Safe Banks: బ్యాంకుల్లో మన సొమ్ము సేఫ్‌గా ఉండాలంటే…!?

ఎంత సంక్షోభం వచ్చినా మన బ్యాంకులు తట్టుకుని నిలబడ్డాయి కానీ పూర్తిగా మునిగిపోలేదు. ఒకటీ అరా చిన్నా చితకా బ్యాంకులు మాత్రమే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి కస్టమర్లను ముంచేశాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2023 | 09:43 AMLast Updated on: Mar 15, 2023 | 10:00 AM

How To Keep Our Money Safe In Banks

అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభంతో అన్ని చోట్ల బ్యాంకులపై ఒత్తిడి పడింది. మన బ్యాంకులు సేఫేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ చిట్కాలు పాటిస్తే బ్యాంకులు మునిగినా డిపాజిటర్లు మాత్రం సేఫ్ గా బయటపడతారు.ఇంతకీ ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే…!

అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంకు ఎందుకు మునిగిపోయిందో సింపుల్ గా చెప్పాలంటే… డిపాజిట్ల ఉపసంహరణే కొంప ముంచింది. 100గంటల్లో బ్యాంకు మునిగిపోయింది. నిజానికి ఆ బ్యాంకు భారీగా అవకతవకలకు పాల్పడలేదు. అయితే లాంగ్ టర్మ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టింది. వడ్డీరేట్లు పెరగడంతో వాటిపై పెద్దగా రాబడి రాలేదు. బ్యాంకు దివాళా తీస్తుందన్న ప్రచారం జరిగింది. దీంతో ఖాతాదారులు నగదు ఉపసంహరణకు బారులు తీరారు. బ్యాంకు కుప్పకూలింది.

అమెరికాలో రెండున్నర లక్షల డాలర్ల వరకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ ఉంటుంది. అంతకు మించి డిపాజిట్లు ఉన్నా దానికి ఎలాంటి బీమా ఉండదు. మరి మన దగ్గర ఎలాంటి నిబంధనలున్నాయో తెలుసా…? బ్యాంకులో మనం దాచుకున్న నగదులో 5లక్షల రూపాయల వరకు బీమా ఉంటుంది. అంటే ఫిక్స్ డ్ డిపాజిట్లు, రికరింగ్, సేవింగ్స్, కరెంట్ ఎకౌంట్ ఇలా అన్నింటిలో కలిపి ఎంత ఉన్నా సరే 5లక్షల రూపాయల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకో మెలిక కూడా ఉంది. అదే బ్యాంకుకు చెందిన వేరే బ్రాంచ్ లో ఖాతా ఉన్నా అన్నింటినీ కలుపుతారు. అంటే మీకు XYZ బ్యాంకులోని మూడు బ్రాంచుల్లో ఎకౌంట్ ఉండి ఒక్కోదాంట్లో 10లక్షల చొప్పున 30లక్షల రూపాయల నగదు ఉన్నా మీకు వర్తించే ఇన్సూరెన్స్ 5లక్షల రూపాయలు మాత్రమే… ఒకవేళ ఆ బ్యాంకు మునిగిపోతే చేతికి వచ్చేది పక్కాగా 5లక్షల రూపాయలు మాత్రమే.

