మీ ఇంటి ఈఎంఐ తగ్గిందా…!
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపోరేట్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపోరేట్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రెపోరేట్ 6.25శాతం ఉండగా దాన్ని 6శాతానికి తగ్గించారు. ఈ ఏడాదిలో ఇది రెండో కోత. చాలాకాలం తర్వాత ఫిబ్రవరిలో వడ్డీరేట్లు 25బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఇప్పుడు మరోసారి తగ్గించడంతో రెండు నెలల వ్యవధిలోనే దాదాపు అరశాతం తగ్గినట్లైంది. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో వడ్డీరేట్లు దిగిరానున్నాయి. హోం లోన్ తీసుకుని ఇళ్లు తీసుకున్నవారికి ఈ నిర్ణయం ఎంతో రిలీఫ్ ఇవ్వనుంది. బ్యాంకులు తమ వడ్డీరేట్లను మరికాస్త తగ్గించనున్నాయి. దీనివల్ల హోమ్ లోన్ ఈఎంఐ కొంతమేర తగ్గనుంది. ధరలు పెరుగుతున్న ఈ సమయంలో ఇది ఉపయోగకరమైనదే.
ఉదాహరణకు మీరు పోయిన నెలలో బ్యాంకు నుంచి 50లక్షల లోన్ తీసుకుని 8.5శాతం వడ్డీరేటుతో నెలకు 43వేల ఈఎంఐ కడుతున్నారనుకుంటే ఇప్పుడు వడ్డీరేటు పావుశాతం తగ్గే అవకాశం ఉంది. అంటే మీరు లోన్ టెన్యూర్ తగ్గించుకుంటే దాదాపు ఏడాది తగ్గుతుంది. 20ఏళ్ల రుణం కాస్తా 19ఏళ్లకు తగ్గిపోతుంది. అంటే దాదాపు ఐదులక్షలకు పైగా మిగులుతుంది. అదే జనవరిలో లోన్ తీసుకుని ఉంటే రెండుసార్లు వడ్డీరేట్లు తగ్గాయి కాబట్టి మీకు వడ్డీభారం దాదాపు 9లక్షలకు పైగా తగ్గుతుంది. లోన్ టెన్యూర్ ఏకంగా 22నెలలు తగ్గుతుంది. కొంతమంది లోన్ టెన్యూర్ కాకుండా ఈఎంఐ తగ్గించుకోవాలని చూడొచ్చు. కానీ ఈ సమయంలో ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడం కంటే లోన్ టెన్యూర్ తగ్గించుకోవాలన్నది నిపుణుల సూచన.
హోంలోన్ తీసుకున్న వారికే కాదు ఇకపై వాహన రుణాలు తీసుకోవాలనుకుంటున్న వారికి కూడా తక్కువ వడ్డీరేటుకే రుణాలు దక్కనున్నాయి. పర్సనల్ లోన్స్‌పై కూడా వడ్డీరేట్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు వృద్దిరేటుపై ప్రభావం చూపుతాయని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. పరిస్థితి మరింత చేయిదాటకముందే వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయానికి వచ్చింది. అయితే బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేవారికి మాత్రం ఇది కాస్త చేదువార్తే. వారికి దక్కే వడ్డీ కొంతమేర తగ్గే అవకాశాలు లేకపోలేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై 27శాతం పన్ను విధించారు. ఫలితంగా మన ఎగుమతులు తగ్గనున్నాయి. దీంతో మన వృద్ధిరేటుపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. గోల్డ్‌మెన్ శాచ్ లాంటి సంస్థలు కూడా మన వృద్ధిరేటులో కోతపెట్టాయి. ఈ పరిస్థితులకు రేట్ల కోత కొంత ఉపశమనం అని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. ఐదేళ్లలో తొలిసారిగా గత ఫిబ్రవరిలో వడ్డీరేట్లు తగ్గించారు. ఫలితంగా బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా 80బిలియన్ డాలర్ల లిక్విడిటీ మన మార్కెట్‌లోకి వచ్చింది. ఇప్పుడు కూడా మన వ్యవస్థను నిలబెట్టడానికి ఇలాంటి నిర్ణయమే తీసుకుంది రిజర్వ్ బ్యాంక్.
రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం స్తబ్దుగా ఉన్న రియాలిటీ రంగానికి మళ్లీ ఊపు రానుంది. వడ్డీరేట్లు తగ్గడంతో గృహరుణాలు పెరిగే అవకాశం ఉంది. అమ్ముడుపోకుండా మిగిలిన యూనిట్లకు మోక్షం దక్కవచ్చు. నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. వాహనాల అమ్మకాలు కూడా కాస్త మందగించాయి. దానికి కూడా ఇది బూస్ట్‌లా పనిచేయనుంది. ఈ ఏడాది అమెరికా ఫెడ్ మరో రెండుసార్లు రేట్ల కోత పెడుతుందన్న అంచనాలున్నాయి. అదే జరిగితే మన దగ్గర కూడా వడ్డీరేట్లు భారీగా తగ్గే అవకాశాలున్నాయి.