JioCinema: డిస్నీకి ఐపీఎల్, హెచ్‌బీవో దెబ్బ.. దూసుకెళ్తున్న జియో సినిమా..!
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కోల్పోతోంది. మరోవైపు ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకున్న జియో సినిమా సబ్‌స్క్రైబర్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో ఓటీటీ పరంగా కొత్త పోటీ మొదలవ్వబోతుంది. ఇప్పటివరకు పెద్దగా పోటీలో లేని జియో సినిమా ఇకపై గట్టి ప్రణాళికతో అడుగులేయబోతుంది.
JioCinema: ఐపీఎల్ ప్రసార హక్కుల్ని వదిలేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దాని ఫలితం అనుభవిస్తోంది. మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కోల్పోతోంది. మరోవైపు ఐపీఎల్ ప్రసార హక్కులు దక్కించుకున్న జియో సినిమా సబ్‌స్క్రైబర్ల పరంగా దూసుకెళ్తోంది. దీంతో ఓటీటీ పరంగా కొత్త పోటీ మొదలవ్వబోతుంది. ఇప్పటివరకు పెద్దగా పోటీలో లేని జియో సినిమా ఇకపై గట్టి ప్రణాళికతో అడుగులేయబోతుంది. ఈ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొత్త దారిలో పయనించబోతుంది.
గత ఏడాది వరకు ఐపీఎల్ చూడాలంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఉండాల్సిందే. అది కూడా కొన్ని ప్యాకేజీలు తీసుకుంటే ఒక్క డివైజ్‌పై మాత్రమే ఐపీఎల్ చూడొచ్చు. దీంతో చాలా మంది తప్పనిసరిగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. ఇది ఆ సంస్థకు మంచి ఆదాయం తెచ్చిపెట్టింది. పైగా హెచ్‌బీవో సంస్థతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఒప్పందం కుదుర్చుకోవడం కూడా ఆ సంస్థకు కలిసొచ్చింది. హెచ్‌బీవోలో ఉన్న హాలీవుడ్ కంటెంట్ యూజర్లను బాగా ఆకట్టుకుంది. అయితే, ఇప్పుడు హాట్‌స్టార్ ఐపీఎల్ ప్రసార హక్కుల్ని కోల్పోయింది. అలాగే హెచ్‌బీవో సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో చాలా కంటెంట్ ఆ సంస్థ నుంచి డిలీట్ అయింది. ఈ నేపథ్యంలో యూజర్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌పై ఆసక్తి చూపడం లేదు. మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లను సంస్థ కోల్పోయింది. ఇటీవలి కాలంలో దాదాపు ఎనిమిది మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఆదాయం కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతానికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థకు 52.9 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
జియోకు కలిసొచ్చిన ఐపీఎల్
మొన్నటివరకు జియో సినిమాకు పెద్దగా ఆదరణ లేదు. ఈ ఓటీటీని పట్టించుకున్న వాళ్లు లేరు. అయితే, ఇప్పుడు జియో సినిమా దూసుకెళ్తోంది. తాజా ఐపీఎల్ ప్రసార హక్కులతో ఈ సంస్థకు సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ సంస్థకు ఇటీవల 10 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు అదనంగా చేరారు. ఉచితంగా ఐపీఎల్ ప్రసార హక్కులు కల్పించడం దీనికి కలిసొచ్చింది. అయితే, ఉచిత ప్రసారాలు ఐపీఎల్ వరకే ఉంటాయి. ఆ తర్వాత పూర్తి పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయి. దీనిక తగ్గట్లే ప్రణాళికతో జియో సినిమా ముందుకెళ్తోంది. త్వరలో భారీగా సినిమా ప్రసార హక్కుల్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే విక్రమ్ వేద వంటి సినిమాను ఉచితంగా ప్రసారం చేస్తోంది. త్వరలో బేడియా వంటి సినిమాలు కూడా రానున్నాయి. రాబోయే రోజుల్లో బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రసారం చేయాలని చూస్తోంది. జియోకు కలిసి రానున్న మరో అంశం.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుంచి దూరమైన హెచ్‌బీవో కంటెంట్ జియోలోకి వస్తుండటమే. ఈ మేరకు రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ ఒప్పందం అమలయ్యే అవకాశం ఉంది. దీంతో కంటెంట్ పరంగా జియో సినిమా ఇతర ఓటీటీలకు గట్టి పోటీ ఇవ్వబోతుంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో హులు
మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కోల్పోతున్న నేపథ్యంలో మరింత మందిని ఆకట్టుకునే లక్ష్యంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా మరో ఓటీటీ సంస్థ హులుతో జతకట్టబోతుంది. రెండు సంస్థలు కలిసి త్వరలో కొత్తగా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. హులులో హాలీవుడ్ కంటెంట్ ఉంటుంది. దీంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియన్ కంటెంట్.. హులులో హాలీవుడ్ కంటెంట్ కలిపి యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. మరోవైపు నెట్‌ఫ్లిక్స్ సంస్థకు పన్ను విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇదే జరిగితే నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీగా ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది.