Reliance – MG Motors: ఎంజీ మోటార్ వాటా కొనుగోలు రేసులో రిలయన్స్…!
150కోట్ల ప్రజలున్న భారతదేశంలో ఇప్పుడిప్పుడే మధ్యతరగతి కార్లవైపు మొగ్గు చూపుతోంది. రానున్న రోజుల్లో ఈ రంగంలో మంచి పురోగతి ఉంటుందని రిలయన్స్ భావిస్తోంది. అందుకే ఎంజీ మోటార్స్ ఇండియా నుంచి అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందుకోవాలని తహతహలాడుతోంది.
ఎంజీ మోటార్స్… చైనాకు చెందిన ఈ ఆటోమొబైల్ కంపెనీ కార్లు ఇటీవల భారత్‌లో బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడా కంపెనీ భారతీయ వ్యాపారంలో వాటా దక్కించుకునేందుకు రిలయన్స్ ప్రయత్నాలు చేస్తోంది.
ఎంజీ మోటార్స్ ఇండియా త్వరలో భారతీయత రూపాన్ని సంతరించుకోబోతోంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఎంజీ మోటార్స్ కార్లు త్వరలో రిలయన్స్ ఎంజీ హెక్టార్ కార్లనో లేక జేఎస్‌డబ్ల్యు ఎంజీ హెక్టార్ అనో మార్కెట్‌లోకి రాబోతున్నాయి. భారత్‌లోని తన అనుబంధ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియాలో వాటాలు విక్రయించాలని ఎంజీ మోటార్ భావిస్తోంది. బ్రిటీష్ బ్రాండ్ అయిన ఎంజీ మోటార్ ప్రస్తుతం చైనాకు చెందిన ఎస్‌ఏఐసీ ( SAIC)మోటార్ కార్ప్ చేతిలో ఉంది. వచ్చే రెండు నుంచి నాలుగేళ్లలో తన వాటాను తగ్గించుకోవాలని ఎస్‌ఏఐసీ భావిస్తోంది. భారతీయ సంస్థలకు వాటాలు విక్రయించి 5వేల కోట్ల రూపాయలు సమీకరించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నాయి. రిలయన్స్, హీరోగ్రూప్, జేఎస్‌డబ్ల్యు గ్రూప్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌లు రేసులో ఉన్నాయి. చర్చలు తుదిదశలో ఉన్నట్లు ఎంజీ మోటార్ చెబుతోంది. ఈ ఏడాది చివరకు డీల్ ఫైనల్ అవుతుందని దశల వారీగా తమ వాటాను విక్రయిస్తామని ఎంజీ మోటార్స్ చెబుతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లో తన వ్యాపారాన్ని విక్రయించడం ఎస్‌ఏఐసీకి అసలు ఇష్టం లేదు. కానీ పరిస్ధితులు ఆ దిశగా నడిపించాయి. భారత్‌లో విస్తృత వ్యాపార అవకాశాలుండటంతో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ భావించింది. వ్యాపార విస్తరణకు నిధులు సేకరించేందుకు ప్రయత్నించింది. అయితే చైనా, భారత్ మధ్య సరిహద్దు ఘర్షణ ఎంజీ మోటార్స్‌కు తలనొప్పిగా మారింది. చైనా మూలాలున్న కంపెనీల్లో తాజా పెట్టుబడులపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తోంది. ఎఫ్‌డీఐ నిబంధనలు కఠినతరం కావడంతో రెండేళ్లుగా ఆ సంస్థ అదనపు నిధులు పొందలేకపోయింది. ఇక చైనా నుంచి నిధులు అందే అవకాశం లేకపోవడంతో ఎంజీ మోటార్స్ ఇండియా ప్రత్నామ్నాయంగా మెజారిటీ వాటా విక్రయానికి సిద్ధమైంది. భారతీయ కంపెనీలకు విక్రయిస్తే ఇబ్బందులు తొలగుతాయి కాబట్టి ఆ దిశగా చర్చలు జరుపుతోంది. దీని ద్వారా వచ్చే 5వేల కోట్లతో దేశంలో వ్యాపారాన్ని విస్తరించనుంది. గుజరాత్‌లోని హలోల్‌లో కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. రానున్న ఐదేళ్లలో ఏడాదికి 3లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈవీలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రానున్న ఐదేళ్లలో నాలుగు నుంచి ఐదు ఎలక్ట్రిక్ మోడల్స్‌ను కూడా లాంచ్ చేయనుంది. భవిష్యత్తులో ఈవీ పోర్ట్‌ఫోలియో ద్వారానే 65నుంచి 75శాతం విక్రయాలు జరగాలన్నది ఎంజీ మోటార్స్ ఇండియా వ్యూహం. 2028లోగా తన వాటాను పూర్తిగా తగ్గించుకుని అప్పుడు ఐపీఓకు వెళ్లాలని కూడా భావిస్తోంది.
ఏడాది చివరకు డీల్ ఫైనలైజ్ అవుతుందని చెబుతున్నా అంతకుముందే ఒప్పందం కుదిరే అవకాశం లేకపోలేదు. ఎంజీ మోటార్స్ ఇండియాకు ఇప్పుడు నిధులు అత్యవసరం. ఈ చర్చల్లో రిలయన్స్ ప్రస్తుతం ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కొత్త అవకాశాలను రెండు చేతులతో అందిపుచ్చుకుంటున్న రిలయన్స్ ఎలాగైనా ఎంజీ మోటార్స్ ఇండియాలో వాటాను దక్కించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే సబ్బుల నుంచి కూల్‌డ్రింక్‌ల వరకు, బట్టల నుంచి పెట్రోల్ వరకూ పలు వ్యాపారాల్లో రిలయన్స్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. తన పోర్ట్ ఫోలియోకు కార్ల వ్యాపారాన్ని కూడా చేర్చితే వ్యాపార సామ్రాజ్యం మరింత విస్తృతమవుతుందని ముకేష్ అంబానీ భావిస్తున్నారు. 150కోట్ల ప్రజలున్న భారతదేశంలో ఇప్పుడిప్పుడే మధ్యతరగతి కార్లవైపు మొగ్గు చూపుతోంది. రానున్న రోజుల్లో ఈ రంగంలో మంచి పురోగతి ఉంటుందని రిలయన్స్ భావిస్తోంది. అందుకే ఎంజీ మోటార్స్ ఇండియా నుంచి అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందుకోవాలని తహతహలాడుతోంది.