Johnson & Johnson: జాన్సన్ & జాన్సన్ కాళ్ల బేరం.! దారికొచ్చిన జాన్సన్ & జాన్సన్
8.9 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే 73వేల కోట్ల రూపాయలు.. ఇదేదో దేశం బడ్జెట్ కాదు.. జాన్సన్ & జాన్సన్ సంస్థ తమ కంపెనీ బాధితులకు చెల్లించేందుకు సిద్ధమైన మొత్తం.. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే.. ఇది ఇంకా పెరగొచ్చు కూడా.. తమ టాల్కమ్ పౌడర్ వాడటం వల్లే క్యాన్సర్ వచ్చిందంటూ దాఖలైన కేసుల నుంచి బయటపడేందుకు జాన్సన్ & జాన్సన్ నానా తంటాలు పడుతోంది.
8.9 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే 73వేల కోట్ల రూపాయలు.. ఇదేదో దేశం బడ్జెట్ కాదు.. జాన్సన్ & జాన్సన్ ( Johnson & Johnson ) సంస్థ తమ కంపెనీ బాధితులకు చెల్లించేందుకు సిద్ధమైన మొత్తం.. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే.. ఇది ఇంకా పెరగొచ్చు కూడా.. తమ టాల్కమ్ పౌడర్ (talcum powder) వాడటం వల్లే క్యాన్సర్ వచ్చిందంటూ దాఖలైన కేసుల నుంచి బయటపడేందుకు జాన్సన్ & జాన్సన్ నానా తంటాలు పడుతోంది.
జాన్సన్ & జాన్సన్ టాల్కమ్ పౌడర్ ఎంత ఫేమసో చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా దీనికి విస్తృతమైన మార్కెట్ ఉంది. చిన్నపిల్లలకు (Children) అయితే ఇదే వాడమని డాక్టర్లు సజెస్ట్ చేసేవారు. పిల్లలున్న ప్రతి కుటుంబం దాదాపు ఈ పౌడర్‌ను వాడింది. అయితే ఈ పౌడర్ వల్ల క్యాన్సర్ బారిన పడ్డామంటూ కొన్ని వేల మంది మహిళలు కోర్టుల్లో కేసులు వేశారు. ప్రమాదకర రసాయనం అందులో ఉందని దానివల్ల తమ ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ కొన్నివేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఆ సంస్థ అమెరికాలో (America) తమ పౌడర్ అమ్మకాలను నిలిపివేసింది.
ఈ కేసుల నుంచి బయటపడేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న ఆ సంస్థ అవుటాఫ్ కోర్టు సెటిల్‌మెంట్‌కు (Settlement)ప్రయత్నించింది. బాధితులకు పరిహారం చెల్లించేందుకు చాలాకాలం క్రితమే ముందుకొచ్చింది. అయితే ఆ మొత్తంపై ఏకాభిప్రాయం కుదరలేదు. తాజాగా 8.9 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు ముందుకొచ్చింది. దీనికి బాధితుల తరపు న్యాయవాదులు కూడా అంగీకరించారు. అయితే కోర్టు నుంచి ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ప్రత్యేకంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేసి 25ఏళ్ల పాటు ఈ మొత్తాన్ని దశల వారీగా చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది.
దివాళా వ్యవహారాలు చూసే బ్యాంకు కనుక ఈ డీల్‌కు అంగీకరిస్తే టాల్కమ్ పౌడర్‌కు సంబంధించి ఇప్పటివరకు, ఇకపై దాఖలయ్యే కేసుల నుంచి జాన్సన్ & జాన్సన్‌కు విముక్తి లభిస్తుంది. పదేళ్లుగా దీనిపై న్యాయపోరాటం జరుగుతోంది. అయితే కొంతమంది బాధితుల న్యాయవాదులు ఈ డీల్‌ను కూడా వ్యతిరేకించారు. అయితే కోర్టు కనుక ఓకే అంటే అందరూ దాన్ని ఆమోదించాల్సిందే. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశముంది. ఇంత జరిగినా జాన్సన్ & జాన్సన్ మాత్రం తాము ఇంత మొత్తం చెల్లించినంత మాత్రాన తప్పు చేసినట్లు అంగీకరించడం కాదంటోంది. తమ పౌడర్ వల్ల క్యాన్సర్ వచ్చిందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అయితే వివాదాల పరిష్కారానికి దశాబ్దాలు పట్టే అవకాశమున్నందునే అవుటాఫ్ కోర్టు సెటిల్‌మెంట్‌కు ముందుకొచ్చామంటోంది.
129 ఏళ్లుగా జాన్సన్ & జాన్సన్ పౌడర్ విక్రయాలు జరుగుతున్నాయి. పదేళ్ల క్రితం ఈ వివాదం మొదలైంది. చిన్నప్పటి నుంచి జాన్సన్ & జాన్సన్ పౌడర్ వాడుతున్న తను క్యాన్సర్ బారిన పడటానికి కారణం అదేనంటూ ఓ మహిళ కోర్టులో కేసు వేశారు. అలాగే కొన్ని వేలమంది తాము కూడా ఈ పౌడర్ వల్ల అండాశయ క్యాన్సర్ బారిన పడ్డామంటూ కోర్టులో కేసులు వేశారు. అప్పట్నుంచి వివాదం నడుస్తోంది. ఆస్‌బెస్టాస్ అనే కెమికల్ ఇందులో కలిసినట్లు పరీక్షల్లోనూ నిర్థారణ అయ్యింది. తమ ఉత్పత్తుల్లో కార్కినోజెనిక్ ఆస్‌బెస్టాస్ ఉందన్న విషయం ఆ సంస్థకు తెలుసని 2018 విచారణలో తేలింది. అయితే ఆ విషయాన్ని కస్టమర్లు, నియంత్రణ సంస్థలకు చెప్పకుండా దాచినట్లు గుర్తించింది. అప్పటికీ ఆ పౌడర్ అమ్మకాలను కొనసాగించింది.
జాన్సన్ & జాన్సన్ ఇప్పటికే కొంతమంది బాధితులకు పరిహారం చెల్లించింది. అయితే వేల కేసులు నమోదు కావడంతో చేతులెత్తేసింది. ఒకేసారి పరిష్కారానికి మొగ్గుచూపింది. 2020లో అమెరికాలో తమ టాల్కమ్ పౌడర్ అమ్మకాలను జాన్సన్ & జాన్సన్ నిలిపివేసింది. అయితే ప్రపంచంలోని పలు దేశాల్లో ఇంకా దాని విక్రయాలు మాత్రం కొనసాగుతున్నాయి. త్వరలో వాటిని కూడా ఆపేస్తామంటోంది. ఆరోపణలు వచ్చిన తర్వాతైనా కనీసం అమెరికాలో అమ్మకాలు ఆపిన వెంటనే అయినా మిగిలిన దేశాల్లో ఇంతకాలం ఎందుకు ఆపలేదన్నదానికి మాత్రం ఆ సంస్థ సమాధానం చెప్పడం లేదు.