ONDC: స్విగ్గీ, జొమాటోకంటే తక్కువకే ఫుడ్ డెలివరీ.. అందుబాటులోకి వచ్చిన కొత్త సర్వీస్

మార్కెట్లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అనగానే స్విగ్గీ, జొమాటో గుర్తొస్తాయి. ఇతర సర్వీసులు అందుబాటులో ఉన్నా యూజర్లు ఎక్కువగా వాడేవి మాత్రం ఈ రెండింటినే. ఇప్పుడు వీటికి ప్రభుత్వం రూపొందించిన ఓఎన్‌డీసీ చెక్ పెట్టబోతుంది. ఈ కామర్స్ విభాగంలో కొన్ని సంస్థలు మాత్రమే కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రభుత్వం రూపొందించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2023 | 05:01 PMLast Updated on: May 08, 2023 | 5:01 PM

Ondc Offer Food Cheaper Than Zomato Swiggy

ONDC: దేశంలో మరో కొత్త ఫుడ్ డెలివరీ సర్వీస్ ప్రారంభమైంది. ఓఎన్‌డీసీ (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) పేరుతో ప్రభుత్వ అనుబంధ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. అది కూడా స్విగ్గీ, జొమాటోలకంటే తక్కువ ధరకే. దీంతో స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ తప్పదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
మార్కెట్లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అనగానే స్విగ్గీ, జొమాటో గుర్తొస్తాయి. ఇతర సర్వీసులు అందుబాటులో ఉన్నా యూజర్లు ఎక్కువగా వాడేవి మాత్రం ఈ రెండింటినే. ఇప్పుడు వీటికి ప్రభుత్వం రూపొందించిన ఓఎన్‌డీసీ చెక్ పెట్టబోతుంది. ఈ కామర్స్ విభాగంలో కొన్ని సంస్థలు మాత్రమే కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్రభుత్వం రూపొందించింది. ప్రస్తుతం బెంగళూరుతోపాటు, హైదరాబాద్, ఢిల్లీ వంటి కొన్ని నగరాల్లో మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ సర్వీస్ అమలవుతుండగా త్వరలోనే ఇతర నగరాల్లో కూడా అందుబాటులోకి వస్తుంది.
గత ఏడాదే ఆరంభం
రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓఎన్‌డీసీ వైరల్ అవుతోంది. దీని ద్వారా తాము ఫుడ్ డెలివరీ అందుకున్నామని యూజర్లు చెబుతున్నారు. స్విగ్గీ, జొమాటో కంటే తక్కువ ధరలోనే తమకు ఫుడ్ డెలివరీ అయిందంటున్నారు. స్విగ్గీ, జొమాటో ధరలు.. ఓఎన్‌డీసీ ధరలు పోలుస్తూ స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. ఇటీవలే ఓఎన్‌డీసీకి పాపులారిటీ వచ్చినప్పటికీ ఇది ప్రారంభమైంది మాత్రం గత ఏడాది సెప్టెంబర్‌లోనే. దీనికి నెమ్మదిగా ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం రోజూ 10 వేలకు పైగా ఫుడ్ ఆర్డర్లు వస్తున్నాయి. దీని ద్వారా రెస్టారెంట్లు, హోటళ్లు తమ ఫుడ్ నేరుగా వినియోగదారులకు డెలివరీ చేయొచ్చు. మధ్యవర్తులు ఉండరు. అందువల్ల ఇతర యాప్స్ కంటే తక్కువ ధరలోనే ఫుడ్ డెలివరీ అవుతుంది. దీంతో వినియోగదారులు ఓఎన్‌డీసీవైపు మొగ్గు చూపుతన్నారు.
పరిమితమే కానీ..
కొత్తగా వచ్చిన సర్వీసు కాబట్టి.. ప్రస్తుతం అన్ని నగరాల్లో, అన్ని రెస్టారెంట్లలో అందుబాటులో లేదు. తక్కువ నగరాల్లో, పరిమిత రెస్టారెంట్లలో మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. యూజర్లు తమ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసి, దీని ద్వారా తమ ప్రాంతంలో సర్వీస్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. పేటీఎంలోకి వెళ్లి, సెర్చ్ బార్‌లో ఓఎన్‌డీసీ అని టైప్ చేస్తే సంబంధిత వివరాలు వస్తాయి. దీని ద్వారా మీ ప్రాంతంలో డెలివరీ సర్వీస్ ఉందో.. లేదో తెలుసుకోవచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సర్వీసు వివరాలు తెలుసుకోవచ్చు.

ONDC
స్విగ్గీ, జొమాటోలకు పోటీ
ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న ఓఎన్‌డీసీ త్వరలో మరింతగా విస్తరించే అవకాశం ఉంది. స్విగ్గీ, జొమాటో వంటివి డెలివరీ చార్జీలు అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు తాము కావాలనుకున్న ఫుడ్ కోసం చాలా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. కానీ, ఓఎన్‌డీసీ పూర్తిగా అందుబాటులోకి వస్తే ఈ చార్జీలు తగ్గుతాయి. దీంతో ఇది స్విగ్గీ, జొమాటోకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం యాప్ సర్వీస్ బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా నగరాల్లో పేటీఎం ద్వారా ఆర్డర్ చేయవచ్చు.