Chip War: అగ్రదేశాల మధ్య చిప్ వార్ భారత్‌కు కీడు చేస్తుందా ?

ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధం ఎక్కడ జరుగుతుంది ? అంతర్జాతీయ పరిణామాలు ఫాలో ఎవరైనా ఈ ప్రశ్నకు వెంటనే చెప్పే సమాధానం ఉక్రెయన్-రష్యా అని. నిజమే యుద్ధ క్షేత్రంలో ఈ రెండు దేశాలు నేరుగా దిగి తలపడుతున్నాయి. నెలల తరబడి సాగుతున్న ఈ యుద్ధంలో ఏ దేశం పైచేయి సాధించింది అన్న ప్రశ్నకు సమాధానం లేకపోయినా వార్ వన్‌సైడ్‌గా మాత్రం జరగడం లేదు. అయితే రెండు దేశాలు ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తున్నా అసలు యుద్ధరంగంలోకి దిగకుండానే అగ్రరాజ్యాలు మరో పరోక్షయుద్ధానికి దిగాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 7, 2023 | 11:50 AMLast Updated on: Jul 07, 2023 | 11:50 AM

The Ongoing Chip War Between China And America Will Hurt India Commercially

సైనికులు చనిపోవడం, యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించడం వంటివి ఈ యుద్ధంలో కనిపించవు. ఎక్కడా రక్తపాతం ఉండదు. కానీ దేశాల ఆర్థిక వ్యవస్థలు మాత్రం షేక్ అయిపోతాయి. ప్రపంచ టెక్నాలజీ రంగం మనుగడుకు కీలకంగా మారిన సెమీకండక్టర్ ఇండస్ట్రీ అగ్రరాజ్యాల మధ్య యుద్ధాన్ని సృష్టిస్తోంది. అమెరికా వర్సెస్ చైనా వర్సెస్ యూరోప్ మధ్య చిప్ వార్ తారా స్థాయికి చేరుకుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీపై తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు అమెరికా అనుసరిస్తున్న విధానాలు భారత్ దేశాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.

అసలేంటి ఈ చిప్ వార్ ?

పెట్రోల్ , డీజిల్ కాదు ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది చిప్స్ మాత్రమే. ఒకరకంగా ఆధునిక మానవుడి అవసరాలన్నీ ఈ చిప్స్ చుట్టూనే తిరుగుతున్నాయి. అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న స్మార్ట్ ఫోన్ల నుంచి రక్షణ రంగంలో ఉపయోగించి అత్యాధునిక పరికరాల వరకు దేనికైనా చిప్స్ ప్రాణం. వీటినే సెమీ కండెక్టర్స్ అని కూడా అంటారు. అయితే వీటిని అన్ని దేశాలు ఉత్పత్తి చేయలేవు. చిప్స్ తయారీ రంగంలో అన్ని దేశాలు లేవు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి కావాల్సిన ఖనిజాలు అందుబాటులోనే ఉంటేనే.. చిప్స్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు దేశాలు మాత్రమే సెమీ కండక్టర్ల తయారీలో దూసుకుపోతున్నాయి. తైవాన్, దక్షిణకొరియా, జపాన్, అమెరికా, చైనా ఈ ఐదు దేశాలు మాత్రమే సెమీకండెక్టర్ మానిఫాక్చరింగ్‌లో కీరోల్ ప్లే చేస్తున్నాయి. అయితే వీటిలో కూడా ఇప్పటికీ మొదటి స్థానం తైవాన్‌దే. మిగతా దేశాలు చిప్ తయారీకి కావల్సిన సాంకేతిక పరిజ్ఞానం, ఖనిజాల కోసం అవి లభించే దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇదే అమెరికా చైనా మధ్య చిప్ వార్‌కు దారితీసింది. చైనా, తైవాన్ లాంటి దేశాలు పోటికి రావడంతో కొన్ని దశాబ్దాల క్రితం ప్రపంచ సెమీకండెక్టర్ ఉత్పత్తిలో 37 శాతం ఉన్న అమెరికా వాటా.. ఇప్పుడు 12 శాతానికి పడిపోయింది. కోవిడ్ మహమ్మారి అమెరికా సెమీ కండెక్టర్ ఇండస్ట్రీకి శాపంగా మారింది. సప్లై చెయిన్‌ దెబ్బతినడంతో అమెరికా ఇబ్బంది పడింది. అదే సమయంలో చైనా విజృంభించడం మొదలుపెట్టింది. చివరకు ఇది సెమీ కండెక్టర్ వార్‌గా మారిపోయింది.

ఆంక్షలతో మొదలైన అసలు యుద్దం

సూపర్ పవర్‌గా నిలిచే క్రమంలో ఎప్పటి నుంచో వాణిజ్య యుద్ధాన్ని కొనసాగిస్తున్న అమెరికా, చైనా సెమీ కండెక్టర్ల తయారీ విషయంలోనూ ఎవరి ప్రయోజనాలను వాళ్లు కాపాడుకునేందుకు వ్యూహప్రతివ్యూహాలు అమలు చేయడం మొదలు పెట్టారు. చిప్ మానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు అమెరికా 2022 అక్టోబర్ లో కీలక మైన టెక్నాలజీ టూల్స్ ను చైనాకు ఎగుమతి చేయడం నిలిపివేసింది. చిప్స్, సెమీ కండక్టర్ల తయారీకి అవసరమైన సాంకేతికతకు చైనాకు చేరకుండా అడ్డుకుంది. ఇది చైనా ఆగ్రహానికి కారణమైంది. దీంతో అగ్రరాజ్యాన్ని అదును చూసి దెబ్బకొట్టేందుకు కొంతకాలం పాటు ఎదురుచూసిన చైనా..తాజాగా అమెరికాకు షాక్ ఇచ్చేలా ఓ నిర్ణయం తీసుకుంది. సెమీ కండక్టర్ల తయారీలో కీలక పాత్ర పోషించే రెండు మూలకాలను విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.

