Self Driving Car: ఇండియాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. విజయవంతమైన ట్రయల్ రన్.. మార్కెట్లోకి ఎప్పుడంటే..?

ప్రస్తుతం మనం 21 శతాబ్ధంలో ఉన్నాం. ఎటు చూసినా ఆధునికత వెల్లివిరుస్తోంది. ఒకప్పుడు సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనంగా అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలను ఉదాహరణగా చెప్పేవారు. కానీ వాటిని చెరిపేసే స్థాయిలో లేకపోయినా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటుంది భారత్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ ద్వారా ప్రపంచ దేశాల దృష్టి తనవైపుకు ఆకర్షించేలా అడుగులు ముందుకు వేస్తోంది. స్వయంగా తనంతట తానే నడుపుతూ వెళ్లే కార్ల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 5, 2023 | 05:26 PMLast Updated on: Jun 05, 2023 | 5:26 PM

Self Driving Car In India

ఇప్పటి యాంత్రిక యుగంలో పెట్రోల్, డీజల్ తో నడిపే కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను కూడా చూసేశాం. వాటిలో కొందరు వినియోగిస్తూ వాటి అనుభూతిని ఆస్వాదిస్తున్నారు కూడా. అయితే ఇవన్నీ ఎవరో ఒకరు డ్రైవింగ్ చేస్తేనే ముందుకు సాగుతాయి. అలా కాకుండా తనంతట తానే నడుపుకోగల సామర్ధ్యం వీటికి ఉండదు. ఇలాంటి మధురానుభూతిని అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది బెంగళూరుకు చెందిన మైనస్ జీరో అనే సంస్థ.

మన దేశంలోనే ఉత్పత్తి

అమెరికా, రష్యా, జర్మనీ , జపాన్, చైనా వంటి దేశాలు వీటిని ఎప్పుడో తయారు చేసి వాడకంలోకి తీసుకువచ్చారు. అయితే ఇండియాలో అడపాదడపా విదేశాలకు చెందిన కొన్ని సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు ఉన్నాయి. అయితే అవి మన రోడ్లపై ప్రయాణానికి అనువుగా లేవు. అందుకే పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఈ మైనస్ జీరో అనే సంస్థ వారు తయారు చేసే కారు ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకొని ప్రయాణం చేస్తుందట. త్వరలోనే స్వదేశీ గడ్డపై పరుగులు పెట్టేందుకు సిద్దం అయ్యిందని తెలిపారు. దీనికి జెడ్ పాడ్ అని నామకరణం చేశారు. తాజాగా చేసిన ట్రైల్ రన్ విజయవంతం అయ్యింది.

Self Driving Car In India

Self Driving Car In India

ఆరు కెమెరాలు.. నాలుగు సీట్లు

ఈ వాహనం చూసేందుకు చాలా చిన్నగా ఉంటుంది. సన్నగా ఉండే వారు ఆరు మంది వరకూ కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో స్టీరింగ్ వీల్ ఏర్పాటు చేయలేదు. ఇదే ఇక్కడ ప్రత్యేకఆకర్షణగా నిలిచింది. స్టీరింగ్ స్థానంలో హై రెజల్యూషన్ తో కూడిన ఆరు కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాలు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో పరిస్థితి అర్థం చేసుకొని మూవ్ అయ్యేందుకు దోహదపడుతుందంటున్నారు వాహన తయారీదారులు. వీరు రూపొందించే కారు లెవెల్ 5 అటానమీ ఫీచర్లను సంతరించుకుంది. దీని వల్ల మనుషులు ప్రమేయం ఏమాత్రం లేకున్నా సేఫ్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇందులో అమర్చిన కెమెరాలు వాహనం చుట్టూ ఉండే పరిసరాలను క్యాప్చర్ చేసుకుంటుంది. పైగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రోగ్రామింగ్ చేసి ఉంచుతారు. తద్వారా కారు ఎలా వెళ్లాలి, ఎంత స్పీడ్లో వెళ్లాలి, ఎలాంటి ప్రదేశాల్లో ప్రయాణం చేస్తున్నాము అనే పరిజ్ఞానాన్ని తనంతట తానే అందిపుచ్చుకుంటుంది.

త్వరలో అందుబాటు ధరల్లో

ఇలా స్వయంగా నావిగేట్ చేసుకుంటూ మనం పొందుపరిచిన లొకేషన్ కి తీసుకు వెళ్తుంది. ప్రశాంతంగా, రద్దీ లేని రోడ్లపై తన వేగాన్ని ఆటోమేటిక్ గా మర్చుకొని ప్రయాణీకులను త్వరగా గమ్యాన్ని చేరుస్తుంది. అలాగే చిన్న చిన్న ఇరుకు సందుల్లో, రెసిడెన్షియల్ కాంప్లెక్సుల్లో, కమ్యూనిటీ అపార్ట్మెంట్లు ఇలా ఏ ప్రాంతాల్లో అయినా వాటికి తగ్గట్టుగా మూడ్స్ ఆన్ ఆఫ్ చేసుకుంటుంది అని చెబుతున్నారు. ఈ వాహనం గూగుల్ అండ్ టెస్లా కార్లకు ఏమాత్రం తీసిపోకుండా ప్రయాణిస్తుందట. ఈ కారు ఇండియన్ మార్కెట్లో కొనేందుకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందో తేదీని అయితే ప్రస్తుతానికి కంపెనీ వర్గాలు ప్రకటించలేదు. అతి త్వరలోనే అందుబాటు ధరల్లో తీసుకువస్తామని ఖచ్చితంగా చెబుతున్నాయి. వీటి ధర, మైలేజ్ వివరాలు తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి ఉండక తప్పదు.

 

T.V.SRIKAR