ఐదు లక్షల నగదు కంటే ఎక్కువ మొత్తం ఉంటే ఏం చేయాలి అన్న ప్రశ్న వస్తుంది. కష్టపడి దాచుకున్న రూపాయి రూపాయి మనకు ముఖ్యమే… కష్టార్జితాన్ని వృధాగా పోనిస్తామా…? ఇలాంటి సమయంలో చాలా తెలివిగా వ్యవహరించాలి. ఒక బ్యాంకులో ఎన్ని బ్రాంచుల్లో నగదు దాచుకున్నా ఐదు లక్షలకే బీమా వస్తుంది. కానీ వేర్వేరు బ్యాంకుల్లో ఉంటే కాదు. మీకు XYZ, ABC, MNN బ్యాంకుల్లో ఖాతాలుంటే…ఒకవేళ ఈ మూడు బ్యాంకులు దివాళా తీసినా మూడు ఐదులక్షల చొప్పున 15లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ వస్తుందన్నమాట. అంటే మన భద్రత మూడు రెట్లు పెరిగిందన్నమాట. మరో మార్గం కూడా ఉంది. కుటుంబసభ్యుల పేరిట కూడా ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చు. నిజానికి 2020 వరకు ఈ ఇన్సూరెన్స్ లక్ష రూపాయలుగానే ఉండేది. మోడీ ప్రభుత్వం దాన్ని 5లక్షలకు పెంచింది. దేశంలోని అన్ని బ్యాంకులకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.

మరి పెద్దపెద్ద సంస్థలు బ్యాంకుల్లో వందలకోట్లు ఉంచుతాయి కదా అంటే వాటికి కూడా ఇదే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అయతే మన దేశంలో ఏ పెద్ద బ్యాంకు కూడా ఇంతవరకు దివాళా తీయలేదు. చిన్న చిన్న బ్యాంకులు స్థానికంగా ఆర్బీఐకి తెలియకుండా కొంతమేర మదుపరులను మోసం చేశాయి. పైగా మన దేశంలో చిన్న చిన్న మదపరులే ఎక్కువ. అందరూ బ్యాంకుల్లో కోట్లలో డిపాజిట్లు చేయలేరు. కాబట్టి వారి సొమ్ముకు ఎలాంటి భయం ఉండదు. ఒకవేళ కాస్తో కూస్తో ఎక్కువగా ఉన్నా ఆ మొత్తాన్ని రెండు మూడు బ్యాంకుల్లో దాచుకుంటే ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు కొంత మేర సురక్షితంగా ఉంటాం.

ఒకవేళ బ్యాంకులు దివాళా తీస్తే ఎప్పట్లోగా నగదు తిరిగి మన చేతికి వస్తుందన్నది మరో ప్రశ్న. గతంలో ఇందుకు చాలా కాలం పట్టేది. ఒక్కోసారి ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ 2021 సెప్టెంబరులో తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం మూడు నెలల్లోగా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ బ్యాంకును తన అధీనంలోకి తీసుకోగానే 45రోజుల్లో డీఐసీజీసీకి క్లెయిమ్ జాబితా పంపాలి. ఆ జాబితా అందుకున్న నెలరోజుల్లో వాటిని వాలిడేట్ చేయాలి. ఆ తర్వాత 15రోజుల్లోగా నగదును ఖాతాదారులకు అందించాలి.

బ్యాంకులంటే మనకు ఎంతో భరోసా… అలాంటి బ్యాంకులే మనల్ని మోసం చేస్తే ఎలా అన్న అనుమానాలు తలెత్తుతాయి. నిజానికి మన బ్యాంకులు చాలా వరకు సేఫే… ఆర్బీఐ కఠిన నిబంధనలే అమలు చేస్తుంది. అమెరికా వంటి దేశాలతో పోల్చితే మన బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉందో గతంలో చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఎంత సంక్షోభం వచ్చినా మన బ్యాంకులు తట్టుకుని నిలబడ్డాయి కానీ పూర్తిగా మునిగిపోలేదు. ఒకటీ అరా చిన్నా చితకా బ్యాంకులు మాత్రమే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వెళ్లి కస్టమర్లను ముంచేశాయి. కాబట్టి మన బ్యాంకులపై అపనమ్మకం పెట్టుకోవాల్సిన పనిలేదు. తెలివిగా వ్యవహరిస్తే గుండెలపై చేతులు పెట్టుకుని సుఖంగా నిద్రపోవచ్చు.. మన సొమ్ము భద్రం.. మన ఆర్థిక ఆరోగ్యం మరింత భద్రం.

(KK)