KUVERA SURVEY: భారతీయులు ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనే పొదుపు చేస్తారు..!?
ప్రపంచంలో ప్రతి మానవుడు కష్టపడేది డబ్బుకోసమే. ఉదరనిమిత్తం బహుకృత వేషం అని ఆ కాలంలో శంకరాచార్యులు చెప్పినా.. పొట్టకూటికోసం కోటి వృత్తులు అని సామాన్యుడు తన స్వరం వినిపించినా అది నిజమే. అయితే ఆడబ్బు కష్టపడకుండా ఎలా వస్తుంది. ముందు కొంత కష్టపడి ఎందులో అయినా పెట్టుబడి పెడితే వస్తుంది. మోసాలు జరుగకుండా పెట్టుబడి పెట్టి రాబడిని పొందాలంటే డబ్బులు ఎందులో పెట్టాలి అనే ఆలోచన అందరిలో ఉంటుంది. మన భారత్‌లో అనేక పొదుపు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లు, బీమా పథకాలు, బాండ్లు, పోస్టాఫీస్ పొదుపు పథకాలు ఇలా చాలా మార్గాల్లో డబ్బును పొదుపు చేయవచ్చు. కానీ, పెద్దపెద్ద వాటికి వెళ్లకుండా చిన్న చిన్నవాటిజోలికి వెళ్లి ధనాన్ని పొందాలని చూస్తారు. అవే ఫిక్స్డ్ డిపాజిట్లు. మన దేశంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit- FD)కు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. ఇప్పటికీ అత్యధిక మంది భారతీయులు దీన్నే తమ సేవింగ్స్ మార్గంగా ఎంచుకుంటున్నారు. దీని వెనుక ఉన్న కారణాలను తాజాగా ఓ సర్వే బయటపెట్టింది.
ఏక్షణంలోనైనే తీసుకునే వెసులుబాటు:
ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) ఆదరణపై కువేరా అనే ‘ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్’ సంస్థ సర్వే నిర్వహించింది. దాదాపు 16 లక్షల మంది మదుపర్ల నుంచి ఇది అభిప్రాయాలను సేకరించింది. స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులు సహా ఇతర ఆర్థిక అనిశ్చితుల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposit)కు ఎలాంటి ముప్పు ఉండదని చాలా మంది తెలిపారు. దాదాపు 44 శాతం మంది ఈ కారణంగానే ఎఫ్‌డీ (Fixed Deposit)ని ఎంచుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు కావాల్సినప్పుడు సురక్షితంగా డబ్బును తిరిగి తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఇలా ఆర్థిక లావాదేవీలు నమ్మకంగా జరిపేందుకు ఎఫ్‌డీ కంటే మేలైన మార్గం వేరొకటి లేదని మరికొంత మంది తెలిపారు. మరో 23 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కోసం తమ అత్యవసర నిధిని ఎఫ్‌డీల్లో పెడుతున్నట్లు వెల్లడించారు.
సెబి సర్వేలోనూ వెల్లడి:
2017లో సెబీ (SECURITIES AND EXCHANGE BOARD OF INDIA) నిర్వహించిన సర్వేలోనూ ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. అప్పటికీ.. ఇప్పటికీ భారతీయ మదుపర్ల ఆలోచనల్లో పెద్దగా తేడా లేకపోవడం గమనించాల్సిన విషయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో సెబీ (SEBI) నిర్వహించిన సర్వేలో దాదాపు 95 శాతం మంది తమ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ల (Fixed Deposit)లో ఉంచడానికే మొగ్గుచూపారు. కేవలం 10 శాతం మంది మాత్రమే మ్యూచువల్ ఫండ్లు, స్టాక్‌లను ఎంచుకున్నారు.
ఇది సరైన సమయం:
‘‘ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఆర్‌బీఐ రెపోరేటును పెంచుతోంది. రెపోరేటు అంటే మనం జమచేసే నగదుపై ఇచ్చే వడ్డీ రేటు అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కూడా అంటారు. ఎఫ్‌డీ (Fixed Deposit)ల్లో పొదుపు చేయడానికి ఇది సరైన సమయం. రాబోయే రోజుల్లో ఈ మార్గంలో పెట్టుబడులు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఎఫ్‌డీ (Fixed Deposit)లు సురక్షితమైనవే కాకుండా స్థిరమైన రాబడినిస్తాయి. ఈ కారణంగానే చాలా మంది భారతీయులు ఎఫ్‌డీలవైపు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా పెద్దగా నష్టభయాన్ని భరించలేని వారికి ఇది మంచి మార్గం’’ అని కువేరా సహ వ్యవస్థాపకుడు గౌరవ్ రస్తోగీ అన్నారు.