Mosquito Machine: వర్షాకాలం మొదలైంది.. తక్కువ ధరలో దోమలకు చెక్ పెట్టండి ఇలా..
దోమలకు తన మన అనే బేధభావం ఉండదు. ప్రతి ఒక్కరినీ తీవ్రంగా బాధిస్తూ ఉంటాయి. ఒక్కోసారి దోమ కాటు పాము కాటు కంటే ప్రమాదం కూడానూ. కొన్ని దోమలు అయితే మలేరియా, డెంగ్యూ వంటి తీవ్ర ప్రాణాంతకమైన వ్యాధులకు కారణం అవుతాయి. అందుకే వీటిని చెక్ పెట్టేందుకు సరికొత్త పరికరం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. వాటి ఫీచర్లేంటో ఇప్పుడు చూద్దాం.
ఇక మండే ఎండాకాలానికి స్వస్తి పలుకుతూ నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో వర్షాకాలం ప్రారంభం అయిందనే చెప్పాలి. వానలు పడితే చాలు డ్రైనేజీ, మురుగు, చెత్త, బ్యాక్టీరియా వంటివి రోడ్లలో పేరుకుపోతాయి. వీటిని దోమలు స్థావరంగా చేసుకొని పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. రాత్రి అయితే చాలు ఎన్ని తలుపులు మూసిపెట్టుకున్నా ఇంట్లోకి రాజులాగా ప్రవేశిస్తాయి. మనల్ని కుట్టి, కుట్టి నిద్రలేకుండా చేస్తాయి. వీటి బెడద నుంచి తప్పించుకునేందుకు చాలామంది జెట్, ఆల్ అవుట్, బ్లాక్ హిట్, అగరబత్తీలు, జెట్ కాయిల్స్ వాడుతూ ఉంటారు. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయి. మరికొందరైతే చేతిలో ఎలక్ట్రిక్ బ్యాట్ పట్టుకొని దోమలపై దండయాత్ర చేస్తారు. ఈ ఫార్ములా పూర్తి స్థాయిలో దోమలను నాశనం చేసినప్పటికీ నిద్రపోకుండా పదే పదే బ్యాట్ పట్టుకొని దోమలను చంపలేము. మరి ఇలాంటి వాటికి చక్కని పరిష్కారంగా ఒక ఎలక్ట్రిక్ డివైజ్ అందుబాటులోకి వచ్చేసింది.
ఇది హై సింథైన్ ఎల్ ఈడీ లైట్లను ఇరువైపులా అమర్చి ప్లాస్టిక్ తో తయారు చేసిన పరికరం. దీనిని మన ఫోన్ ఛార్జింగ్ పాయింట్ల లాగా త్రీపిన్ సాకేట్ కి కనెక్షన్ చేస్తే చాలు. వెంటనే మెషీన్లోని ప్రత్యేకమైన కాంతికి దోమలే కాదు ఇతర క్రిమి కీటకాలు ఆకర్షితమై వాటి దగ్గరకు వెళతాయి. దగ్గరకు వెళ్ళిన వెంటనే మోషీన్ ఆ కీటకాలను లోపలికి లాక్కుంటుంది. వీటి లోపల ఒక బాస్కెట్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. అందులో దోమలు చనిపోయే మందులను ఏర్పాటు చేసి ఉంచుతారు. తద్వారా దోమలు లోపలికి వెళ్లి బయటకు తిరిగి వచ్చేందుకు వీలుండదు. ఈ బాస్కెట్ ను ఓపెన్ చేసి అందులోని దోమలను, కీటకాలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
ఈ మిషిన్ తాకడం వల్ల చిన్నపిల్లలకు, పెంపుడు జంతువులకు ఎలాంటి హాని కలుగదు అంటున్నాయి కంపెనీలు. ఇందులో షాట్ సర్క్యూట్ కి గురిచేసే మూలకాలు ఏవీ లేవు. వీటిని ఎక్కడికైనా అతి సులువుగా తీసుకెళ్లచ్చు. అలాగే దీనిని ఉపయోగించేటప్పుడు ఎలాంటి శబ్ధం బయటకు రాదట. దీని ధర కూడా రూ. 500 నుంచి రూ. 1000 లోపు ఉంటుంది.
T.V.SRIKAR