Indigo: ఒకరి సంక్షోభం.. మరొకరికి అవకాశం.! ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీని ఏలుతున్న ఇండిగో
అవకాశాలు వచ్చినప్పుడే వాటిని అందిపుచ్చుకోవాలి. మార్కెట్‌లో రారాజుగా మారాలంటే ప్రత్యర్థి సంస్థలను దెబ్బతీయాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థులు ఎదుర్కొంటున్న సంక్షోభాలను మనం అవకాశంగా మార్చుకుంటే సరిపోతుంది. అవతలివాళ్లు ఎదుర్కొంటున్న సంక్షోభాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగితే ఎలాంటి రంగంలోనైనా నెంబర్‌వన్ స్థానానికి ఎదిగిపోవచ్చు.
భారతీయ విమానయాన రంగంలో ఇండిగో సంస్థ ఇప్పుడు ఇదే చేసి చూపిస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థగా ఉన్న ఇండిగో..గో ఫస్ట్ సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని తన ఎదుగుదలకు వాడుకుంది. భారతీయ విమానయాన రంగంలో తన వాటాను అమాంతం పెంచేసుకుంది. మిగతా ఎయిర్‌లైన్స్ తో పోల్చితే 61.4 శాతానికి పెరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన డాటా ప్రకారం.. ఇప్పుడు దేశంలో ఇండిగో నెంబర్‌వన్ ఎయిర్‌లైన్ సంస్థగా మారింది.
గో ఫస్ట్ సంక్షోభం ఇండిగోకు కలిసొచ్చింది.
అల్ట్రా లో కాస్ట్ ఎయిర్‌లైన్స్ గా మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకున్న వాడియా గ్రూప్‌కు చెందిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ గత నెలలో దివాళా తీసింది. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం, విమానాల ఇంజన్ల విషయంలో సప్లై దారులతో సమస్యలు తలెత్తడంతో గో ఫస్ట్ విమానాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. 2005లో ప్రారంభమైన గోఫస్ట్ ప్రయాణం.. ఈ ఏడాది మే 3తో ముగిసిపోయింది. మళ్లీ గో ఫస్ట్ విమానాలు ఎగురుతాయో లేదో ఇప్పుడే చెప్పే పరిస్థితులు లేవు. కోవిడ్ సంక్షోభం తర్వాత ఏవియేషన్ మార్కెట్ మళ్లీ పుంజుకుని విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న సమయంలో గోఫస్ట్ జెండా పీకేడం అప్పటికే మార్కెట్‌ను ఏలుతున్న ఇండిగోకు కలిసివచ్చింది. అప్పటి వరకు గోఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు అలవాటు పడ్డ దేశీయ ప్రయాణికులంతా ఇతర విమానయాన సంస్థ వైపు మళ్లారు. వారిలో ఎక్కువ మంది ఇండిగోకే జై కొట్టారు. DGCA విడుదల చేసిన లెక్కల ప్రకారం ఈ ఏడాది మేలో కోటి 32 లక్షల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణిస్తే వారిలో 81 లక్షల పదివేల మంది ఇండిగోలోనే ట్రావెల్ చేశారు. గతేడాదితో పోల్చితే మేలో విమాన ప్రయాణికుల సంఖ్య 15.2 శాతం పెరిగితే అందులో ఎక్కువ వాటాను ఇండిగో ఎయిర్‌లైన్స సొంతం చేసుకుంది.
ఎయిర్‌ఇండియా ఆ పని ఎందుకు చేయలేకపోయింది ?
గోఫస్ట్ సంక్షోభం కారణంగా దేశీయంగా ఉన్న ఇతర విమానయాన సంస్థలకు కూడా మార్కెట్ షేర్‌ను పెంచుకునే అవకాశం దొరికినా… ఇండిగో స్థాయిలో దానిని ఎవరూ ఉపయోగించుకోలేదనే చెప్పాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ కారియర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియాను కైవసం చేసుకున్న తర్వాత కూడా టాటాగ్రూప్ ఎయిర్‌లైన్స్ చెప్పుకోదగ్గ అద్భుతాలేవీ సృష్టించలేకపోయాయి. టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ పరిధిలో ప్రస్తుతం మూడు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ ఏసియా ఇండియా. ఉమ్మడిగా ఈ మూడు సంస్థల మార్కెట్ విలువ 26.30 శాతం మాత్రమే. ఇండిగోతో పోల్చితే ఇది సగానికి సగం మాత్రమే. టాటా గ్రూప్‌లోకి వెళ్లిన తర్వాత కూడా ఎయిర్ ఇండియా పూర్తి స్థాయిలో సంస్కరణలను అమలు చేయలేదు. యాజమాన్యం మారినా ఎయిర్ ఇండియా తీరు ఇంకా మారలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎయిర్ ఇండియా మాతృ సంస్థ టాటాల చేతికి వచ్చాక దానిపై విమానయానరంగంలో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అతి తక్కువ కాలంలోనే ఎయిర్‌ఇండియా దేశీయంగా మార్కెట్ షేర్‌లో నెంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుంటుందని అందరూ భావించారు.
ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా సంస్థ కూడా ఎయిర్ ఇండియాకు మెరుగులు దిద్దేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే భారీగా విమానాల కొనుగోలు ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి 470 విమానాలు కొనేందుకు ఆర్డర్లు కూడా ఇచ్చింది. వీటి విలువ దాదాపు 80 బిలియన్ డాలర్లు. ఎయిర్ ఇండియా విమానాలను ఎప్పుడూ అనేక సాంకేతిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. సర్వీసుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. దీంతో ప్రత్యామ్నాయ సర్వీసు ప్రొవైడర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఆ అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకుంది. గో ఫస్ట్ దివాళా తీసి సర్వీసులు రద్దు చేయడంతో వెంటనే ఇండిగో అలర్ట్ అయ్యింది. సర్వీసులను పెంచింది. గో ఫస్ట్ సర్వీసులు నడిచే రూట్లలో కూడా తమ సర్వీసులను నడిపేందుకు ప్రయత్నించింది. కొత్త విమానాల కొనుగోలు వంటి ఆలోచన చేసింది. గో ఫస్ట్ దివాళా తీయడానికి దారితీసిన పరిస్థితులు తమ సంస్థలో రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. దీంతో ఆటోమెటిక్‌గా ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది.
ఇక ఇండిగో వర్సెస్ టాటా ఎయిర్‌లైన్స్
భవిష్యత్తులో దేశీయ విమానయానరంగంలో ప్రధాన పోటీ మొత్తం ఇండిగో ఎయిర్‌లైన్స్ , టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ మధ్యే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకాశా, స్పైస్ జెట్ మార్కెట్ షేర్ ఈ ఇండిగో, టాటా గ్రూప్‌తో పోల్చితే చాలా చాలా తక్కువ. ఇటీవలే తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆకాశ్ ఎయిర్ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. ఇక స్పైస్ జెట్ ప్రయాణం అంత సాఫీగా సాగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టాటా ఎయిర్‌లైన్స్ నుంచి గట్టి పోటీ రాని పక్షంలో ఇండిగో మార్కెట్ షేర్‌ను పెంచుకుంటూ ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీలో కింగ్‌గా మారే అవకాశాలు లేకపోలేదు.