Mukesh Ambani: ఉద్యోగికి 1500 కోట్ల బహుమతి.. అంబానీ నమ్మకం గెలిస్తే ఇట్లుంటది..
దేశంలో ఏ కంపెనీ.. ఏ ఉద్యోగికీ గతంలో ఇంత భారీ కానుకలు ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే, అంబానీ ఈ స్థాయి కానుక అందించేందుకు కారణం మనోజ్ మోదీ పనితనమే. అతడు ముకేష్ అంబానీకి నమ్మిన బంటు.
Mukesh Ambani: దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ తన కంపెనీలోని ఉద్యోగికి భారీ నజరానా అందించారు. ఏళ్ల తరబడి నమ్మకంగా ఉంటూ, సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న ఒక ఉద్యోగి, తన స్నేహితుడికి ముకేష్ అంబానీ భారీ కానుక అందించారు. మనోజ్ మోదీ అనే ఉద్యోగికి రూ.1500 కోట్ల విలువైన భారీ భవంతిని ముకేష్ కానుకగా ఇచ్చాడు. ఈ విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. దేశంలో ఏ కంపెనీ.. ఏ ఉద్యోగికీ గతంలో ఇంత భారీ కానుకలు ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే, అంబానీ ఈ స్థాయి కానుక అందించేందుకు కారణం మనోజ్ మోదీ పనితనమే.
అతడు ముకేష్ అంబానీకి నమ్మిన బంటు.
ముకేష్ అంబానీకి అనేక వ్యాపారాల్లో మనోజ్ మోదీ కుడి భుజంగా వ్యవహరిస్తుంటారని సంస్థకు చెందిన సిబ్బంది చెబుతుంటారు. రిలయన్స్ సాధించిన విజయాల్లో అతడి పాత్ర ఎంతో ఉంది. ఒక ఉద్యోగిగానే కాకుండా.. సంస్థలో అనేక బాధ్యతల్ని అతడు నిర్వర్తిస్తుంటాడు. నిజానికి అతడు ముకేష్ అంబానీకి స్నేహితుడు కూడా. ముంబైలోని యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో కలిసి చదువుతున్నప్పటి నుంచి వీరిద్దరూ స్నేహితులు. మనోజ్ తండ్రి హరి జీవన్ దాస్ కూడా గతంలో రిలయన్స్‌లోనే పని చేశారు. ముకేష్ కంటే ముందే, 1980లలోనే మనోజ్ ఆ సంస్థలో ఉద్యోగిగా చేరాడు. ముకేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ సమయం నుంచే మనోజ్ ఈ సంస్థలో పని చేస్తున్నాడు. ఇన్ని దశాబ్దాలైనా అతడు అదే సంస్థలో పని చేస్తున్నాడు. ముకేష్ అంబానీ ఏ బాధ్యత అప్పగించినా విజయవంతంగా నిర్వర్తించడం అతడి ప్రత్యేకత.
కీలక ఒప్పందాల్లో మనోజ్ పాత్ర
రిలయన్స్ తన వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర సంస్థలతో కూడా కలిసి పని చేస్తోంది. దీనిలో భాగంగా 2020లో ఫేస్‌బుక్ సంస్థతో రూ.43 వేల కోట్ల డీల్ కుదిరింది. ఈ ఒప్పందం కుదిర్చింది మనోజే అని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. ఇలాంటి అనేక ఒప్పందాలు కుదర్చడంలో, మధ్యవర్తిగా వ్యవహరించడంలో మనోజ్ సిద్ధహస్తుడు. రిలయన్స్ విజయాల్లో అతడి పాత్ర చాలా కీలకం. అందుకే దశాబ్దాలుగా సంస్థకు నమ్మినబంటుగా సేవలందిస్తున్న అతడి పనితీరుకు మెచ్చి ముకేష్ అంబానీ భారీ నజరానా అందించాడు.
22 అంతస్థుల భవనం
ముకేష్ అంబానీ కానుకగా ఇచ్చిన భవనం విలువ రూ.1500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ముంబైలోని నేప్రియన్ సీ రోడ్డులోని 22 అంతస్థుల విలాసవంతమైన భవంతిని ముకేష్ కానుకగా అందించాడు. బృందావన్ పేరుతో నిర్మితమైన ఈ భవనం మొత్తం 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ఒక్కో అంతస్థు ఎనిమిది వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉండగా, పార్కింగ్ కోసమే 7 అంతస్తులను నిర్మించారు. మిగిలిన అంతస్థుల్లో మనోజ్ కుటుంబం, ఆయన కుమార్తెల కుటుంబాలు ఉండబోతున్నాయి. ఇందులోని ఫర్నీచర్ కూడా అధునాతనంగా ఉండబోతుంది. ఇటలీ నుంచి ఖరీదైన ఫర్నీచర్ తెప్పించారు. ముంబైలో ఇది చాలా ఖరీదైన ఏరియా. ఒక చదరపు అడుగు ధర రూ.45 వేల నుంచి రూ.70 వేల వరకు ఉంటుందని అంచనా.