Software Job: లంచం కొట్టు ఉద్యోగం పట్టు.. టీసీఎస్ లో వెలుగులోకి వచ్చిన రూ. 100 కోట్ల స్కాం
సాధారణంగా ప్రభుత్వ సంస్థల్లో లంచాలు ఇచ్చి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంట సంఘటనలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రైవేట్ సంస్థలో జరిగే ఉద్యోగాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అది కూడా టెక్నాలజీకి పెద్దపీట వేసే సంస్థల్లో చోటు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలా లంచాలు దండుకొని ఉద్యోగాలు ఇచ్చిన సంస్ధ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.
ప్రస్తుత సమాజంలో నిరుద్యోగం అంటువ్యాధిలాగా విస్తరిస్తుంది. దీనికి గల కారణం పెరిగిన జనాభాకు తగిన ఉపాధి అవకాశాలు, చదివిన చదువులకు సరైన ఉద్యోగాలు అందక తీవ్ర నిరాశకు గురవుతున్నారు ప్రస్తుత యువత. తమ అకాడమిక్ ఇయర్ పూర్తి చేసుకొని డిగ్రీ పట్టా చేత పట్టుకొని పల్లెలు వదిలి పట్టణాల వైపుకు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి తరుణంలో మెరిట్ బేస్ మీద నిరుద్యోగులను నియమించుకోకుండా తప్పుదారిలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల పోస్టులను భర్తీ చేసుకోవడం అనేది తీవ్రదుమారం రేపుతోంది. టీసీఎస్ లో ఇలాంటి స్కాం చోటు చేసుకోవడం ఇదే మొదటి సారి. కంపెనీ సీఈవోగా కె కృతివాసన్ బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల వ్యవధిలోనే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈవివరాలను తాజాగా మింట్ తన నివేదికలో ప్రచురించింది. సాప్ట్ వేర్ కంపెనీలో కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు తమకు తెలిసిన వారికి లబ్ధి చేకూరేలా ఈ చర్యలకు పాల్పడినట్లు తెలిపింది. ఇలా తమ బంధువులకు, తెలిసినవాళ్లకు లంచాలు డిమాండ్ చేసి గత కొన్ని సంవత్సరాలుగా బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా ఉద్యోగాలిప్తిస్తున్నట్లు మింట్ తన నివేదికలో స్పష్టం చేసింది. గడిచిన మూడు సంవత్సరాలలో కాంట్రాక్టర్లతో పాటూ ఇతర సిబ్బందిని 3 లక్షలకు పైగా నియమించుకున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా ఉద్యోగాలు ఇవ్వడం వల్ల నిరుద్యోగుల నుంచి దాదాపు రూ. 100 కోట్లకు పైగా దండుకున్నారని తెలుస్తుంది.
ఈ సంస్థలోని విజిల్ బ్లోయర్ ఒకరు స్కాం గురించి సంచలన విషయాలను బయటపెట్టారని పేర్కొంటూ ప్రచురించిన కథనానికి టీసీఎస్ వెంటనే స్పందించింది. ఇలా చేసిన వారిపై శరవేగంగా చట్టపరమైన చర్యలతో పాటూ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపింది. కంపెనీ ఉద్యోగులను నియమించుకునే రిసోర్స్ మేనేజ్ మెంట్ గ్రూప్ కు సంబంధించిన నలుగురు అధికారులను తొలగించింది. ప్రదానంగా ఉన్న మూడు రిక్రూటింగ్ సంస్థలకు ఉన్న అధికారాలను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే కొందరిని సెలవులపై పంపించి, మరికొందరిని డీబార్ చేసింది. డివిజన్ స్థాయిలో ఉండే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించింది.
ఇలాంటి సంఘటనలు ఈ ఒక్క సంస్థలోనే కాదు నిత్యం చాలా సంస్థల్లో జరుగుతూ ఉంటాయని కొందరు ఐటీ ఉద్యోగులు తెలిపారు. ఇలాంటి వాటిని నివారించడం ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీలకు పెద్ద సవాల్ గా మారింది. పెద్ద పెద్ద కంపెనీల్లోనే ఇలా జరుగుతుంటే చిన్న చిన్న స్టార్టప్ లలో పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం అనే ఆశ చూపించి లంచాన్ని లాంచనంగా తీసుకుంటూ ఉద్యోగాలు కల్పించడం చాలా పెద్ద పొరపాటు అని చెప్పాలి. ఇలా చేయడం వల్ల కొందరు టాలెంటెడ్ విద్యార్థులు వెనుకబడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు తమ గోడు వెల్లగక్కుతున్నారు.
T.V.SRIKAR