Indian Tesla: మేడిన్ ఇండియా టెస్లా…! కమింగ్ సూన్..!!
20 లక్షల రూపాయలకే ఎలక్ట్రిక్ కారు... అది కూడా ఎంట్రీ లెవల్ కారు కాదు... అదిరిపోయే ఫీచర్స్ ఉన్న టెస్లా కారు... అన్నీ అనుకున్నట్లు జరిగితే మన రోడ్లపై మారుతీ, టాటా, హుండయ్ కార్లే కాదు టెస్లా కార్లు కూడా కనిపిస్తాయి.
20 లక్షల రూపాయలకే ఎలక్ట్రిక్ కారు… అది కూడా ఎంట్రీ లెవల్ కారు కాదు… అదిరిపోయే ఫీచర్స్ ఉన్న టెస్లా కారు… అన్నీ అనుకున్నట్లు జరిగితే మన రోడ్లపై మారుతీ, టాటా, హుండయ్ కార్లే కాదు టెస్లా కార్లు కూడా కనిపిస్తాయి.
టెస్లా కారంటే ఓ క్రేజ్… ఈవీ మార్కెట్‌లో అదో వండర్….. ఈ రంగంలో టెస్లా సృష్టించిన ప్రభంజనం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి టెస్లా త్వరలో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అంటే ఎక్కడ్నుంచో కార్లు దిగుమతి చేసుకోవడం కాదు… మన దేశంలోనే కార్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయాలని టెస్లా అధినేత మస్క్ భావిస్తున్నారు. దీనికోసం భారత ప్రభుత్వంతో టెస్లా చర్చలు జరుపుతోంది. ప్రస్తుతానికి ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నప్పటికీ టాక్స్ మాత్రం ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి 5లక్షల కార్లను ఉత్పత్తి చేసేగిగా ప్లాంట్ పెట్టాలన్నది టెస్లా ఆలోచన. వాటిని భారత్‌లో విక్రయించడంతో పాటు ఇండో పసిఫిక్ దేశాలకు ఎగుమతి చేయాలన్నది మస్క్ ప్లాన్. కార్ల తయారీతో పాటు మన దేశంలో ఇబ్బందికరంగా మారిన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై కూడా టెస్లా ఫోకస్ చేయనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగి గిగా ప్లాంటును ఏర్పాటు చేస్తే దేశంలో మారుతి, హుండయ్ తర్వాత మూడో అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా టెస్లా అవతరిస్తుంది.
టెస్లా ఎంట్రీ ఇస్తే మాత్రం దేశీయ విద్యుత్ వాహన రంగంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల ధర కాస్త ఎక్కువగానే ఉంది. అందులోనూ హై ఎండ్ కార్ల ఖరీదు ఇంకా ఎక్కువ. కొన్ని కంపెనీలు తక్కువ ధరకు ఇస్తున్నా టెస్లా స్థాయి టెక్నాలజీ అయితే లేదు. టెస్లా కార్లు మన దగ్గర తయారైతే వాటి ప్రారంభ ధర 20లక్షల రూపాయల నుంచి ఉంటుందని చెబుతున్నారు. ఇంకా తక్కువ కూడా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. అది అందించే సౌకర్యాలతో పోల్చితే ఆ ధర సరైనదేనన్నది నిపుణుల అభిప్రాయం. పోటీ పెరిగి మిగిలిన కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు కూడా తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి రావొచ్చు.
భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని మస్క్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన అడిగినన్ని రాయితీలు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రమ్మని అడుగుతున్నాం కదా అని మస్క్ కాస్త ఎక్కువగానే డిమాండ్లు పెట్టారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వాహనాలకు దాదాపు వందశాతం పన్ను విధిస్తోంది కేంద్రం. మస్క్ మాత్రం తమకు ఇందులో మినహాయింపు ఇవ్వాలని కోరారు. అమ్మకాలు బాగుంటే అప్పుడు దేశంలో ప్లాంట్ పెట్టే విషయం ఆలోచిస్తామన్నారు. కానీ కేంద్రం దానికి ఒప్పుకోలేదు. మీకో రూల్ మిగిలిన వారికి ఓ రూల్ పెట్టలేమని స్పష్టం చేసింది. ప్లాంట్ పెట్టండి మంచి రాయితీలు ఇస్తామని చెప్పింది. మస్క్ దీనికి ఒప్పుకోలేదు. దీంతో టెస్లా భారత్ ఎంట్రీ ఆగిపోయింది. భారత్‌లో వ్యాపారం చేయడం కష్టం అంటూ మస్క్ అప్పట్లో నోరు పారేసుకున్నారు కూడా. కానీ ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారాయి. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో మస్క్ మోడీని కలిశారు. అంతకుముందే టెస్లాకు చెందిన ప్రతినిధులు భారత్‌కు వచ్చి నీతిఆయోగ్, పరిశ్రమల శాఖ ప్రతినిధులతో మాట్లాడి వెళ్లారు. మీటింగ్‌లో మోడీ మస్క్‌కు ఏం చెప్పారో, ఏం హామీ ఇచ్చారో కానీ మస్క్ మళ్లీ భారత్‌పై ఫోకస్ పెంచారు. కొంతకాలంగా కేంద్రంతో ప్లాంటు ఏర్పాటుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. టెస్లా నుంచి ప్రాథమిక ప్రతిపాదన అందిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరికొన్ని రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. త్వరలో ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై కూడా క్లారిటీ రావొచ్చు.
భారత్ చాలా పెద్ద మార్కెట్. 140కోట్ల జనాభా ఉన్న మార్కెట్. ఇంత పెద్ద దేశాన్ని ఏ వ్యాపార సంస్థా వదులుకోలేదు. పైగా మన దేశంలో ఇప్పుడిప్పుడే విద్యుత్ వాహనాల కొనుగోలుపై మక్కువ పెరుగుతోంది. ఆ మార్కెట్‌ను ఎలాగైనా అందిపుచ్చుకోవాలన్నది మస్క్ బిజినెస్ ప్లాన్. పైగా ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో మానవ వనరులు ఎక్కువ. అదే సమయంలో జీతాలు తక్కువ. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మస్క్ మన దగ్గర ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇటు టెస్లా రాకతో కొన్నివేల మందికి ఉపాధి లభిస్తుంది. మొత్తంగా ఇది ఇరువర్గాలకు ప్రయోజనకరమే.
అయితే మస్క్‌ను నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. చివరి దాకా వచ్చాక వెనక్కు తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనలూ ఉన్నాయి. అయితే మన దగ్గరున్న పెద్ద మార్కెట్టే మనకు అండ. కాబట్టి టెస్లా భారత్‌లో అడుగు పెట్టడం ఖాయంగా అనిపిస్తోంది. అదే జరిగితే వచ్చే రెండేళ్లలో మేడిన్ ఇండియా టెస్లా మన రోడ్లపై పరుగులు తీస్తుంది.