Rs 2000 Notes: గుట్టలకొద్దీ వచ్చిపడుతున్న రెండు వేల రూపాయల నోట్లు.. లక్ష కోట్లు వస్తాయని అంచనా

వారం రోజుల్లోనే రూ.36 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వచ్చి చేరినట్లు అంచనా. డిపాజిట్లు లేదా మార్పిడి పేరుతో నోట్లు బ్యాంకులకు చేరాయి. ఆర్బీఐ సమాచారం ప్రకారం.. గత నెల 26 నాటికి దేశంలో మొత్తం రూ.34.4 లక్షల కరెన్సీ చెలామణిలో ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 2, 2023 | 03:06 PMLast Updated on: Jun 02, 2023 | 3:07 PM

Rs 2000 Note Withdrawal To Add Up To Rs 1 5 Lakh Cr Of Deposits To Banks

Rs 2000 Notes: రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచి భారీ స్థాయిలో నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అవుతున్నాయి. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న వారం రోజుల్లోనే రూ.36 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వచ్చి చేరినట్లు అంచనా. డిపాజిట్లు లేదా మార్పిడి పేరుతో నోట్లు బ్యాంకులకు చేరాయి. ఆర్బీఐ సమాచారం ప్రకారం.. గత నెల 26 నాటికి దేశంలో మొత్తం రూ.34.4 లక్షల కరెన్సీ చెలామణిలో ఉంది.

అయితే, రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకులకు చేరుతుండటం వల్ల ఆ మేరకు కరెన్సీ తగ్గుతుంది. దీంతో రూ.36 వేల కోట్ల కరెన్సీ చెలామణిలో లేకుండా పోయింది. చాలా మంది తమ దగ్గరున్న రూ.2 వేల నోట్లను మార్చుకునే బదులు.. డిపాజిట్ చేసేందుకే ఆసక్తి చూపారు. ఒక సంస్థ అధ్యయనం ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.3.7 లక్షల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు మార్కెట్లో చెలామణిలో ఉన్నాయి. చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల విలువలో రెండు వేల రూపాయల నోట్ల వాటా 10.8 శాతంగా ఉంటుందని అంచనా. ఈ నోట్లన్నీ బ్యాంకులకు తిరిగి వస్తాయని చెప్పలేం. మూడింట్లో ఒక వాటా నోట్లు తిరిగొచ్చినా దీని విలవు రూ.40 వేల కోట్ల నుంచి రూ.1.1 కోట్లు ఉంటుంది.

ప్రస్తుత రూ.2 వేల నోట్లు భారీ సంఖ్యలో బ్యాంకులకు చేరుతున్న నేపథ్యంలో మొత్తం రూ.50 వేల నుంచి రూ.లక్ష కోట్ల వరకు రావొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వినియోగదారులు అత్యధికంగా ఎస్బీఐలో నోట్లను జమ చేస్తున్నారు. ఎస్బీఐ, అనుబంధ బ్యాంకుల్లో వారం రోజుల్లోనే రూ.14 వేల కోట్ల రూపాయలు వచ్చి చేరినట్లు భావిస్తున్నారు. అంటే సగటున 7 కోట్ల రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకులో డిపాజిట్ అయ్యాయి. అలాగే రూ.3 వేల కోట్ల విలువైన నోట్లను మార్చుకున్నారు. దీనిని కూడా అంకెల్లోకి మార్చుకుంటే 1.50 కోట్ల నోట్లు బ్యాంకుల్లో మార్చుకున్నారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో 20 శాతం ఎస్బీఐకి చేరాయి.

రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ గత నెల 19న ప్రకటించింది. అయితే, ప్రస్తుతం ఇవి చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ చెప్పింది. సెప్టెంబర్ 30 వరకు వీటిని వాడుకోవచ్చని, ఆ లోపు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడం లేదా మార్చుకోవడం చేయాలని ఆర్బీఐ సూచించింది.