్తాం లోన్ తీసుకున్నాక తప్పదుగా.. కానివ్వండి మీరు బాదండి మేం భరిస్తుంటాం..