Software Jobs: టీసీఎస్‌కు మహిళల వరుస రాజీనామాలు.. అసలేం జరిగింది.. వివాదం ఏంటి ?
దేశంలోని టాప్ ఐటీ సంస్థలో.. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అలియాస్ టీసీఎస్ ఒకటి. టీసీఎస్‌లో జాబ్ వస్తే లైఫ్ సెటిల్.. ఓ ఢోకా ఉండదు అనుకుంటారు చాలామంది. ఐతే అలాంటి సంస్థను ఇప్పుడో సమస్య వెంటాడుతోంది. సంస్థలోని మహిళా ఉద్యోగులు.. ఒకరి తర్వాత ఒకరు.. మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు.
సంస్థలోని ఉన్నత స్థాయి అధికారులను ఇది టెన్షన్ పెడుతోంది. గతంలో రాజీనామా చేసి వెళ్లిపోయే మహిళా ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండేది. ఐతే ఇప్పుడు ఆ నంబర్ భారీగా పెరిగింది. రాజీనామాలకు ప్రధాన కారణం.. వర్క్ ఫ్రమ్ హోం ఎత్తివేయడమే ! మిగతా కారణాలు కూడా ఉన్నా.. ప్రధానంగా వినిపిస్తోంది మాత్రం ఇదే ! కరోనా టైమ్‌లో అమలు చేసిన వర్క్ ఫ్రం హోం సౌకర్యంతో కాస్త వెసులుబాటు దొరుకుతోందని.. మళ్లీ ఆఫీసులకు రమ్మనడంతో ఆ వెసులుబాటును వదులుకోలేక రాజీనామాలకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.
పురుషులతో పాటు మహిళలకూ సమానంగా అవకాశాలు ఉంటాయని, వివక్ష ఉండదని టీసీఎస్ సంస్థపై ఉద్యోగుల అభిప్రాయం. టీసీఎస్‌లో మొత్తం 6 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. అందులో 35శాతం మంది మహిళలే. టాప్ పొజిషన్లలోనూ మహిళలకు కంపెనీ తగిన ప్రాధాన్యం కల్పిస్తోంది. నాలుగింట మూడొంతుల మంది మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కరోనా ముందు వరకు సంస్థలోని మహిళా ఉద్యోగులు రాజీనామా చేసేందుకు ఇష్టపడేవారు కాదని.. ఇప్పుడు మాత్రం ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా రాజీనామాలు చేస్తున్నారని కంపెనీ హెచ్ఆర్ వర్గాలు చెప్తున్నాయ్.
కరోనా లాక్‌డౌన్ తర్వాత ఐటీ కంపెనీలు చాలావరకు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా కోరాయ్. ఈ వెసులుబాటుతో ట్రాఫిక్ కష్టాలకు, హడావుడి జీవితానికి స్వస్తి పలికిన ఉద్యోగులు.. ఇదే తమకు కంఫర్ట్ గా ఉందని చెప్పారు. ఇకపై ఆఫీసుకు వెళ్లే ఆలోచనే రానీయబోమని దాదాపు 25శాతం మంది ఉద్యోగులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పుడు కచ్చితంగా ఆఫీస్‌కు రావాలని ఆదేశాలు జారీ చేయడంతో.. వేరే కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాం తప్ప.. ఆఫీస్‌కు వచ్చేది లేదు అన్నట్లుగా.. టీసీఎస్‌కు మహిళా ఉద్యోగులు వరుస రాజీనామాలు చేస్తున్నారు.