RS 2000 NOTES: రూ.2వేల నోట్లుంటే 6 రోజుల్లోగా మార్చుకోండి.. లేదంటే..
ఇంకా ఎవరి దగ్గరయినా 2వేల రూపాయల నోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో మార్చుకోవడం బెటర్. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెట్టిన సెప్టెంబరు 30 డెడ్ లైన్ ముంచుకొస్తోంది.
RS 2000 NOTES: రూ.2000 నోట్లను మార్చుకునేందుకు ఇంకో 6 రోజులే టైం మిగిలింది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెట్టిన సెప్టెంబరు 30 డెడ్ లైన్ ముంచుకొస్తోంది. ఇంకా ఎవరి దగ్గరయినా 2వేల రూపాయల నోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో మార్చుకోవడం బెటర్. వాస్తవానికి ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నామని ఈ సంవత్సరం మే 19నే ఆర్బీఐ అనౌన్స్ చేసింది. దీంతో ప్రజలు తమ వద్దనున్న రూ.2వేల నోట్లను చకచకా బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు.
సెప్టెంబరు 1 నాటికే రూ.3.32 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు ఆర్‌బీఐ గల్లా పెట్టెలోకి చేరిపోయాయి. దీంతో దేశంలో చలామణిలోకి పంపిన రూ.2వేల నోట్లలో 93 శాతం తిరిగి వచ్చినట్టేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆగస్టు 31 నాటికి దేశంలో కేవలం రూ.0.24 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లే చలామణిలో ఉన్నాయని తెలిపింది. మే 19 నుంచి సెప్టెంబర్ 14 వరకు వివిధ బ్యాంకులకు అందిన 2వేల రూపాయల నోట్ల వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ యాజమాన్యంలోని UCO బ్యాంకులో అత్యధికంగా రూ.3,500 కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్లు డిపాజిట్ అయ్యాయి. సిటీ యూనియన్ బ్యాంక్ లో రూ.1100 కోట్ల విలువైన 2వేల రూపాయల నోట్లు వచ్చాయి. సౌత్ ఇండియన్ బ్యాంక్‌కు రూ.1,239 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వచ్చాయి.
ఇప్పటికీ రూ.2 వేల నోట్లను మార్చుకోనివారు ఎవరైనా ఉంటే బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు. లేదంటే అక్టోబర్ 1 నుంచి ఈ డినామినేషన్ నోట్లు ఎక్కడా చెల్లవు. గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. రానున్న 6 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందుకని వినియోగదారులు బ్యాంకు పనివేళలను తెలుసుకొని 2వేల రూపాయల నోట్లతో వెళ్తే మంచిది. రూ.2,000 నోట్లను ఇంకా సమర్పించని వారి కోసం.. వాటిని మార్చుకునే గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొడిగించే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబరు చివరి వారంలో వరుసగా సెలవులు వస్తున్న తరుణంలో రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు ఇంకో రెండువారాల గడువు ఇచ్చినా ఆశ్చర్యం లేదనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఇక 2వేల నోటు ఉపసంహరణ ప్రకటన తర్వాత మార్కెట్లో ఆ నోట్లతో బిజినెస్ బాగా జరిగింది. ముఖ్యంగా గోల్డ్ మార్కెట్ లో 2వేల నోట్లు అనూహ్యంగా జమయ్యాయి. బ్యాంకులకు వెళ్లడం ఇష్టం లేని కస్టమర్లు.. ఇతరత్రా వస్తువుల కొనుగోలు సమయంలో 2వేల నోట్లు మార్పిడి చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం కూడా ఎవరికీ లేదు. మార్కెట్‌లో ఎవరూ 2వేల నోట్లు తీసుకోవడంలేదు. అమెజాన్ లాంటి కంపెనీలైతే బహిరంగంగానే దీనిపై ప్రకటనలు చేస్తున్నాయి. దేశ చరిత్రలో తొలిసారిగా 2016లో పరిచయమైన రూ.2వేల నోటు.. మరో 6 రోజుల్లో అంతర్ధానం కానుంది.
చలామణిలోకి వచ్చిన రూ.2వేల నోట్లలో దాదాపు 89 శాతం 2017 మార్చికి ముందు విడుదలైనవే కావడం గమనార్హం. 2018 మార్చి 31 నాటికి మన దేశంలో రూ.2వేల నోట్ల విలువ గరిష్ఠంగారూ.6.73 లక్షల కోట్లు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి వాటి విలువ రూ.3.62 లక్షల కోట్లకు పరిమితమైంది. అంటే వాటిని ఆర్బీఐ ముందస్తుగానే వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టింది. కొత్తగా 2వేల రూపాయల నోట్ల ప్రింటింగ్ కూడా 2020 సంవత్సరం నుంచే ఆపేసింది.