Gold buy or not?: బంగారం ఇప్పుడు కొనాలా లేక వెయిట్ చేయాలా?

పెళ్లిళ్ల సీజన్ లో పసిడి దూకుడు చూసి జనం కంగారు పడ్డారు. అయితే గత కొన్నిరోజులుగా మళ్లీ కంట్రోల్లోకి వచ్చింది. మరి పసిడి ఇంకా తగ్గుతుందా...? లేక మళ్లీ పెరుగుతుందా...? ఇప్పుడు కొనాలా లేక వెయిట్ చేయాలా...?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2023 | 09:53 PMLast Updated on: Feb 16, 2023 | 10:02 PM

Is It Right Time To Buy Gold Or Not

బంగారం… ఈ మధ్య కొన్నాళ్లు గాల్లో విహరించింది. ఇంకెక్కడికి చేరుతుందో అని భయపెట్టింది. పెళ్లిళ్ల సీజన్ లో పసిడి దూకుడు చూసి జనం కంగారు పడ్డారు. అయితే గత కొన్నిరోజులుగా మళ్లీ కంట్రోల్లోకి వచ్చింది. తాజాగా ఒకనెల కనిష్ఠానికి చేరుకుంది. మరి పసిడి ఇంకా తగ్గుతుందా…? లేక మళ్లీ పెరుగుతుందా…? ఇప్పుడు కొనాలా లేక వెయిట్ చేయాలా…?

అమెరికా ఆర్థిక మందగమన పరిస్థితుల నుంచి బయటపడుతుందన్న అంచనాలు పసిడిపై ప్రభావం చూపుతున్నాయి. బంగారం నెమ్మదిగా నేలకు దిగివస్తోంది. అమెరికా సీపీఐ ( కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ) డాటా మాంద్యం ముప్పు తొలగుతోందని చెబుతోంది. జనవరిలో అమెరికా రీటైల్స్ సేల్స్ కూడా గత రెండేళ్లతో పోల్చితే భారీగా పెరిగాయి. ఇవన్నీ బంగారాన్ని ప్రభావితం చేసేవే… ఔన్సు బంగారం ప్రస్తుతం 1840 డాలర్ల వరకు ఉంది. అంటే 28.34గ్రాములన్నమాట. ఇది 18వందల డాలర్లకంటే తక్కువకు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకొంతమంది అయితే 1,750 డాలర్లకు దిగువకు చేరొచ్చని భావిస్తున్నారు. ఇక మన దగ్గర మాత్రం పది గ్రాముల పసిడి 55వేల రేంజ్ లో కదలాడొచ్చని చెబుతున్నారు.

సాధారణంగా ప్రపంచ మార్కెట్లు సంక్షోభంలో ఉన్న సమయంలో ఎల్లో మెటల్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మందగమన పరిస్థితుల్లో నమ్మదగ్గ పెట్టుబడి సాధనంగా బంగారాన్ని ఎంచుకుంటారు. గతంలో కూడా ఎప్పుడు సంక్షోభ పరిస్థితులు ఎదురైనా షేర్లు, కరెన్సీ వంటి వాటితో పోల్చితే బంగారం మంచి రాబడిని అందించింది. అందుకే ఇటీవలి వరకు బంగారానికి మంచి డిమాండ్ ఉంది. రానున్న రోజుల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంటుందన్న అంచనాలతో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. పెద్దన్న అమెరికా కోలుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో సహజంగానే పసిడికి డిమాండ్ తగ్గుతుంది. అయితే కొన్ని వారాల కనిష్టానికి చేరినందున స్వల్పంగా పెరిగి మళ్లీ కరెక్షన్ బాట పడుతుందన్నది నిపుణుల భావన.

అమెరికా ఫెడ్ గత ఏడాది కాలంలో భారీగా వడ్డీరేట్లు పెంచుతోంది. ఫలితంగా డిపాజిట్ రేట్లు ఆకర్షణీయంగా మారాయి. పైగా రానున్న రోజుల్లో అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు మరింత పెంచుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 4.5 నుంచి 4.75గా ఉన్న రేట్లు జులై నాటికి 5.2 శాతానికి చేరతాయని అంచనా వేస్తున్నారు. అంటే వడ్డీరేట్లు మరింత పెరుగుతాయి. అదే జరిగితే బంగారం నుంచి మదుపరులు బ్యాంకు డిపాజిట్లవైపు మొగ్గుచూపుతారు. ఫలితంగా పసిడికి డిమాండ్ తగ్గుతుంది. పైగా పదేళ్ల కాలవ్యవధిగల అమెరికా ట్రెజరీ బాండ్ రాబడి భారీగా పెరగడం కూడా బంగారానికి డిమాండ్ ను తగ్గిస్తోంది.

మొత్తంగా పరిస్థితి చూస్తుంటే రానున్న రోజుల్లో బంగారం మరికాస్త దిగివచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే సమ్మర్ సీజన్ లో పెళ్లిళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన దగ్గర అప్పుడు డిమాండ్ పెరిగి ధర కాస్త స్వల్పంగా పెరగొచ్చని భావిస్తున్నారు. ఇటీవలి వరకు పది గ్రాముల బంగారం 62వేలకు చేరుతుందని అంచనా వేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ కుదుట పడుతున్నందున అక్కడిదాకా వెళ్లకపోవచ్చంటున్నారు. అయితే మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే మాత్రం పసిడిని పట్టుకోవడం కష్టమే.

(KK)