Stock Markets: స్టాక్‌మార్కెట్లలో ఒడిదుడుకులు ఎంతకాలం…? 

స్టాక్‌మార్కెట్లు గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నాయి. సాధారణ ఇన్వెస్టర్లు మార్కెట్లంటే భయపడే పరిస్థితి నెలకొంది. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2023 | 07:35 PMLast Updated on: Mar 06, 2023 | 7:35 PM

How Long Are Fluctuations In Stock Markets

స్టాక్‌మార్కెట్లు గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నాయి. సాధారణ ఇన్వెస్టర్లు మార్కెట్లంటే భయపడే పరిస్థితి నెలకొంది. మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఓ రోజు మార్కెట్ పుంజుకుందంటే మరో రోజు ఏదో ఓ నెగెటివ్‌ వార్త వస్తోంది. రెండు మూడు రోజులు నష్టాలే… ఈ పరిస్థితుల్లో సెన్సెక్స్ గమనం ఎలా ఉండబోతోంది. రెగ్యులర్ ట్రేడర్లు ఏం అంచనా వేస్తున్నారు…? నిపుణులేమంటున్నారు…?

యాక్సిస్‌ మై ఇండియా తాజాగా వెల్లడించిన కన్జ్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్‌ సర్వేలో స్టాక్ మార్కెట్ 70వేలకు చేరుతుందని మదుపరులు అంచనా వేస్తున్నారు. మూడు నెలల్లోనే మార్కెట్ 70వేలకు చేరువవుతుందని 43శాతం మంది గట్టిగా నమ్ముతున్నారు. మరో 16శాతం మంది మాత్రం 60వేలకంటే పైనే ఉంటుందని చెబుతున్నారు. అయితే 25శాతం మంది 55-65వేల మధ్య చలించొచ్చంటున్నారు. ఇక 18శాతం మంది మాత్రమే 50వేల దిగువకు పడిపోతుందని చెబుతున్నారు.

మెజారిటీ మదుపరులే కాదు కొన్ని ప్రముఖ సంస్థలు కూడా సెన్సెక్స్‌పై ఆశావాహంగానే ఉన్నాయి. ప్రస్తుతం 60వేల వద్ద ఉన్న సెన్సెక్స్‌ ఈ ఏడాది చివరకు 71వేల 6వందల వరకు ఉంటుందని ఐసీఐసీఐ డైరెక్ట్ ఇటీవల అంచనా వేసింది. నిఫ్టీ 21వేల 5వందలు దాటుతుందని చెబుతోంది. మరో బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ కూడా నిఫ్టీ 21వేల 5వందలు అధిగమిస్తుందని ఇటీవల అంచనా వేసింది. మూడో త్రైమాసికం ఫలితాలు మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయని చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్‌ పట్ల 52శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేసినట్లు యాక్సిట్ మై ఇండియా-సీఎస్‌ఐ చెబుతోంది. యాక్సిస్ మై ఇండియా సర్వేపై మార్కెట్లలో మంచి అంచనాలే ఉన్నాయి. కన్జ్యూమర్ డేటా ఇంటెలిజెన్స్‌ కన్సల్టెన్సీగా దీనికి మంచి పేరుంది. దీని యాక్యురసీ రేటు 94శాతంగా ఉంది. 28రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 737 జిల్లాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ప్రముఖ రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కూడా భారతీయ స్టాక్ మార్కెట్లపై ఆశాభావంగానే ఉంది. ఆ సంస్థ అంచనాల ప్రకారం 30స్టాక్ ఇండెక్స్ సెన్సెక్స్ ఈ ఏడాది చివరకు 68వేల 5వందల మార్క్‌ను అందుకోవచ్చు. బుల్స్‌ దూకుడు కనుక పెరిగితే 80వేలు టచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నది మోర్గాన్ స్టాన్లీ అంచనా. ఒకవేళ దారుణ పరిస్థితులు ఎదురైతే మాత్రం సెన్సెక్స్ 52వేలకు పడిపోవచ్చన్నది ఆ సంస్థ అభిప్రాయం. అయితే ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగి బేర్స్‌పై బుల్స్‌ పట్టు బిగుస్తాయని మెజారిటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశ అభివృద్ధి ఊహించిన మార్గంలోనే సాగడం, ధరలు భారీగా పెరగబోవన్న అంచనాలు, అమెరికా మాంద్యంలోకి వెళ్లబోదన్న లెక్కలు మార్కెట్ల గమనాన్ని నిర్దేశం చేయవచ్చంటున్నారు. మొత్తంగా చూస్తే తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను కాస్త బలపరిచే వార్తే ఇది..
( Note: ఇవన్నీ అంచనాలు మాత్రమే… ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి…)

(KK)