Petrol Prices: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ దోపిడీ..! జనాన్ని దోచేస్తున్న సర్కార్లు!!

దేశంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న మొదటి రాష్ట్రం ఏపీ. తెలంగాణ మూడో స్థానంలో ఉంది. కేరళ రెండో స్థానంలో ఉంది. డీజిల్ ధరల్లో లక్షద్వీప్ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉంది. కేరళ మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 21, 2023 | 12:36 PMLast Updated on: Jul 21, 2023 | 6:05 PM

Petrol And Diesel Prices Ap In Top Positison Telugu States Govt Implementing High Vat

Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరల్లో తెలుగు రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయి. దేశంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న మొదటి రాష్ట్రం ఏపీ. తెలంగాణ మూడో స్థానంలో ఉంది. కేరళ రెండో స్థానంలో ఉంది. డీజిల్ ధరల్లో లక్షద్వీప్ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండో స్థానంలో ఉంది.

కేరళ మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. అంటే ఇంధన ధరలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్‌‌లో దూసుకెళ్తున్నాయి. ఏపీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.111.87గా ఉంది. ఆ తర్వాత కేరళలో రూ.109.73గా, తెలంగాణలో రూ.109.6గా ఉంది. డీజిల్‌ లక్షద్వీప్‌లో లీటర్ ధర రూ.10.3.08కాగా, ఏపీలో రూ.99.61గా, కేరళలో రూ.98.53గా, తెలంగాణలో రూ.97.28గా ఉంది. పెట్రోల్, డీజిల్‌పై వివిధ రాష్ట్రాలు విధిస్తున్న వ్యాటే దీనికి కారణం. దీంతో వ్యాట్ తగ్గించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ధరల్ని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి లోక్‌సభలో గురువారం ఈ వివరాల్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఒకే చమురు ధరల విధానం ఇప్పటివరకు అమలు కావడం లేదని, అందువల్ల రాష్ట్రాలు విధిస్తున్న పన్నుల ఆధారంగా ఈ ధరల పెరుగుదల ఉన్నట్లు ఆయన చెప్పారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పెట్రోల్, డీజిల్ ధరలను ఆయన వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలో కూడా చమురు ధరలు తక్కువగానే ఉన్నాయి. దేశమంతా ఒకే చమురు ధరల్ని అమలు చేయాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. చమురును జీఎస్టీ పరిధిలోకి తేవాలని కూడా కేంద్రం ఆలోచిస్తోంది. దీనికి రాష్ట్రాలు అంగీకరించడం లేదు. ఎందుకంటే కేంద్రం సరఫరా చేసే చమురుపై రాష్ట్రాలు తమకు నచ్చినట్లుగా వ్యాట్ విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఎక్కువ వ్యాట్ విధిస్తున్నాయి. దీనివల్ల ఆయా రాష్ట్రాలకు భారీ ఆదాయం సమకూరుతోంది. దీన్ని కోల్పోవడం రాష్ట్రాలకు ఇష్టం లేదు. అందుకే చమురును జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ట్రాలు సిద్ధంగా లేవు. ఈ విషయంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ముందడుగూ పడలేదు. అయితే, ఈ అంశంపై కేంద్రం ఇంకా ఫోకస్ చేసే అవకాశం ఉంది.