Russian crude oil: ఇండియాకు షాక్ ఇస్తున్న రష్యా..? చమురు దిగుమతులపై డిస్కౌంట్ ఎత్తివేస్తోందా..? కారణమేంటి..?
యుద్ధం వల్ల రష్యా తక్కువ ధరకే ఇండియాకు చమురు సరఫరా చేస్తోంది. దీంతో ఇతర దేశాలతో పోలిస్తే చవకగా చమురును ఇండియా దిగుమతి చేసుకుంటూ లబ్ధి పొందుతోంది. అయితే, ఇప్పుడు రోజులు మారుతున్నట్లే కనిపిస్తోంది.
Russian crude oil: రష్యా-యక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాలకే కాదు.. ప్రపంచంలోని అనేక దేశాలకు నష్టం కలిగింది. కానీ, దీనివల్ల లబ్ధి పొందిన దేశం ఏదైనా ఉందీ అంటే.. అది ఇండియానే! కారణం యుద్ధం వల్ల రష్యా తక్కువ ధరకే ఇండియాకు చమురు సరఫరా చేస్తోంది. దీంతో ఇతర దేశాలతో పోలిస్తే చవకగా చమురును ఇండియా దిగుమతి చేసుకుంటూ లబ్ధి పొందుతోంది. అయితే, ఇప్పుడు రోజులు మారుతున్నట్లే కనిపిస్తోంది. చమురు డిస్కౌంట్‌ను రష్యా క్రమక్రమంగా తగ్గిస్తోంది. గతంలో వచ్చిన డిస్కౌంట్ ఇప్పుడు రావడం లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి కారణాలేంటి? భవిష్యత్తులో చమురు డిస్కౌంట్ పూర్తిగా ఎత్తేస్తుందా?
రష్యాకు ప్రధాన ఆదాయ వనరు చమురు. అక్కడ చమురు భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. దీన్ని అమెరికా, యూరప్, చైనా వంటి దేశాలకు ఎగుమతి చేసి రష్యా ఆదాయం సంపాదించుకుంటుంది. ఇండియాకు కూడా సరఫరా చేస్తుంది. కానీ, రష్యా నుంచి ఇండియా దిగుమతి చేసుకునే వాటా చాలా తక్కువగా ఉండేది. యుక్రెయిన్ యుద్ధం కారణంగా పరిస్థితులు మారాయి. యుక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో అమెరికాతోపాటు అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. తాము రష్యా నుంచి చమురు కొనబోమని ప్రకటించాయి. దీంతో చమురు నిల్వలు భారీగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. అనేక దేశాలకు ఎగుమతి చేయాల్సిన చమురు రష్యా వద్ద మిగిలిపోయింది. దీన్నే ఇండియా తనకు అనుకూలంగా మార్చుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు అంగీకరించింది. అది కూడా గతంలోలాగా స్వల్ప పరిమాణంలో కాకుండా.. భారీగా చమురును దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదిరింది. అందులోనూ ఇతర దేశాలతో పోలిస్తే డిస్కౌంట్ ధరకే ఇండియాకు ఆయిల్ ఇచ్చేందుకు రష్యా అంగీకరించింది. దీంతో గత ఏడాది నుంచి ఇండియాకు రష్యా డిస్కౌంట్‌తో ఆయిల్ అందిస్తోంది.
పెరిగిన దిగుమతులు
అంతకుముందు ఇండియా అరబ్ దేశాల నుంచి ఎక్కువగా చమురు కొంటూ వచ్చేది. రష్యా నుంచి తక్కువ పరిమాణంలో దిగుమతి చేసుకునేది. కానీ, చవకగా ఆయిల్ ఇచ్చేందుకు రష్యా అంగీకరించడంతో ఆ దేశం నుంచి చమురు దిగుమతుల్ని ఇండియా పెంచుకుంది. ఇప్పుడు రష్యా నుంచి ఎక్కువ చమురు దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఇండియా నిలిచింది. అది కూడా అరబ్ దేశాలు అందిస్తున్న ధరకన్నా తక్కువ ధరలోనే ఇండియాకు ఆయిల్ ఇస్తుండటం విశేషం. యుద్ధం మొదలైన తర్వాత నుంచి భారత్ ఈ రకంగా రష్యా నుంచి చమురు దిగుమతితో లాభపడింది. ఇదే సమయంలో రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని అమెరికా వంటి దేశాలు హెచ్చరించినప్పటికీ ఇండియా వినలేదు. వాటి మాటను కాదని మరీ.. ఇండియా, చైనా మాత్రమే భారీ స్థాయిలో ఆయిల్ దిగుమతి చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు పరిస్థితులు మారినట్లే కనిపిస్తోంది. రష్యా అందిస్తున్న డిస్కౌంట్ చాలా వరకు తగ్గింది.
కారణమేంటి?
ఇన్నాళ్లూ భారీ డిస్కౌంట్ ఇచ్చిన రష్యా ఇప్పుడు మెల్లిగా డిస్కౌంట్ తగ్గిస్తోంది. దీనికి కారణం ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనేందుకు ఇతర దేశాలు కూడా ముందుకురావడమే. గతంలో చైనా, ఇండియా మాత్రమే భారీగా చమురు దిగుమతులు చేసుకునేవి. ఇతర దేశాలు ఆసక్తి చూపకపోవడంతో ఇండియాకు తక్కువ ధరకే ఆయిల్ ఇచ్చేందుకు రష్యా అంగీకరించింది. కానీ, ప్రస్తుతం ఇతర దేశాలు కూడా దిగుమతులు పెంచడంతో ఇండియాకు ప్రాధాన్యం తగ్గింది. అప్పట్లో ఒక్కో కార్గోకు ఒక్కో రకం డిస్కౌంట్ లభించేది. సగటున బ్యారెల్ చమురుపై 15-20 డాలర్ల డిస్కౌంట్ అందేది. ఇప్పుడు డిస్కౌంట్ ఇంకా తక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడు మొదటి స్థానానికి చేరుకుంది. రష్యా నుంచి చైనా ఇండియాకంటే ఎక్కువగా చమురు కొంటోంది. దీంతో ఇండియాకు డిస్కౌంట్ తగ్గిస్తున్నారు చమురు ఉత్పత్తిదారులు. యుక్రెయిన్ యుద్ధం ముగిసిందంటే చమురు డిస్కౌంట్ మరింత తగ్గే అవకాశం ఉంది.