Resale Value: వాడిన కారుకు మంచి ధర రావాలంటే ఏం చేయాలి..?

కారు ఉంటే ఒకప్పుడు షావుకారు అనేవారు. కానీ ప్రస్తుతం షికారు అనేలా పరిస్థితి మరిపోయింది. ఎందుకంటే సెకెండ్ హ్యాండ్ కారునైనా కొనుగోలు చేసేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారిని క్యాష్ గా చేసుకొని మీ దగ్గర ఉన్న కారును అమ్మితే మీకు మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి ప్రతి సారీ ఉండక పోవచ్చు. మరి ‎ఏ ఏ సందర్భాల్లో వాడిన కారును అమ్మితే మంచి ధర వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2023 | 06:30 PMLast Updated on: Apr 08, 2023 | 6:30 PM

Resale Value For Car

ఏ వస్తువైనా అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనేలాగే ఉంటుంది. ఇక ఇంధనంతో నడిపే వాహనాల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడున్న పెట్రోలు రేట్లకు నిర్వహణ చేయలేక పోతున్నారు. అలాంటి వారు ఇతర ప్రత్యామ్నాయాల వైపుకు అడుగులు వేస్తున్నారు. ఉదాహరణకు ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి రావడంతో వాటిని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఇలాంటి వారు తమ వద్ద ఉన్న పాత కారును అమ్యేందుకు యోచిస్తారు. అలాంటి సమయంలో మీ వాహనానికి మంచి ధర పలకాలంటే ఎక్కువ దూరం తిరిగిందా లేదా చూసుకోండి. అలాగే కొనుగోలు చేసి ఎన్ని సంవత్సరాలు గడిచిందో గమనించండి. అప్పుడు మీ కారుకు మంచి ధర వస్తుందో లేదో తెలిసిపోతుంది.

సాధారణంగా కారును కొనుగోలు చేసిన 5 సంవత్సరాల వరకూ మధ్య తరగతి, ఎగువ తరగతి వాళ్లు అమ్మాలనుకోరు. ఎందుకంటే దీనికి పెట్టుబడి అంతటి స్థాయిలో ఉంటుంది కనుక. వాటిని బాగా ఉపయోగించిన తరువాతే అమ్మేందుకు సిద్దపడతాడు. అలా అమ్మాలనుకుంటే చిన్న సూత్రాన్ని పాటించండి. ప్రస్తుతం కొనాలనుకున్న కారు ధర ఎంత.. మనం వినియోగించే కారు నిర్వహణ ఖర్చు 5 సంవత్సరాలకు ఎంత అని లెక్కకడితే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే కారుకొనే ధర కంటే పాత కారు నిర్వహణకే ఎక్కువ అవుతోంది అనిపిస్తే తక్షణమే మీ వద్ద ఉన్న కారును అమ్మేందుకు ముందడుగు వేయవచ్చు.

కొందరు మార్కెట్ లో వచ్చిన సరికొత్త కారు మోడల్స్ ను విరివిగా కొంటూ ఉంటారు. అలాంటి వారు తమ వాహనం ఎంత దూరం తిరిగిందో తెలుసుకొని అమ్మితే మంచిది. ఎందుకంటే నిపుణుల సూచనల ప్రకారం కారు కొనుగోలు చేసిన 4-5 ఏళ్ల లోపు అమ్మితే మంచి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. అది కూడా 50 నుంచి 60 శాతం వరకూ మనం కొనుగోలుకు పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుంది. దీంతో అప్డేటెడ్ మోడల్స్ ని కొనేందుకు ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. అందుకే తరచూ కారును మార్చే వారు 3 సంవత్సరాల లోపు అమ్మినట్లయితే సగానికి పైగా డబ్బును పొందేందుకు వెసులుబాటు ఉంటుంది. కొనుగోలు చేసే వారు కూడా ఉత్సాహంగా కొనేందుకు ముందుకు వస్తాడు.

