Jagan.. The Businessman: జగన్… ది బిజినెస్ మాన్!

పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఇలాంటి ఒప్పందాలు గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. అయితే అవన్నీ పేపర్లకే పరిమితమయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 4, 2023 | 10:08 AMLast Updated on: Mar 04, 2023 | 10:08 AM

Jagan The Businessman

ఆంధ్ర ప్రదేశ్ లో 2019లో అధికారంలోకి వచ్చింది వైసిపి. ఆ పార్టీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటినుంచి ఆయన పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. వివిధ పథకాల ద్వారా పేదలను ఆదుకునేందుకు నేరుగా నగదు బదిలీలు చేస్తూ వస్తున్నారు. ఇది సరికాదని, అభివృద్ధిని పక్కనపెట్టి పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి పెట్టడం భవిష్యత్తులో రాష్ట్రానికి మంచిది కాదని పలువురు విమర్శిస్తూ వచ్చారు. అయితే విమర్శకుల మాటలను ఏమాత్రం పట్టించుకోని జగన్ తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఇన్నాళ్లు అభివృద్ధిని పట్టించుకోలేదని వచ్చిన విమర్శలకు ఇప్పుడు జగన్ గట్టి సమాధానమే ఇచ్చారు.

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను గ్రాండ్ గా నిర్వహించి విమర్శకుల నోళ్ళు మూయించారు జగన్. దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ కంపెనీల నుంచి ఒప్పందాలు చేసుకున్నారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఒకేసారి ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న దాఖలాలు లేవు. దావోస్ లాంటి అంతర్జాతీయ పెట్టుబడుల సమావేశాలకు వెళ్లి, ఎంతో హంగామా చేసిన రాష్ట్రాలు కూడా ఈ స్థాయిలో పెట్టుబడులను దక్కించుకోలేకపోయాయి.

సొంత రాష్ట్రంలోనే పెట్టుబడుల సమావేశాన్ని నిర్వహించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను నేరుగా విశాఖకు రప్పించి సత్తా చాటారు జగన్. తొలిరోజే ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు రావడం పై రాష్ట్ర ప్రభుత్వం ఎంతో హ్యాపీగా ఉంది. ఇన్నాళ్లు తమ అభివృద్ధి కార్యకులం కాదని, కేవలం సంక్షేమంపైనే దృష్టి పెట్టి ఏం చేస్తున్నావని విమర్శించిన వాళ్లంతా ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ స్వతహాగానే బిజినెస్ మాన్ అని.. పెట్టుబడులు ఎలా తీసుకురావాలో ఆయనకు తెలియదా అని నిలదీస్తున్నారు. జగన్ రియల్ బిజినెస్ మాన్ అని ఇప్పుడు నిరూపించుకున్నారని పొగుడుతున్నారు.

అయితే పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఇలాంటి ఒప్పందాలు గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. అయితే అవన్నీ పేపర్లకే పరిమితమయ్యాయి. ఒప్పందాలు చేసుకున్న వాటిలో 20 శాతం ఆచరణ సాధ్యమైనా ప్రభుత్వం ఘనవిజయం సాధించినట్లే లెక్క. ఎందుకంటే గతంలో చేసుకున్న ఒప్పందాలు చాలా వరకు ఆచరణ సాధ్యం కాలేదు. ఆ విషయం పాలకులకు తెలుసు. కాబట్టి ఒప్పందాలతో సరిపెట్టుకోకుండా వాటిని అమలు చేసేంతవరకు వెంటాడినప్పుడే రాష్ట్రానికి నిజంగా మేలు జరుగుతుంది. అప్పుడే జగన్ కూడా ది బిజినెస్ మాన్ అని చెప్పుకునేందుకు అర్హత లభిస్తుంది.