PayTM Collapse: పతనంలో పేటీఎం చివరి అంకానికి చేరిందా ?
కస్టమర్లకు సంబంధించి తప్పుడు సమాచారం సమర్పించడం, సైబర్ సెక్యూరిటీ లోపాలు, మనీలాండరింగ్ లాంటి తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలకు పేటీఎం పాల్పడిందని ఆర్బీఐ గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
PayTM Collapse: పేటీఎం ప్రస్తుతం ఎదుర్కుంటున్న సంక్షోభం సొంతంగా కొనితెచ్చుకున్నదే. స్వీయ తప్పిదాలే పేటీఎం కొంపముంచాయి. తరచూ నిబంధనలు ఉల్లంఘించడంతో సంస్థ పేమెంట్స్ బ్యాంకింగ్ విభాగంపై RBI ఆంక్షలు విధించడం, సంస్థ పర్యవేక్షణ లోపాలు.. మొత్తం ఆ సంస్థ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చాయి. మార్చి 15 నుంచి డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, వ్యాలెట్ టాప్-అప్‌లు, బిల్లుల చెల్లింపుల లాంటి అన్ని సేవలూ నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం పేటీఎం బ్యాంకింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఆవిరై పోతున్నాయి. ఏకంగా రూ.27 వేల కోట్ల నష్టం జరిగింది.
TDP IN TO NDA: పొత్తుల టైమ్.. ఎన్డీఏలోకి టీడీపీ ! ముహూర్తం ఎప్పుడంటే ?
కస్టమర్లకు సంబంధించి తప్పుడు సమాచారం సమర్పించడం, సైబర్ సెక్యూరిటీ లోపాలు, మనీలాండరింగ్ లాంటి తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనలకు పేటీఎం పాల్పడిందని ఆర్బీఐ గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆర్బీఐ నిబంధనలను పదేపదే ధిక్కరించడంతో పేటీఎం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తప్పులను సరిదిద్దుకునేందుకు పేటీఎంకు తగినంత సమయం ఇచ్చినట్టు ఆర్బీఐ చెబుతోంది. అంటే ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం పేటీఎంని ముంచేసిందని స్పష్టంగా అర్థమౌతోంది. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఒకప్పుడు దేశంలో అత్యంత చిన్నవయస్కుడైన బిలియనీర్‌గా పేరు పొందారు. శర్మ ఆర్బీఐ అధికారులను, సాయం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిని కూడా సంప్రదించినా.. ఫలితం లేకుండా పోయింది. ఆడంబరంగా వ్యవహరించే శర్మకు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలతో మొదటి పేజీ ప్రకటనలిచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ, ఈ సంక్షోభం సంస్థ అస్తిత్వానికే ముప్పుగా మారింది. 2018 నుంచి వరుస ఉల్లంఘనలపై ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఆర్బీఐ కంపెనీకి హెచ్చరికలు చేసింది.
SMART PHONE: లేవగానే మొబైల్ చూస్తున్నారా..? ఆ రోజు ఏమవుతుందో తెలుసా ?
2010లో ప్రారంభమైన పేటీఎం అనతి కాలంలోనే డిజిటల్ లావాదేవీలకు పర్యాయపదంగా మారింది. 2016లో పెద్దనోట్ల రద్దు సమయంలో కంపెనీ సంపద అమాంతం పెరిగింది. నోట్ల రద్దు నిర్ణయం నగదుకు బదులు డిజిటల్ లావాదేవీలను భారీగా పెంచింది. ప్రస్తుతం 33 కోట్ల పేటీఎం వ్యాలెట్లు ఉన్నాయి. వాటి ద్వారా కస్టమర్లు గృహోపకరణాలు, రిక్షా రైడ్‌ల నుంచి సేవల బిల్లుల వరకూ ఎలాంటి చెల్లింపులైనా చేయొచ్చు. జపనీస్ టెక్నాలజీ ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్‌తో పాటు, కంపెనీ ప్రారంభ సమయంలో వారెన్ బఫెట్, అలీబాబా కూడా పేటీఎంలో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుత సంక్షోభానికి కేంద్రమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు 2017లో లైసెన్స్ మంజూరైంది. ఈ బ్యాంకులో 2 లక్షల రూపాయల వరకూ డిపాజిట్లు తీసుకోవచ్చు. కానీ రుణాలు ఇవ్వకూడదు. ఇందులో ఉన్న నగదుతో యాప్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. అలాగే, థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్, రుణాలను కూడా అమ్ముతోంది ఈ కంపెనీ.
పేటీఎం యాప్ QR కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారులతో సహా, ఈ బ్యాంక్‌లో 5 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. పేమెంట్స్ యాప్ బిజినెస్‌పై ఈ ఆదేశాల ప్రభావం లేకపోయినా.. వీటి పర్యవసానంగా వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్టాక్ మార్కెట్ లిస్టింగ్ అయిన తర్వాత రెండేళ్లలో కంపెనీ దాదాపు 80 శాతం మార్కెట్ విలువను కోల్పోయింది. ఆర్బీఐ ఆదేశాలతో వ్యాపారుల సంఘం(CAIT) పేటీఎం నుంచి ఇతర పేమెంట్స్ యాప్‌లకు మారాలని ఇప్పటికే సూచించింది. ప్రత్యర్థి సంస్థలు కూడా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇతర బ్యాంకులు ఇప్పటికే కొత్త QR కోడ్‌లు, పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్లతో వ్యాపారుల దగ్గరకు వెళ్తున్నాయి. RBI ఆదేశాల తర్వాత పేటీఎం యాప్ డౌన్‌లోడ్స్ లో 20 శాతం క్షీణతను సెన్సార్ టవర్ డేటా చూపిస్తోంది. గూగుల్ పే, ఫోన్ పే వంటి పోటీ యాప్‌ల డౌన్‌లోడ్స్ 50 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
పేమెంట్ బ్యాంక్‌కు మార్చి 15 దాకా టైమ్
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఖాతాలను మార్చుకోడానికి మార్చి 15 వరకూ అనుమతి ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గతంలో ఫిబ్రవరి 29 వరకూ డెడ్ లైన్ పెట్టినా… దాన్ని మరో 15 రోజులు పొడిగించింది. అయితే ఇప్పటికే ఫాస్టాగ్ లిస్ట్ నుంచి పేటీఎంను తొలగించింది ఇండియన్ హైవేస్ మేనేజ్ మెంట్ కంపెనీ లిమిటెడ్. దేశవ్యాప్తంగా పేటీఎంకు 8 కోట్ల మంది ఫాస్టాగ్ వినియోగదారులు ఉన్నారు. మొత్తం ఫాస్టాగ్ పేమెంట్స్ లో దాదాపు 30శాతం పేటీఎం నుంచే వస్తున్నాయి. పేటీఎం QR కోడ్స్, సౌండ్ బాక్స్, కార్డ్ మెషిన్ లాంటి సేవలకు మార్చి 15 తర్వాత కూడా కొనసాగుతాయని సంస్థ తెలిపింది. వ్యాపారుల నోడల్ ఖాతాలను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్ కు మార్చినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.