Gold Rush: రూ.2వేల నోట్ల ఉపసంహరణ.. నగల షాపులకు పెరిగిన గిరాకీ..!

నోట్ల ఉపసంహరణ నిర్ణయం వెలువడ్డ తర్వాత నుంచి జువెలరీ షాపులకు 20 శాతం గిరాకీ పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటివరకు ఇంట్లో చాలా మంది రూ.2 వేల నోట్లను దాచుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 23, 2023 | 04:33 PMLast Updated on: May 23, 2023 | 4:33 PM

Jewellers Are Benefitting From Rbis Decision To Withdraw Rs 2000 Notes

Gold Rush: రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణతో నగల షాపులకు గిరాకీ పెరిగింది. తమ ఇంట్లో ఉన్న రూ.2వేల నోట్లతో నగలు కొనుక్కునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నోట్ల ఉపసంహరణ నిర్ణయం వెలువడ్డ తర్వాత నుంచి జువెలరీ షాపులకు 20 శాతం గిరాకీ పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటివరకు ఇంట్లో చాలా మంది రూ.2 వేల నోట్లను దాచుకున్నారు. కొందరు పెద్ద మొత్తంలో ఈ పెద్ద నోట్లను నిల్వ చేసుకున్నారు. వారికి ఆర్బీఐ షాకిచ్చింది. ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు గతవారం వెల్లడించింది. దీంతో తమ వద్ద భారీగా నిల్వ ఉన్న రూ.2 వేల నోట్లను ఏం చేయాలో తెలియడం లేదు.

ఈ నోట్లు ఇప్పటికి చెల్లుబాటు అవుతున్నప్పటికీ అవి ఇంట్లో దాచుకుంటే ఇబ్బందే అని భావిస్తున్నారు. అలాగని ఇప్పటికిప్పుడు అంత పెద్ద మొత్తంలో బ్యాంకులో మార్పిడి చేసుకోవడం లేదా డిపాజిట్ చేయడం కూడా సాధ్యమయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో ఆ నోట్లను తిరిగి అదే విలువ కలిగిన రూపంలో దాచుకోవాలంటే వారికి కనిపిస్తున్న ఒకే ఒక మార్గం బంగారం. తక్కువ మొత్తంలో నోట్లు దాచుకున్న వాళ్లు బ్యాంకుల్లో మార్చుకోవడమో, డిపాజిట్ చేసుకోవడమో చేస్తున్నారు. పెద్ద మొత్తంలో దాచుకున్న వాళ్లు మాత్రం బంగారం కొనేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం రూ.2 వేల నోట్లు చెల్లుబాటు అవుతాయి కాబట్టి.. ఆ నోట్లను బంగారం, వెండి రూపంలోకి మార్చేసుకుంటున్నారు. పైగా ఈ నోట్లతో ఈజీగా, పెద్ద మొత్తంలో కొనుగోలు చేయగలిగింది బంగారం మాత్రమే. అందుకే బంగారం షాపుల వద్ద రద్దీ బాగా పెరిగింది. తమ దగ్గరున్న రూ.2 వేల నోట్లతో బంగారం కొంటున్నారు. దీంతో ఉన్నట్లుండి జువెలరీ షాపుల వద్ద ఇరవై శాతం రద్దీ, విక్రయాలు పెరిగాయి. కొన్నిచోట్ల వినియోగదారుల రద్దీ రెట్టింపు అయినట్లు షాపుల యజమానులు చెబుతున్నారు.
అదనంగా వసూలు
నోట్ల ఉపసంహరణతో చాలా మంది బంగారంతోపాటు వెండి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఉన్నట్లుండి బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు. కనీసం 10 శాతం వరకు ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. నగల షాపుల యజమానులు కూడా దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.2 వేల నోట్లతో బంగారం కొనేవారి నుంచి అదనంగా పది శాతం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి లెక్కల్లో చూపించరాని డబ్బే కాబట్టి.. పది శాతం ఎక్కువ ధరకైనా బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది అంగీకరిస్తున్నారు. షాపు యజమానులు ఎక్కువ ధరలు చెబుతున్నా.. వినియోగదారులు వెనుకడుగు వేయడం లేదు. నోట్ల ఉపసంహరణ నిర్ణయం వల్ల బంగారం, వెండి విక్రయాలు 20 శాతం పైగా పెరగడంతో షాపుల యజమానులు, బంగారం వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.2 వేల నోట్లతో బంగారం, వెండి మాత్రమే కాకుండా పెట్రోల్ కూడా ఎక్కువగానే కొంటున్నారు. పెట్రోల్ బంకులకు కూడా రూ.2 వేల నోట్లు ఎక్కువగా వచ్చి పడుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తమ కార్లలో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు.
రియల్ ఎస్టేట్‌కు ఊపు..
మరోవైపు పెద్ద ఎత్తున బ్లాక్‌లో రూ.2 వేల నోట్లు నిల్వ చేసుకున్న వాళ్లు భూమి కొనుగోలుకు కూడా ప్రయత్నిస్తున్నారు. చిన్న నగరాలు, పట్టణాల్లో భూముల కొనుగోలు కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ ధరలు కాస్త తక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ కొనుగోళ్లతో కొన్నిచోట్ల రియల్ ఎస్టేట్‌కు మంచి ఊపొచ్చిందంటున్నారు వ్యాపారులు. వినియోగదారులు ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్‌లో బ్లాక్ మనీ తగ్గింది. భారీ లావాదేవీలు నగదు రహితంగానే జరుగుతుండటంతో బ్లాక్ మనీకి ఆస్కారం తగ్గింది.