Mutual Funds: 25ఏళ్లలో రూ.5కోట్లు కావాలంటే..?
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడికి అందుబాటులో ఉన్న ఓ మంచిమార్గం. రిస్క్ ఉన్నప్పటికీ రాబడి కూడా అదేస్థాయిలో ఉంటుంది. మరి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత పెట్టుబడులు పెడితే ఎంత రాబడి వస్తుంది..? 25ఏళ్ల తర్వాత 5కోట్ల రూపాయలు రావాలంటే నెలనెలా ఎంత పెట్టుబడి పెట్టాలి.
పొదుపు మార్గాల గురించి తెలిసిన వారెవరికైనా మ్యూచువల్ ఫండ్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఒకేసారి లేదా నెలవారీ పెట్టుబడులు పెట్టే ఓ మంచి సాధనం ఇది. సంపదను క్రమానుగతంగా వృద్ధి చేసే పెట్టుబడి మార్గం ఇది. మ్యూచువల్ ఫండ్ సిప్( సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) మొత్తం మార్చిలో రూ.14,276కోట్లకు చేరింది. ఫండ్స్‌లో ఈ స్థాయి మొత్తం ఇదే ఆల్‌టైమ్ హై.. ఇక మార్చిలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన మొత్తం రూ.20,534 కోట్లు.. ఫిబ్రవరితో పోల్చితే ఇద ఏకంగా 30శాతం అదనం.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి గ్యారెంటీ ఉండదు. ఇందులో ఖచ్చితంగా ఇంత మొత్తం వస్తుందని చెప్పడం కుదరదు. ఎంతైనా రావచ్చు, రాకపోవచ్చు.. పెట్టుబడికి కూడా గ్యారెంటీ ఉండదు. ఎవరైనా ఇంత మొత్తం పెట్టుబడి పెడితే ఖచ్చితంగా ఇంత వస్తుందని చెప్పారంటే ఆలోచించాల్సిందే. కానీ ఇప్పటివరకు ఏ మంచి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులను నిరాశపరచలేదు. పోస్టల్ డిపాజిట్లు, బ్యాంకు రికరింగ్ డిపాజిట్ల కంటే ఇప్పటివరకు ఫండ్స్ మంచి రాబడినే సాధించి పెట్టాయి. ఓ మంచిఫండ్‌ను ఎంచుకుని క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టుకుంటూ పోవడమే.. వీటిని సిప్‌లో అంటే నెలనెలా ఇంత అని పెట్టుబడి పెట్టుకుంటూ పోతే రిస్క్ తగ్గుతుంది. రివార్డు అందుతుంది.
మనం పెట్టుబడులు పెట్టేది భవిష్యత్ అవసరాల కోసమే.. పిల్లల చదువులు కావచ్చు, పెళ్లిళ్లు కావచ్చు, సొంత ఇంటిని సమకూర్చుకోవడం కోసం కావచ్చు.. రిటైర్మెంట్ అవసరాల కోసం కావచ్చు..అవసరం ఏదైనా కొన్నేళ్ల తర్వాత ఇంత మొత్తం చేతిలో ఉంచుకోవాలని అనుకుంటాం. అలా 25ఏళ్ల తర్వాత 5కోట్ల రూపాయలు సంపాదించాలంటే ఇప్పుడు నెలనెలా ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలన్నదానిపై ఇటీవల కొందరు మార్కెట్ నిపుణులు స్పందించారు. మనం పెట్టే మొత్తానికి నెలనెలా 12శాతం రాబడి వస్తుందనుకుంటే నెలకు 25 వేల చొప్పున 25ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అప్పుడు పాతికేళ్ల తర్వాత మన ఫండ్ మొత్తం సుమారు రూ.4.75కోట్లకు చేరుతుంది. అదే పన్నులు కూడా పోయి మన దగ్గర 5కోట్ల రూపాయలు ఉండాలనుకుంటే ఇప్పట్నుంచే నెలకు రూ.29,200రూపాయలు పెట్టాలి. మరి 12శాతం కాకుండా కేవలం 11శాతం రాబడే వస్తుందనుకుంటే 25ఏళ్లు కాదు 27ఏళ్ల పాటు మదుపు చేయాలి. కాదు 25ఏళ్లే టార్గెట్ అనుకుంటే నెలకు దాదాపు 33వేల వరకూ పెట్టుబడులు పెట్టాల్సిందే. అదే 10శాతం చొప్పున వృద్ధి అనుకుంటే 25ఏళ్ల పాటు నెలకు 38వేలకు పైనే సేవ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మన కార్పస్ ఫండ్ రూ.5కోట్లను చేరుకుంటుంది.
మరికొందరు నిపుణులు మరో మార్గాన్ని కూడా సూచిస్తున్నారు. ఒకేసారి నెలకు 25వేలు పెట్టుబడి పెట్టాలంటే ఎవరికైనా కష్టమే. అలాంటి వారికోసం మరో మార్గం కూడా ఉంది. నెలకు 12వేల 5వందల రూపాయలతో కూడా సిప్ స్టార్ట్ చేయవచ్చు. ఆ తర్వాత ఏటా 10శాతం పెంచుకుంటూ పోవాలంటున్నారు. అప్పుడు 25ఏళ్లలో మన టార్గెట్‌ను అందుకోవచ్చు.
మ్యూచువల్‌ఫండ్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవే. కానీ రిస్క్ లేనిదే రివార్డు రాదు. అలాగే మన పెట్టుబడి మొత్తాన్ని ఎప్పుడూ ఓకే ఫండ్‌లో పెట్టకూడదు. ఈక్విటీ, డెట్, గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అలాగే పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగినట్లుగా మార్చుకోవాలి. అప్పుడే ఇంత మొత్తం సంపాదించడం సాధ్యం. పైగా ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేముందు మన రిస్క్ ప్రొఫైల్‌ను కూడా చూసుకోవాలి. అందరూ హైరిస్క్ తీసుకోలేరు. కొందరు లోరిస్క్ ప్రొఫైల్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారికి రాబడి కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. ఇప్పటివరకు మన మ్యూచువల్ ఫండ్స్ ఏటా 12శాతం రాబడిని ఇచ్చాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడికి గ్యారంటీ ఉండదన్న విషయం పెట్టుబడి పెట్టేముందు గుర్తుంచుకోవాలి. అలాగే మంచి ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఎవరో చెప్పారనో లేక ప్రకటనలను చూసో మోసపోకూడదు. మీరు తినీ తినక రూపాయి రూపాయి దాచి పెట్టుబడి పెడుతున్నారు. దాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నామంటే బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ శాతం రాబడి కచ్చితంగా రావాలి. మంచి ఫండ్ ఎడ్వైజర్‌ను ఎన్నుకోవాలి. అప్పుడే మన పెట్టుబడి భద్రంగాను ఉంటుంది. మన లక్ష్యాన్ని చేరుకోవడం సులభం అవుతుంది.
(మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టేముందు అన్ని అంశాలు పరిశీలించుకోవాలి. పైన చెప్పిన లెక్కలన్నీ అంచనాలు మాత్రమే.. గ్యారెంటీ కాదు)