Rs 2000 Notes: రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోవాల్సిందేనా? లేకుంటే ఏమవుతుంది? ఆర్బీఐ చెప్పిందేంటి?
రూ.2 వేల నోట్లను రద్దు చేయాలని నిర్ణయించినా ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యేమీ లేదు. సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లు చెల్లుబాటు అవుతాయి. గతంలోలాగే రూ.2 వేల నోట్లను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అంటే రోజువారీ అవసరాల కోసం నోట్లను ఇవ్వడం, తీసుకోవడం చేయొచ్చు.
Rs 2000 Notes: రూ.2 వేల నోటు విషయంలో ఆర్బీఐ చేసిన ప్రకటన గందరగోళానికి కారణమవుతోంది. 2016నాటి నోట్ల రద్దులాగా ఇది కూడా పూర్తిగా రద్దవుతుందా? అసలు ఈ నోటు చెల్లుబాటు అవుతుందా? అంటూ కొందరిలో అనుమానాలున్నాయి. ఇలాంటి అనేక అంశాలకు ఆర్బీఐ ఇచ్చిన సమాధానమిది. ఇది చదివితే మీకే స్పష్టత వస్తుంది.
ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం.. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను రద్దు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. అంటే ప్రజలకు నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉంచాలనుకుంటోంది. రూ.2 వేల నోట్లను రద్దు చేయాలని నిర్ణయించినా ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యేమీ లేదు. సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లు చెల్లుబాటు అవుతాయి. గతంలోలాగే రూ.2 వేల నోట్లను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అంటే రోజువారీ అవసరాల కోసం నోట్లను ఇవ్వడం, తీసుకోవడం చేయొచ్చు. ఈ నోట్లు మీ దగ్గర ఉంటే వాడుకోవచ్చు.
కానీ, వీలైనంత తొందరగా బ్యాంకులో డిపాజిట్ చేయాలి. దీంతో అకౌంట్‌కు క్రెడిట్ అవుతాయి. లేదా నోట్లు మార్చుకోవాలి. బ్యాంకుకు వెళ్లి రూ.2 వేల నోటు ఇస్తే దాని బదులు రూ.500, రూ.100 నోట్లను ఇస్తారు. దీనికి సెప్టెంబర్ చివరి వరకు టైం ఉంది కాబట్టి కంగారు పడక్కర్లేదు. ఒక్కసారి రూ.20 వేల విలువైన అంటే పది రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా అయితే రూ.4 వేల వరకు మార్చుకోవచ్చు. అన్ని బ్యాంకుల బ్రాంచీలతోపాటు, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ నోట్లు మార్చుకునే అవకాశం ఉంది. బ్యాంక్ ఖాతాలు లేని వాళ్లు కూడా ఒక్కసారి రూ.20 వేల వరకు మార్చుకోవచ్చు. ఈ పరిమితి ఎక్స్‌చేంజ్ కోసం మాత్రమే. డిపాజిట్ చేసేందుకు ఎలాంటి పరిమితి లేదు. రూ.2000 నోట్లు ఎన్నైనా డిపాజిట్ చేయొచ్చు. ఈ విషయంలో డిపాజిట్ లేదా విత్ డ్రాకు సంబంధించిన నిబంధనలు పాటిస్తే సరిపోతుంది. నోట్లు మార్చుకునేందుకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.
మీరు ఎన్ని రూ.2000 నోట్లు ఇస్తే దానికి సమాన విలువ కలిగిన ఇతర నోట్లు తిరిగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించి, వారికి కమీషన్ పేరుతో నష్టపోనక్కర్లేదు. నేరుగా నోట్లతో బ్యాంకులకు వెళ్తే సరిపోతుంది. రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు ఎక్కువ మంది బ్యాంకులకు క్యూ కట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. నోట్ల మార్పిడికి సంబంధించి బ్యాంకుల్లో లోపాలుంటే ఉన్నతాధికారులకు లేదా బ్యాంకుకు ఫిర్యాదు చేయొచ్చు. ముప్పై రోజుల్లోపు సరైన స్పందన లేకుంటే ఆర్బీఐకి ఫిర్యాదు చేయొచ్చు.