Lay Offs: రోజుకు 2,732 టెక్ జాబ్స్ గోవిందా…!!

ఉద్యోగానికి వెళ్లేముందు ప్రతి ఒక్కరు మెయిల్స్ చెక్ చేసుకుంటున్నారు. టెర్మినేషన్ మెయిల్ లేకపోతేనే ఆఫీసు బాట పడతున్నారు. ఆఫీసుకు వెళ్లగానే పింక్ స్లిప్ ఉందేమోనని చూసుకుంటున్నారు. లేకపోతే హమ్మయ్య ఈ రోజుకు సేఫ్ అంటూ పనిలో పడిపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2023 | 09:20 PMLast Updated on: Feb 26, 2023 | 9:20 PM

Tech Companies Reducing Cost By Lay Offs

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల కారణంగా అన్ని రంగాల ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. అయితే అన్నింటికంటే ఎక్కువగా టెక్నాలజీ రంగం మాత్రం తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. ఉద్యోగానికి వెళ్లేముందు ప్రతి ఒక్కరు మెయిల్స్ చెక్ చేసుకుంటున్నారు. టెర్మినేషన్ మెయిల్ లేకపోతేనే ఆఫీసు బాట పడతున్నారు. ఆఫీసుకు వెళ్లగానే పింక్ స్లిప్ ఉందేమోనని చూసుకుంటున్నారు. లేకపోతే హమ్మయ్య ఈ రోజుకు సేఫ్ అంటూ పనిలో పడిపోతున్నారు.

2023లో సగటున రోజుకు 2,700 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోతున్నారని అంచనా. టెక్ లేఆఫ్స్ ను లెక్కగట్టే ట్రూఅప్ డేటా ప్రకారం టెక్ కంపెనీలు ఇప్పటి వరకు 534లే ఆఫ్స్ ప్రకటించాయి. లక్షా 53వేలకు పైగా ఉద్యోగాలు మాయమయ్యాయి. అంటే సగటున రోజుకు 2వేల 732మంది టెకీలు నిరుద్యోగులుగా మారిపోతున్నారన్నమాట. 2023 టెకీలకు అసలు కలసిరాలేదు. కొత్త ఉద్యోగాలు దొరకడం లేదు. సంస్థలు వేలమంది ఉద్యోగుల్ని ఇళ్లకు పంపిస్తున్నాయి. పోనీ ఉద్యోగాలు మిగిలిన వారంతా హ్యాపీనా అంటే అదీ లేదు. వారి జీతాల్లో కోత పడుతోంది. లేదంటే హైక్స్ ఆపేస్తున్నారు. ఉద్యోగం ఉంటే చాలనుకునే చాలామంది ఇంక్రిమెంట్ల గురించి ఆలోచించే ధైర్యం కూడా చేయడం లేదు. అమెజాన్ తన ఉద్యోగుల జీతాల్లో 50శాతం వరకు కోత పెట్టే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. గూగుల్ అయితే ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులు డెస్క్ షేర్ చేసుకోవడం వంటి సూచనలు చేస్తోంది. టెక్ జెయింట్స్ తో పాటు యూనికార్న్స్, స్టార్టప్స్ ఇలా అన్నింటిలోనూ ఇదే పరిస్థితి.

అంతర్జాతీయ పరిస్థితులు జాబ్ డేటాను డిసైడ్ చేస్తాయి. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణ కట్టడి కష్టంగా మారింది. ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన మాంద్యం భయాలు రోజురోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చే ఓ వార్త వచ్చిందనుకుంటే ఈ లోపే మరో 9 నెగెటివ్ వార్తలు వచ్చిపడుతున్నాయి. అమెరికా- రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మరోసారి మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు కూడా మాంద్యం అంచున నిలబడ్డాయి.

మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద సంస్థలన్నీ కోతల బాటలోనే ఉన్నాయి. మెటా 11వేల ఉద్యోగాల కోతను ప్రకటించింది. గూగుల్ 12వేల మందికి ఉద్వాసన చెప్పింది. మైక్రోసాఫ్ట్ 10వేల మందిని ఇంటికి పంపింది. అమెజాన్ ఏకంగా 18వేల ఉద్యోగాల్లో కోత పెట్టింది. ట్విట్టర్ కూడా ఆరున్నర వేలమందికి పైగా వదిలించుకుంది. చాలా సంస్థలు ఇప్పటికే కోతలను ప్రకటించాయి. మరికొన్ని తాజాగా మరింత మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమవుతున్నాయి. ఫేస్ బుక్ కొత్తగా 11వేల మందిని తీసేయనుంది. ఎరిక్సన్ కూడా 8,500 ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు తెలిపింది. కన్సల్టింగ్ సంస్థ మెక్ కిన్సే కూడా 2వేలమందికి ఉద్వాసన చెప్పనుంది.

గతేడాది అన్ని టెక్ కంపెనీలు 1,535 లేఆఫ్స్ ప్రకటించాయి. దానివల్ల 2,41,176 ఉద్యోగాలు పోయాయి. అంటే సగటున రోజుకు 660 ఉద్యోగాలు పోయాయి. కానీ ఈసారి మాత్రం తొలి నెలన్నర రోజుల్లోనే లక్షన్నరకు పైగా కోతలు పడ్డాయి. అంటే సగటున రోజుకు 2వేల 732మంది నిరుద్యోగులవుతున్నారన్నమాట.

కరోనా తర్వాత వ్యాపారం సాధారణ పరిస్థితికి వచ్చినా లాభాలు తగ్గుతున్నాయి. దీంతో టెక్ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. అదే సమయంలో చాట్ బోట్స్ వంటి ఆర్ఠిఫీషియల్ ఇంటెలిజెన్స్ వైపు సంస్థలు మొగ్గుచూపుతున్నాయి. దీనికి మానవ వనరులు అంతగా అవసరం ఉండదు. ఇవి మనుషుల కంటే సమర్ధంగా పనిచేయగలవని కంపెనీలు నమ్ముతున్నాయి. ఈ ఏడాది తొలి అర్థభాగం అంతా ఇదే పరిస్థితి కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితి కొంత కుదుటపడుతుందని చెబుతున్నారు.

(KK)