Stock Market: స్టాక్‌మార్కెట్లలో ట్రేడింగ్‌కు ఎప్పుడు బ్రేక్ ఇవ్వాలి.?
స్టాక్‌మార్కెట్లలో ట్రేడింగ్ ఎలా చేయాలో, ఎలా కొనాలో, ఎలా అమ్మాలో రెగ్యులర్‌గా ట్రేడ్ చేసే అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు ట్రేడింగ్ ఆపాలో ఎంతమందికి తెలుసు.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.. ట్రేడింగ్‌కు ఎక్కడ బ్రేక్ ఇవ్వాలో తెలుసుకుంటేనే నష్టాలకు బ్రేక్ వేయగలం. లేకపోతే మార్కెట్లలో మునిగిపోవడమే.
స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారంతా ఓసారి ఇది తప్పక చదవండి. ఇది కచ్చితంగా మీకు పనికివచ్చేదే. తలపండిపోయిన వారు కూడా ఈ సూత్రాలను ఫాలో అవుతారు. మార్కెట్లకు ఎప్పుడు దూరంగా ఉండాలో తెలుసుకొని తీరాల్సిందే. లేకపోతే నష్టాల పాలు కాక తప్పదు.
పెట్టుబడి ఆవిరైనప్పుడు
స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడుల కోసం ట్రేడింగ్ కోసం ప్రత్యేకంగా ఇంత మొత్తం అని కేటాయించాలి. అది మీ పొదుపు సొమ్ము కాకుండా ఉంటే మంచిది. ట్రేడింగ్ కోసం ఉద్దేశించిన మొత్తం నష్టపోతే అప్పుడు తప్పనిసరిగా ఓ బ్రేక్ ఇవ్వాలి. వేరే దగ్గర నిధులు తెచ్చి పెట్టే కంటే కొంత బ్రేక్ ఇస్తే మంచిది. అప్పుడే ఆలోచించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఎక్కడో చోట తెచ్చి పెట్టేద్దాం మళ్లీ లాభాలు రాకపోతాయా అని ఆశకు పోతే మొత్తానికే మోసం రావచ్చు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో పెట్టుబడులు పెట్టేవారిలో ఇది ఎక్కువ కనిపిస్తుంది. ఒక్క ట్రేడ్‌తో మొత్తమంతా సంపాదించొచ్చన్న తెగువకు పోతారు. అదృష్టం బాగుండి వస్తే పర్లేదు. కానీ ఎలాగైనా సంపాదించాలన్న తహతహతో అడ్డగోలుగా ముందుకు వెళితే నష్టమే. అప్పటికే పెట్టుబడులు నష్టపోయిన వారు అలాంటి సాహసానికి వెళ్లకపోవడం మంచిది. కాస్త బ్రేక్ ఇచ్చి ఎక్కడ తేడా వచ్చిందో నిజాయితీగా ఆలోచించుకోవాలి.
సమయం లేనప్పుడు
మార్కెట్లలో ట్రేడింగ్ చేసేటప్పుడు ఎప్పటికప్పుడు దానిపై దృష్టిపెట్టాలి. ఈక్విటీ మార్కెట్లలో దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టినప్పుడు రోజూ దాన్ని చూడాల్సిన పనిలేదు. కానీ అప్పుడప్పుడు మాత్రం పోర్ట్‌ఫోలియోను పరిశీలించుకోవాలి. కానీ రోజువారీ ట్రేడ్ చేసేటప్పుడు మాత్రం దానికి తగినంత సమయం కేటాయించాలి. అలా సమయం లేనప్పుడు ఆ రోజు ట్రేడ్ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. అలాకాకుండా ట్రేడ్ చేసి మర్చిపోతే అది భారీ నష్టాలు తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదు. మార్కెట్ల గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందుకెళ్లాలి.
