De-dollarisation: డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా భారత్ వ్యూహం..!
ఇప్పటికే రష్యా-ఇండియా మధ్య రూబుల్స్, రూపాయల్లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య డాలర్లను వినియోగించడం లేదు. ఇప్పుడు ఈ విధానాన్ని ఇండియా యూఏఈతో కూడా అమలు చేయబోతుంది.
De-dollarisation: అంతర్జాతీయంగా చెల్లుబాటయ్యే కరెన్సీ అమెరికా డాలర్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మారకంగా వినియోగించేది డాలర్‌నే. అయితే, ఇప్పుడు ఈ డాలర్ ఆధిపత్యానికి గండికొట్టే దిశగా ప్రపంచ దేశాలు పావులు కదుపుతున్నాయి. చైనా, రష్యా వంటి దేశాలు ఇప్పటికే ఈ దిశగా కార్యాచరణను అమలు చేస్తుండగా ఇండియా కూడా ఇదే వ్యూహంతో ముందుకెళ్తోంది. దీంతో క్రమంగా అంతర్జాతీయ విపణిలో డాలర్ హవా తగ్గుతోంది.
ఒక దేశానికి, మరో దేశానికి మధ్య వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జరిగినప్పుడు అమెరికా డాలర్‌తోనే చెల్లింపులు చేస్తారు. అయితే, అమెరికా డాలర్ విలువ ఆధారంగా అనేక దేశాలు ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంటున్నాయి. డాలర్లలో చెల్లించడం వివిధ దేశాలకు భారంగా మారింది. ఇందుకోసం కొంత అదనంగా చెల్లించాల్సి వస్తుంది. పైగా డాలర్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ అమెరికా తన అవసరాల కోసం డాలర్ల చెలామణిని తగ్గిస్తూ వస్తోంది. దీంతో డాలర్ విలువ పెరుగుతూ ఉంటే.. ఇతర దేశాల కరెన్సీ విలువ తగ్గుతోంది. స్వదేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం అమెరికా వడ్డీ రేట్లను తరచూ పెంచుతూ ఉండటం వల్ల కూడా ఇతర దేశాలపై భారం పడుతోంది. ముఖ్యంగా ఇండియాలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదో పెద్ద సమస్యగా మారింది. డాలర్ల ప్రభావం విదేశీ మార్కెట్లపై పడుతోంది. అందుకే ఈ ఇబ్బందులకు చెక్ పెట్టాలంటే డాలర్ల వినియోగాన్ని తగ్గించాలని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
రష్యా ముందడుగు
డాలర్ల వినియోగాన్ని తగ్గించేందుకు రష్యా ముందడుగు వేసింది. డీ డాలరైజేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆగ్నేయాసియాతోపాటు, గల్ఫ్ దేశాల మధ్య దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అంటే డాలర్లు వాడకుండా ఆయా దేశాల కరెన్సీలో వ్యాపార చెల్లింపుల కోసం వాడుతున్నారు. ఇప్పటికే రష్యా-ఇండియా మధ్య రూబుల్స్, రూపాయల్లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య డాలర్లను వినియోగించడం లేదు. ఇప్పుడు ఈ విధానాన్ని ఇండియా యూఏఈతో కూడా అమలు చేయబోతుంది. ప్రస్తుతం యూఏఈలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. అక్కడి ప్రభుత్వంతో ఈ అంశంపై ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నారు. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయి ఒప్పందం కుదుర్చుకుంటారు.
ఆ తర్వాత ఇండియన్ కరెన్సీ.. యూఏఈ కరెన్సీల్లోనే ఇరు దేశాల మధ్య చెల్లింపులు ఉంటాయి. యూఏఈ నుంచి భారత్ ఎక్కువగా ముడి చమురు దిగుమతి చేసుకుంటుందనే సంగతి తెలిసిందే. అలాగే ఇండియా నుంచి ఆహారం, ఔషధాల్ని యూఏఈ దిగుమతి చేసుకుంటుంది. కరెన్సీ విషయంలో ఒప్పందం కుదిరిన తర్వాత యూఏఈకి ఇండియా రూపాయల్లో చెల్లింపులు చేస్తుంది. ఇండియాకు యూఏఈ వారి దిర్హామ్స్‌లో చెల్లిస్తుంది. ఆ తర్వాత కరెన్సీని ఇరు దేశాలు మారకానికి వినియోగిస్తాయి. రెండు దేశాల కరెన్సీని యూఏఈ, ఇండియా వాడబోతున్నాయి. అంటే అమెరికా డాలర్ వినియోగం ఇరు దేశాల మధ్య రద్దవుతుంది.