Onion prices: టమాటా మంటలు తగ్గాయి.. ఉల్లి కన్నీళ్లు పెరిగాయి..!

ప్రస్తుతం కర్నూలు రైతు బజార్‌లో కిలో ఉల్లి ధర రూ.30 నుంచి రూ.40 దాకా పలుకుతోంది. బయటి మార్కెట్‌లో ఈ ధర రూ.35 నుంచి రూ.45 దాకా ఉంది. రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందని కర్నూలు రైతు బజార్ వర్గాలు తెలిపాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 18, 2023 | 08:22 PMLast Updated on: Aug 18, 2023 | 8:22 PM

Onion Prices Are Increasing In Local Markets Prices Will Reach High Time

Onion prices: టమాటా ధరల మంటలు ఆరుతున్నాయని ఓ వైపు దేశ ప్రజలు ఊరటగా ఫీల్ అవుతుంటే.. మరోవైపు ఉల్లి ధరల మంటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కిలో టమాటా ధర రూ.40 రేంజ్‌కు చేరగా.. కిలో ఉల్లి ధర రూ.35 రేంజ్‌కు ఎగబాకింది. కొన్ని చోట్లనైతే ఉల్లిని కిలోకు రూ.45కు అమ్ముతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి సాగుకు ఉమ్మడి కర్నూలు జిల్లా చాలా ఫేమస్. కర్నూలు రైతు బజార్ నుంచి తెలంగాణ, ఏపీలోని చాలా జిల్లాలకు నిత్యం ఉల్లి సరఫరా అవుతుంటుంది. కర్నూలులో ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడం వల్లే స్థానికంగా ఉల్లి ధరలు కంట్రోల్‌లో లేకుండా పోయాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

ఇక్కడ ఏటా 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగు జరుగుతుండేది. కానీ ఈసారి ఇప్పటివరకు 25 వేల ఎకరాలలోపే ఉల్లి పంట వేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా గతేడాది ఉల్లి రైతులు భారీగా నష్టాలను చవి చూశారు. దీంతో ఈ సంవత్సరం ఖరీఫ్‌లో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపలేదు. గిట్టుబాటు ధర దక్కకపోవచ్చనే భయంతో రైతులు ఈసారి ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగులో ఉన్న ఉల్లి పంట కర్నూలు మార్కెట్‌కు రావడానికి ఇంకొన్ని వారాల టైమ్ పట్టొచ్చని చెబుతున్నారు. ఇప్పటికైతే కర్నూలు మార్కెట్‌కు ఉల్లి సరఫరా చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు రైతు బజార్‌లో కిలో ఉల్లి ధర రూ.30 నుంచి రూ.40 దాకా పలుకుతోంది. బయటి మార్కెట్‌లో ఈ ధర రూ.35 నుంచి రూ.45 దాకా ఉంది. రాబోయే రోజుల్లో ఉల్లి ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందని కర్నూలు రైతు బజార్ వర్గాలు తెలిపాయి. హోల్ సేల్‌లో క్వింటాలు ఉల్లి రూ.2,800 నుంచి రూ.3000 దాకా పలుకుతోందని వివరించారు. అంటే ఉల్లి హోల్‌సేల్ ధర కిలోకు సగటున 30 రూపాయలు!
త్వరలో కిలో ఉల్లి రూ.70..?
వారం క్రితం కిలోకు సగటు 19 రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు కొన్నిచోట్ల దాదాపు రెట్టింపు అయి రూ.40కి చేరింది. దీంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. వినాయక చవితి పండుగ వరకు అన్నిచోట్లా ఇదే రేంజుకు రేట్లు చేరుతాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ మార్కెట్లోకి ఉల్లి సరఫరా పెరగకుంటే.. త్వరలోనే దాని ధర రిటైల్ మార్కెట్‌లో కిలోకు రూ.70కి ఎగబాకుతుందని “క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్” ఇచ్చిన నివేదిక పేద, మధ్యతరగతి ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఉల్లి డిమాండ్, సరఫరాను పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతానికి మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల ఉల్లి బఫర్ స్టాక్‌ ఉందని ప్రభుత్వం చెబుతోంది. బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయలను రేట్లు పెరుగుతున్నప్రాంతాలకు పంపిణీ చేయడం ప్రారంభించామని అంటోంది. అయినా మార్కెట్లో రిటైల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. గోదాముల తనిఖీ ద్వారా ఉల్లి హోల్ సేల్ వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్‌కు చెక్ పెడితే కానీ ధరలు దిగే అవకాశాలు ఉండవనేది వాస్తవం.
ఉల్లి రేటు ఎందుకు పెరుగుతుంది..?
సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ఉల్లికి కరువు కాలం లాంటివి. ఈ రెండు నెలల టైం ఉల్లి పంట విత్తడానికి, దిగుబడి రావడానికి మధ్య సమయం. కాబట్టి ఈ రెండు నెలల్లో మార్కెట్‌కు ఉల్లి సరఫరా తగ్గి రేట్లు పెరుగుతాయి. అక్టోబర్‌లో ఉల్లి కోత ప్రారంభమవుతుంది. ఆ నెల నుంచి మళ్లీ మార్కెట్‌కు ఉల్లి సరఫరా పెరిగి ధరలు తగ్గడం మొదలవుతుంది.