ఇక కరోనా వచ్చి ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త మార్పుకు తెర లేపింది. ప్రతి ఒక్కరూ వర్క్ ఫ్రం హోం అనే కాన్సెప్ట్ ను అవలంభిస్తున్నారు. దీంతో వాహనం మెయింటెనెన్స్ లేకపోవడంతో వాటిని అప్పుడప్పుడు వినియోగించాలంటే షెడ్డులో రిపేర్ చేయించాల్సి వస్తుంది. ఇలా తరచూ షెడ్డుకు చేరిస్తే కొసరుకన్నా అసలు కరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నిరుపయోగంగా ఉన్న వాటిని ఎప్పటి కప్పుడు విక్రయిస్తేనే మంచిది. ఆలస్యం చేసే కొద్ది మన మోడల్ పాతబడి పోతుంది. అమ్మెందుకు ప్రయత్నిస్తే సగానికన్నా తక్కువ మొత్తంలో డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకే వాడకుండా ఉన్నామంటే వాటిని ఎప్పటికప్పుడు అమ్మేందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడు నష్టాన్ని తీవ్ర రూపంలో చవిచూడకుండా ఉండేందుకు ఈ విధానం దోహదపడుతుంది.

ఇవన్నీ కాకపోతే ఎంత చెత్త కారునైనా స్రాప్ లో వేయవచ్చు. ఇది కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన విన్నూత్నమైన పథకాల్లో ఒకటి. మోటారు వాహన చట్టం ప్రకారం మన సొంతానికి వాడుకునే వాహనాలను 20 సంవత్సరాలు, వ్యాపార,వాణిజ్య అవసరాలకు వినియోగించే వాటికి 15 సంవత్సరాల కాల పరిమితిని విధించింది. ఈ కేటాయించిన సమయాని కంటే ఎక్కువ రోజులు వాడకూడదు. మరి అలా నిరుపయోగంగా పడిన కార్లను పరీక్షిస్తారు. వాటి సామర్థ్యాన్ని పరీక్షించి అవి వాడవచ్చా లేదా అనేది చెబుతారు. ఈ పరీక్షల్లో విఫలం అయిన కార్లను తుక్కు గా మార్చేందుకు ప్రభుత్వాలు సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. అందుకే అలాంటి కార్లను తుక్కు కేంద్రాలకు పంపడం ద్వారా మనకు ఒక ధృవీకరణ పత్రాన్ని ఇస్తాయి. భవిష్యత్తులో ఈ సర్టిఫికేట్ ను కొత్త కారు కొనుగోలు చేసే షోరూంలలో చూపిస్తే కొనుగోలు చేసే వాహనంపై 5శాతం వరకూ రాయితీ లభిస్తుంది.

మనం కార్లను విక్రయించాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే అరడజను మార్గాలు మన ముందుకు ప్రత్యక్షమౌతాయి. అలా మారిపోయింది ప్రస్తుతం యుగం. మన మొబైల్ ఫోన్ లోనే రకరకాల భద్రతాయుతమైన యాప్ లు అందుబాటులో వచ్చాయి. అందులో మన కారు వివరాలు, ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే కంపెనీ టెక్నీషియన్ మన దగ్గరకు వచ్చి వాటి ధరకు సంబంధించిన వివరాలు అన్నీ మనతో వివరిస్తాడు. మనకు అతను చెప్పిన ధరకు తృప్తి చెందితే వెంటనే వారికి అమ్మేయవచ్చు. అలాగే ఏజెంట్లు, మెకానిక్ లు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు. వారిని సంప్రదించి కూడా మన కారుకు సరైన విలువను పొందవచ్చు. అయితే అమ్మిన వెంటనే ఆ కారుకు సంబంధించిన పూర్తి పత్రాలను కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలి. లేకుంటే భవిష్యత్తులో అతను చేసిన తప్పులకు మీరు జవాబుదారీ వ్యవహరించవలసి వస్తుంది. కారుకు సంబంధించిన పూర్తి హక్కులు కొన్న వ్యక్తికి పంపిణీ చేయడం వల్ల మనకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిశ్చింతగా ఉండవచ్చు.

 

T.V.SRIKAR