Nandini Vs Amul: నందిని తోపు… అమూల్ తాత దిగొచ్చినా ఏం కాదు.. కర్ణాటకలో గుజరాత్ పప్పులుడకవ్!
ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల KMF పాల వినియోగదారులకు ఏ రాష్ట్రంలో లేనంత తక్కువ ధరలకు పాల ఉత్పత్తులను అందిస్తోంది. అటు పాల ఉత్పత్తిదారులకు , ఇటు వినియోదారులకు ప్రయోజనం కలగడం వల్ల నందిని కర్ణాటకలో తిరుగులేని మిల్క్ బ్రాండ్‌గా నిలిచింది. అమూల్ లాంటి సంస్థలు అమ్మకాలు మొదలు పెట్టినా... నందినిని టచ్ చేయలేరన్నది కన్నడవాసుల మాట.
మీ రాష్ట్రం వస్తా… మీ ఊరొస్తా.. మీ ఇంటికొస్తా అంటూ గుజరాత్‌కు (Gujarat) చెందిన అమూల్ (Amul) పాల సంస్థ కర్ణాటకలో పాలు అమ్ముకునేందుకు తెగ ఆరాటపడుతోంది. కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమూల్ చేసిన ప్రకటన కర్ణాటకలో పాల రాజకీయాన్ని రాజేసింది. అమూల్ ఎంత పెద్ద సంస్థ అయినా గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో పాల వ్యాపారం చేస్తున్నా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్దిపొందుతున్నా కర్ణాటకలో మాత్రం అమూల్ పేరు చెబితేనే మండిపడుతున్నారు. కేవలం రాజకీయ నాయకులే కాదు.. ప్రజలు కూడా అమూల్‌ను స్వాగతించేందుకు సిద్ధంగా లేరు. నందిని ఉండగా..మీరెందుకు దండగ అని మొహం మీదే చెప్పేస్తున్నారు. బెంగళూరులో పాలు,పెరుగు అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న అమూల్ సంస్థకు కర్ణాటక సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది
నందిని వర్సస్ అమూల్
నందిని (Nandini) అంటే కేవలం పాల ఉత్పత్తులపై కనిపించే పేరు మాత్రమే కాదు. కర్ణాటకకు సంబంధించినంత వరకు నందిని అంటే ఓ ఎమోషనల్. సాధారణ ప్రజల నుంచి బిగ్ షాట్స్ వరకు కర్ణాటకలో ప్రతి ఇంట్లోనూ కనిపించే ఏకైక మిల్క్ బ్రాండ్ నందిని మాత్రమే. అమూల్ సహా మరే ఇతర బ్రాండ్స్ కర్ణాటకలో అడుగుపెట్టినా నందిని సంస్థను బీట్ చేయడం అంత ఈజీ వ్యవహారం కాదు. కర్ణాటకలో నందిని మూలాలు ఆ స్థాయిలో ఉన్నాయి మరి.
నందిని బ్రాండ్ ఎందుకంత స్పెషల్ ?
దేశంలో పాల ఉత్పత్తి సంస్థలు ఎన్ని ఉన్నా నందిని బ్రాండ్‌కు ఓ ప్రత్యేక ఉంది. అదే దాని ప్రైస్. అమూల్ సహా దేశంలోని అన్ని పాల సంస్థల ధర కంటే నందిని తక్కువ ధరకే పాలు ఉత్పత్తులను అందిస్తోంది. కర్ణాటక కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ నందిని పేరుతో పాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తోంది. బెంగళూరులో నందిని టోన్డ్ మిల్క్ లీటరు 39 రూపాయలకే లభిస్తుంది. అమూల్ లీటర్ టోన్డ్ మిల్క్‌కు ఢిల్లీలో 54 రూపాయలు, గుజరాత్‌లో 52 రూపాయలు వసూలు చేస్తోంది. అమూల్ బ్రాండ్‌తో పోల్చితే ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా నందిని తక్కువ ధరకే అందిస్తోంది. నందిని బ్రాండ్ పెరుగు లీటరు 47 రూపాయలకే లభిస్తుంటే… అమూల్ పెరుగు మాత్రం 67 రూపాయల వరకు ఉంది.
నందిని తక్కువ ధరల రహస్యమేంటి ?
నందిని బ్రాండ్ సక్సెస్ క్రెడిట్‌ను అక్కడి ప్రభుత్వాలకే ఇవ్వాలి. కాంగ్రెస్ , బీజేపీ , జేడీఎస్ అన్న సంబంధం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా నందినికి పెద్ద పీట వేశాయి. ఇంకా చెప్పాలంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కాస్త ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. 2008లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన ఓ పథకం పాల ఉత్పత్తిదారులకు వెన్నెముకగా నిలిచింది. కర్ణాటక కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ ( KMF)కు పాలు అందించే రైతులకు 2008లో యడ్యూరప్ప ప్రభుత్వం లీటర్‌కు 2 రూపాయల చొప్పున incentive ఇవ్వడం ప్రారంభించింది. 5 సంవత్సరాల తర్వాత 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఆ ప్రోత్సాహకాన్ని రెట్టింపు చేసింది. 2016లో 5 రూపాయలకు పెంచింది. యడ్యూరప్ప మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గరిష్టంగా 6 రూపాయలకు పెంచారు. ప్రభుత్వం ఏదైనా సరే రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసమే కర్టాటక 1200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం రైతులకు నేరుగా ప్రోత్సాహకాలు అందించడం వల్ల కర్ణాటకలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు బలోపేతమయ్యాయి. దేశంలో అమూల్ తర్వాత అత్యధికంగా పాల సేకరణ చేస్తున్నది కర్ణాటక కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ మాత్రమే. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం.. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల KMF పాల వినియోగదారులకు ఏ రాష్ట్రంలో లేనంత తక్కువ ధరలకు పాల ఉత్పత్తులను అందిస్తోంది. అటు పాల ఉత్పత్తిదారులకు , ఇటు వినియోదారులకు ప్రయోజనం కలగడం వల్ల నందిని కర్ణాటకలో తిరుగులేని మిల్క్ బ్రాండ్‌గా నిలిచింది. అమూల్ లాంటి సంస్థలు అమ్మకాలు మొదలు పెట్టినా… నందినిని టచ్ చేయలేరన్నది కన్నడవాసుల మాట.