Apple Store: ముంబైలో తొలి యాపిల్ స్టోర్ ప్రారంభించిన సీఈవో టిమ్ కుక్.. స్టోర్ ప్రత్యేకతలివే!

దేశంలో తొలి యాపిల్ స్టోర్‌ను మంగళవారం ముంబైలో ప్రారంభించింది. యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ ఆఫీసును ప్రారంభించారు. యాపిల్ ఫ్యాన్స్, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ స్టోర్ దగ్గర క్యూ కట్టారు. పైగా టిమ్ కుక్ కూడా వస్తుండటంతో స్టోర్ ప్రారంభ ఈవెంట్‌కు మంచి ఆదరణ కనిపించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2023 | 04:04 PMLast Updated on: Apr 18, 2023 | 4:04 PM

Tim Cook Opens Indias First Apple Store In Mumbai

Apple Store: ఇండియాకు సంబంధించి యాపిల్ సంస్థ మరో ముందడుగు వేసింది. దేశంలో తొలి యాపిల్ స్టోర్‌ను మంగళవారం ముంబైలో ప్రారంభించింది. యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ ఆఫీసును ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఇండియాలో పర్యటిస్తున్నారు. అంతకుముందు సోమవారం సాయంత్రం జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్‌తోపాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు పాల్గొన్నారు. వారందరితో టిమ్ కుక్ సెల్ఫీలు దిగారు. ఏఆర్ రెహ్మాన్, మాధురీ దీక్షిత్, రకుల్ ప్రీత్ సింగ్, బోనీ కపూర్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, హీరోయిన్లు షిర్లీ శెటియా, నేహా ధూపియా, సింగర్ ఆర్మాన్ మాలిక్ వంటి సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరై సందడి చేశారు.
ముంబైలో తొలి స్టోర్
యాపిల్ సంస్థ ముంబైలో ప్రారంభించింది తొలి అధికారిక స్టోర్ కావడంతో దీనికి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. యాపిల్ ఫ్యాన్స్, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ స్టోర్ దగ్గర క్యూ కట్టారు. పైగా టిమ్ కుక్ కూడా వస్తుండటంతో స్టోర్ ప్రారంభ ఈవెంట్‌కు మంచి ఆదరణ కనిపించింది. ముంబైలోని ఖరీదైన బాంద్రా కుర్లా ప్రాంతంలో ఏర్పాటైన ఈ స్టోర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ స్టోర్‌ను టిమ్ కుక్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాపిల్ సిబ్బంది సందడి ఎక్కువగా కనిపించింది. టిమ్ మాత్రం హడావుడి లేకుండా, చాలా సాదాసీదాగా స్టోర్ ప్రారంభించాడు. కానీ, స్టోర్ బయట మాత్రం అభిమానులతో భారీ క్యూ కనిపించింది. మీడియా ప్రతినిధులు కూడా భారీగా హాజరయ్యారు. ఈ రోజు నుంచే ఇక్కడ యాపిల్ ఉత్పత్తుల విక్రయం, సేవలు వంటివి అన్నీ అందుబాటులోకి వస్తాయి. టిమ్ కుక్ కస్టమర్లకు వెల్కం చెబుతూ వారిని లోపలికి ఆహ్వానించారు. ఉత్సాహకర వాతావరణంలో ఈవెంట్ జరిగింది. యాపిల్ కంపెనీ ఇండియాలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఈవెంట్ జరిగింది.
భారీ స్టోర్.. నెలకు అద్దె రూ.42 లక్షలు
ముంబైలో ప్రారంభమైన యాపిల్ స్టోర్ చాలా విశాలమైంది. 28,000 చదరపు అడుగుల స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రైమ్ లొకేషన్‌లో ఏర్పాటైన దీన్ని 133 నెలలకు అద్దెకు తీసుకున్నారు. దీని అద్దె రూ.42 లక్షలు. అంతేకాకుండా అక్కడ జరిగే వ్యాపారంలో రెండు శాతం వాటా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి మూడేళ్లకు 15 శాతం అద్దె పెంచుతారు. ఈ స్టోర్‌ను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇది ఎకో ఫ్రెండ్లీ స్టోర్. కర్బన ఉద్గారాలు విడుదల కాకుండా, పునరుత్పాదక శక్తిని వాడుకుని ఇది పని చేస్తుంది. సొంత సోలార్ వ్యవస్థను దీని కోసం ఏర్పాటు చేసుకుంది యాపిల్. కలపతో తయారైన వెయ్యి టైల్స్‌ను దీని నిర్మాణానికి వాడారు. స్టోన్ వాల్స్‌ను రాజస్థాన్ నుంచి తెప్పించారు. స్టోర్ లోపల హై సీలింగ్స్, డెస్కులు, పిల్లర్స్ వంటివి వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ స్టోర్ లోపల వంద మందికిపైగా సిబ్బంది ఉంటారు. వీరిలో మొత్తం 20 భాషలు మాట్లాడే వాళ్లున్నారు. అందువల్ల ఏ భాష మాట్లాడే వాళ్లు స్టోర్‌కు వచ్చినప్పటికీ, భాషా సమస్య రాకుండా ఏర్పాట్లు చేశారు.