ట్రేడింగ్‌కు సరైన వ్యూహం లేనప్పుడు
సరైన వ్యూహం లేకుండా మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడమంటే మీ కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేయడమే. అసలు ట్రేడింగ్ బ్లూ ప్రింట్ లేకుండా మార్కెట్లలోకి అడుగు పెట్టడమే తప్పు. ఎవరో చెప్పారనో, ఎక్కడో చదివామనో మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం పెద్ద తప్పు. రీసెర్చ్ లేకుండా దిగడమంటే లోతు తెలియకుండా ఏట్లో దిగడమే. అలాగే టార్గెట్, స్టాప్‌లాస్, ఎంత టైమ్ అన్నదానిపై స్పష్టత ఉండాలి. ట్రేడ్‌లోకి ఎంటరయ్యే ముందే వీటిపై క్లారిటీ ఉండాలి. వీటిలో దేనిపై స్పష్టత లేకపోయినా ట్రేడ్ ఆపేయడం ఉత్తమం.
అవకాశం పోతుందన్న భయం
అవకాశాన్ని కోల్పోతామేమోనన్న భయంతో హడావుడి అసలు పడొద్దు. చాలామంది ఓ స్టాక్‌లో ర్యాలీ ముగింపు దశకు చేరుకున్న సమయంలో పెట్టుబడులు పెడతారు. ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ మొదలైందంటే నష్టాలే. అప్పటికే భారీగా పెరిగిన అలాంటి స్టాక్స్‌ను వదిలివేయడమే మంచిది. ప్రతిరోజూ అవకాశాలు లభిస్తుంటాయి. ఒకటి మిస్సైతే మరొకటి దొరకదన్న భయం లేదు. కాబట్టి హడావుడిగా నిర్ణయాలు తీసుకోవద్దు.
మార్కెట్ దిశ తెలియనప్పుడు
ఒక్కోసారి మార్కెట్ల దిశ అర్థం కాదు. మార్కెట్లు పెరుగుతాయో, పడిపోతాయో తెలియనప్పుడు ట్రేడింగ్‌కు బ్రేక్ ఇవ్వడమే మంచిది. అడుగుపెట్టి చేతులు కాల్చుకోవడం కన్నా దూరంగా ఉండటం బెటర్. అలాగే ఒక్కోసారి మార్కెట్లను రకరకాల అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలియనప్పుడు మార్కెట్ల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. అలాంటి సమయంలో మార్కెట్ల గమనాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. వాటి దిశపై స్పష్టత వస్తే ట్రేడ్‌లోకి ఎంటరవ్వాలి. లేకపోతే వదిలేయాలి.
ఒక్కోసారి పెట్టుబడులు పెట్టాలని అనుకుని కూడా భయంతో ఆగిపోతాం. ఆ ట్రేడ్‌లో ఒక్కోసారి భారీ లాభాన్ని మిస్ కావొచ్చు కూడా. కానీ చాలామంది అలా మిస్సైన వాటిని గురించే ఆలోచిస్తారు. మరోసారి పెట్టుబడి పెట్టేటప్పుడు దాని గురించి ఆలోచించి ఓవర్ కాన్ఫిడెన్స్‌తో అడుగులు వేస్తారు. మార్కెట్లలో ఏ రోజు ట్రేడ్ ఆ రోజే అన్నది గుర్తుంచుకోవాలి. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతుంటాయి. రకరకాల అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తుంటాయి. రాత్రి నిద్రపోయి తెల్లారి లేచేసరికి ప్రపంచమార్కెట్లు మన మార్కెట్ల దశను నిర్దేశించేస్తాయి. వాటి గురించి తెలుసుకుని తీరాలి. ఏమీ తెలియకుండా మార్కెట్లలో అసలు అడుగు పెట్టొద్దు… ఎవరో చెప్పారని స్టాక్స్ కొనొద్దు. సరైన అవగాహన లేకుండా పెట్టుబడులు పెడితే ఏమీ మిగలదు. సెకన్లలో పరిస్థితులు మారిపోయే మార్కెట్లు జూదం లాంటివే. కాబట్టి జాగ్రత్త…