Simple ONE: మార్కెట్లోకి సింపుల్ బైక్.. మైలేజీ సూపర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కి.మీ. మైలేజ్!

సింపుల్ ఎనర్జీ అనే సంస్థ సింపుల్ వన్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. వచ్చే జూన్ 6 నుంచి బైక్ విక్రయాలు ప్రారంభమవుతాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 23, 2023 | 05:28 PMLast Updated on: May 23, 2023 | 5:28 PM

Simple Energy One Electric Scooter Launched Gets 212km Idc Range

Simple ONE: ఎలక్ట్రిక్ బైకులకు ఉన్న ప్రధాన లోపం మైలేజ్. ఒక్క ఛార్జింగ్‌కు గరిష్టంగా 180 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తాయి. అవి కూడా కొన్ని బైకులు మాత్రమే. ఒకట్రెండు బైకులు మాత్రం అంతకంటే ఎక్కువ మైలేజీ ఇచ్చేవి ఉన్నాయి. ఈ మైలేజీ కూడా నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం నడిపినప్పుడే సాధ్యం. లేదంటే 20-30 శాతం మైలేజీ తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే దూర ప్రయాణాలు చేసే వాళ్లు వీటిని కొనేందుకు ఇష్టపడటం లేదు.

అయితే, ఇప్పుడు అలాంటి వాళ్లకు కూడా ఉపయోగపడేలా ఒక ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి రానుంది. సింపుల్ ఎనర్జీ అనే సంస్థ సింపుల్ వన్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. రెండేళ్లక్రితమే ఈ బైక్ నమూనా విడుదలైంది. తాజాగా దీన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. వచ్చే జూన్ 6 నుంచి బైక్ విక్రయాలు ప్రారంభమవుతాయి. మొదట బెంగళూరులోనే దీని విక్రయాలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇతర నగరాల్లోనూ అందుబాటులోకి తెస్తారు. ఈ బైక్‌కు సంబంధించిన ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. అధునాతన ఫీచర్లు దీనిలో ఉన్నాయని సంస్థ తెలిపింది.

తమ బైకులు వాడే వినియోగదారులకు మంచి అనుభూతిని, సేఫ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు అనేక పరీక్షలు నిర్వహించినట్లు కంపెనీ చెప్పింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. మైలేజ్, స్మార్ట్, ఫాస్ట్ టెక్నాలజీ, డ్యుయల్ బ్యాటరీ వంటివి ఈ బైక్ ప్రత్యేకతలు. 5 కిలో వాట్ అవర్ శక్తి కలిగిన ఐయాన్ లిథియం డ్యుయల్ బ్యాటరీని కంపెనీ అందిస్తోంది. ఇది ఐపీ67 రేటింగ్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో డిజిటల్ డిస్‌ప్లేను బైక్ కలిగి ఉంది. నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, బ్యాటరీ రేంజ్, డాక్యుమెంట్ స్టోరేజ్, కాల్ అలర్ట్ వంటి ఫీచర్లు స్క్రీన్‌పై పని చేస్తాయి. ఒక్క నిమిషం చార్జ్ చేస్తే 1.5 కిలోమీటర్లు ప్రయాణించగలిగినంత ఛార్జింగ్ అవుతుంది. 80 శాతం ఛార్జింగ్ పూర్తయ్యేందుకు 05.54 గంటల సమయం పడుతుంది.

ఒక్కసారి బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 2.77 సెకండ్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బైక్ ధర రూ.1.45 లక్షలు (ఎక్స్ షో రూం, బెంగళూరు). 750 వాట్స్ పోర్టబుల్ ఛార్జర్ కోసం అదనంగా రూ.13,000 చెల్లించాల్సి ఉంటుంది. ఆరు రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులోకి రానుంది. ఈ బైక్ 212 కిలోమీటర్ల రేంజ్ కాబట్టి లాంగ్ రైడ్ చేయాలనుకునే వాళ్లకు కూడా మంచి ఆప్షనే అవుతుందని కంపెనీ భావిస్తోంది.