Apple Store
ఢిల్లీలో మరో స్టోర్ ప్రారంభం
యాపిల్ తన రెండో స్టోర్‌ను న్యూ ఢిల్లీలో ప్రారంభించనుంది. ఏప్రిల్ 20, గురువారం ఉదయం పది గంటలకు ఈ స్టోర్‌ను టిమ్ కుక్ ప్రారంభిస్తారు. సాకేత్ ఏరియాలో ఉన్న సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఈ స్టోర్ ఏర్పాటైంది. దీన్ని రూ.150 కోట్లతో తీర్చిదిద్దారు. దీని అద్దె కూడా దాదాపు రూ.42 లక్షలు ఉంటుంది. అయితే, ముంబై స్టోర్‌తో పోలిస్తే ఇది చాలా చిన్నది. కానీ, ఢిల్లీలో అద్దెలు ఎక్కువ. అందువల్లే ముంబై స్టోర్ కంటే చిన్నదే అయినప్పటికీ, దానితో సమానంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఈ స్టోర్ విస్తీర్ణం 10,000 చదపు అడుగులు మాత్రమే.
మోదీతో భేటీ కానున్న టిమ్ కుక్
ఇండియాలో పర్యటిస్తున్న టిమ్ కుక్ ఇక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. గురువారం ఢిల్లీలో స్టోర్ ఓపెనింగ్‌కు వెళ్లనున్న టిమ్ కుక్ భారత ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు టిమ్ ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం వేచి చూస్తున్నారు. ప్రధాని అనుమతి లభిస్తే ఇరువురూ భేటీ అయ్యే అవకాశం ఉంది. సోమవారం ఇండియా చేరుకున్న టిమ్ కుక్.. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆయన ఇంటికి వెళ్లి టిమ్ కలిశారని సమాచారం. అలాగే బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌తో కలిసి ముంబై స్పెషల్ వడ పావ్ తిన్నారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్‌.చంద్రశేఖరన్‌తోపాటు మరికొందరు వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులను టిమ్ కలిసినట్లు తెలుస్తోంది.
ప్రత్యేకంగా నిలిచిన వింటేజ్ కంప్యూటర్
యాపిల్ స్టోర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రత్యేకంగా నిలిచింది వింటేజ్ యాపిల్ కంప్యూటర్. 1984నాటి మ్యాకింటోష్ యాపిల్ కంప్యూటర్‌ను ఒక అభిమాని స్టోర్‌కు తీసుకొచ్చాడు. దీన్ని చూసి టిమ్ షాకయ్యాడు. ఇది యాపిల్ అభిమానుల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫొటోల్లో మాత్రమే చూసిన దీన్ని రియల్‌గా చూసినందుకు ఫ్యాన్స్ థ్రిల్‌గా ఫీల్ అవుతున్నారు.