America And China Chip War

America And China Chip War

ఆ రెండు మూలకాలు ఏంటి ? చైనా ఏం చేసింది ?

జాతీయ భద్రత పరిరక్షణలో భాగంగా ఈ నెల 3 నుంచి గాలియం, జర్మేనియం అనే రెండు మెటల్స్ ఎగుమతిపై ఆంక్షలు విధిస్తున్నట్టు చైనా ప్రకటించింది. ఈ రెండు మూలకాలను ఇకపై చైనా సరిహద్దులు దాటించాలంటే ఎగుమతిదారులకు కచ్చితంగా లైసెన్స్ ఉండాలి. ఏదేశంలో ఎవరికి అమ్ముతున్నారనే విషయాలను కూడా ముందే చెప్పాలి. ఇక్కడే చైనా తెలివిగా వ్యవహరించింది. ఈ రెండు మూలకాలను అమెరికా చిప్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు చేరకుండా చేసేందుకు ఈ రూల్ తీసుకొచ్చింది. ఇవి అందుబాటులో లేకపోతే సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ చాప చుట్టేయాల్సిందే.

చిప్స్ తయారీలో ఆ రెండు మూలకాలే ఎందుకు కీలకం ?

గాలియం, జర్మేనియం… సెమీ కండక్టర్ ఇండస్ట్రీని నడిపే చోదక శక్తులు ఈ రెండు మాత్రమే. చిప్ ల తయారీకి కావాల్సిన టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నా.. ఈ రెండు మెటల్స్ లేకపోతే… సెమీ కండక్టర్ల ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభాన్ని చూస్తాయి. సెమీ కండక్టర్లు ఏ దేశంలో తయారైనా ఈ రెండు మూలకాల కోసం మాత్రం ఆయా దేశాలు చైనా మీద ఆధారపడాల్సిందే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 80 శాతం గాలియాన్ని చైనానే ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా 60 శాతం జర్మేనియం కూడా చైనా నుంచే వస్తుంది. ఈ రెండు మూలకాలు సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించవు. ఇతర మూలకాలను అన్వేషించే క్రమంలో ఈ రెండు బై ప్రొడక్ట్స్ గా బయటపడతాయి. అల్యూమినియం, జింక్ బై ప్రొడక్ట్స్ గా గాలియం, జర్మేనియం ఉన్నాయి. ఈ రెండింటినీ ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యాలు అమెరికా సహా అనేక దేశాలకు లేకపోవడంతో చైనా గేమ్ ప్లాన్ ను అమలు చేస్తోంది.

చిప్ వార్‌ను భారత్ ఎలా ఎదుర్కొంటోంది ?

రెండు అగ్రదేశాల మధ్య జరుగుతున్న సెమీ కండక్టర్ల యుద్ధాన్ని భారత్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా… సహజ వనరుల కొరత భారత్ కు శాపంగా మారింది. చైనా తర్వాత మానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారే అన్ని అవకాశాలు భారత్ కు ఉన్నాయి. చైనా విధానాలు నచ్చక యాపిల్, టెస్లా వంటి సంస్థలు కూడా మన దేశం వైపే చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో సెమీ కండక్టర్ల తయారీ పైనా భారత్ ఫోకస్ పెట్టింది. అయితే చైనా విధిస్తున్న ఆంక్షల ప్రభావం మన దేశం ఆ దిశగా వేస్తున్న అడుగులకు గండికొడుతోంది. గాలియం, జర్మేనియం మూలకాలను ఉత్పత్తి చేసే శక్తి సామర్థ్యాలు భారత్ కు సహజంగానే లేవు. హిండోల్కా, నాల్కో రిఫైనరీల్లో గతంలో అలుమినియాని రిపైన్ చేయడం ద్వారా కొద్దో గొప్పో గాలియంను ఉత్పత్తి చేసే వాళ్లు. కానీ అది భారత్ అవసరాలను తీర్చే స్థాయిలో ఉండేది కాదు. ఇక జర్మేనియం కావాలంటే పూర్తిగా విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి.

చైనా ఆంక్షలు భారత్ ను ఎలా ప్రభావితం చేస్తున్నాయి ?

అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఆ రెండు మూలకాలపైనా చైనా విధించిన ఆంక్షలు ప్రత్యక్షంగా , పరోక్షంగా మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు, ఎల్ ఈ డీ పరికరాలు, థర్మో, బార్మో మెట్రిక్ మీటర్లు ఇలా అనేక రకాల ఎలక్ట్రానిక్ డివైజ్ లను తయారు చేయాలంటే గాలియం అవసరం ఎంతో ఉంది. ఆప్టికల్ ఫైబర్ నుంచి సోలార్ సెల్స్ వరకు ఎలాంటి వస్తువులు తయారు చేయాలన్నా జర్మేనియం అవసరం. ఈ రెండు అందుబాటులో లేకపోవడం వల్ల ఆయా వస్తువులు, పరికరాల తయారీ రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయి. గాలియం, జర్మేనియంతో పాటు మొత్తం 28 మూలకాలను భారత ప్రభుత్వం క్రిటికల్ మెటల్స్ జాబితాలో చేర్చింది. వీటి కొరత భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపించబోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం రకరకాల మార్గాలను అన్వేషిస్తుంది.