ట్రంప్ టారిఫ్‌ దెబ్బ, ఐ ఫోన్ 2 లక్షలు..!

అమెరికన్ బ్రాండ్... యాపిల్‌ అమెరికన్లకు దూరం కానుంది. ప్రైడ్‌గా ఫీలయ్యే ఐఫోన్ కొనాలంటే అమెరికన్లు ఇకపై భారీగా చేతి చమురు వదుల్చుకోవాల్సిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 4, 2025 | 07:20 PMLast Updated on: Apr 04, 2025 | 7:20 PM

Trumps Tariff Blow Iphone 2 Lakhs

అమెరికన్ బ్రాండ్… యాపిల్‌ అమెరికన్లకు దూరం కానుంది. ప్రైడ్‌గా ఫీలయ్యే ఐఫోన్ కొనాలంటే అమెరికన్లు ఇకపై భారీగా చేతి చమురు వదుల్చుకోవాల్సిందే. వాళ్లే కాదు మనకు కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి.. ట్రంప్ టారిఫ్‌ దెబ్బకు ప్రపంచదేశాలే కాదు అమెరికన్ పరిశ్రమలు కూడా బేర్‌మంటున్నాయి… బోరు మంటున్నాయి. టారిఫ్‌లతో ఐఫోన్‌ రేట్లు చుక్కల్లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేట్‌ హైక్ అంటే ఐదు డాలర్లో, పది డాలర్లో కాదు వందల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ భారంలో మొత్తం లేదా కొంత వినియోగదారులపై మోపనుంది యాపిల్. అదే జరిగితే ఐఫోన్‌ రేట్లు భారీగా పెరగనున్నాయి.

అంతొద్దురా నాయనా అని ఎంత మొత్తుకున్నా ట్రంప్‌ ఏ మాత్రం తగ్గలేదు. పలు దేశాలపై టారిఫ్‌లు వేసేసి చంకలు గుద్దుకున్నారు. టారిఫ్‌లు పెంచిన దేశాలు కాళ్లబేరానికి వస్తాయని చెప్పుకున్నారు. ఆ దేశాల సంగతేమో కానీ అమెరికన్ కంపెనీలకు మాత్రం ట్రంప్‌ దెబ్బకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు చాలా కంపెనీలది ఇదే బాధ… ఖర్చులు కలిసి వస్తాయని చైనా, తైవాన్‌ వంటి దేశాల్లో మాన్యు ఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేసుకున్న అమెరికన్ కంపెనీలు ఇప్పుడు కుయ్యోమొర్రో అంటున్నాయి. ముఖ్యంగా ఆపిల్‌, హెచ్‌పీ వంటి సంస్థలు మింగలేక కక్కలేక తంటాలు పడుతున్నాయి. యాపిల్‌నే తీసుకుంటే ట్రంప్‌ టారిఫ్‌ ఎఫెక్ట్‌ దాదాపు 40 బిలియన్ డాలర్లు ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే 3లక్షల 40వేల కోట్ల భారం అన్నమాట. అంత మొత్తాన్ని కంపెనీ భరించలేదు అలాగని మొత్తాన్ని వినియోగదారులకు ట్రాన్స్‌ఫర్‌ చేసి మొత్తానికే ముప్పు తెచ్చుకోదు. దీంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంది.

ఐఫోన్ల రేట్లు అలా ఇలా కాదు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఐఫోన్‌ 16 ఖరీదు 799 డాలర్లుగా ఉంది. అంటే సుమారు 78వేలు కానీ పన్నుల భారంతో ఇది 1142 డాలర్లకు చేరుతుంది. అంటే దాదాపు 97వేల రూపాయలు. అంటే దాదాపు 19వేలు పెరుగుతుంది. అలాగే ఐఫోన్‌ ప్రో మ్యాక్స్‌ ప్రస్తుతం 1599 డాలర్లు ఉంది. ఇది 2వేల 300 డాలర్లకు చేరుతుంది అంటే దాదాపు 2లక్షలు… యాపిల్‌లో ఎంట్రీ లెవల్‌ ఫోన్‌ ఐఫోన్‌16E రేట్ ప్రస్తుతం 599డాలర్లుండగా ఇప్పుడది 856 డాలర్లకు పెంచే అవకాశం ఉంది. అలాగే యాపిల్‌ వాచ్‌లపై 43శాతం, ఐపాడ్‌లపై 42, మాక్‌లపై 39, ఎయిర్‌పాడ్‌లపై 39శాతం పన్ను పడనుంది. అమెరికాలో ఎక్కువమంది వినియోగదారులు కాంట్రాక్ట్‌ బేసిస్‌పై ఫోన్లు తీసుకుంటారు. ఇప్పుడు రేట్లు పెంచితే నెలనెలా భారం పెరుగుతుంది. కనీసం 10-15 శాతం భారాన్ని వినియోగదారులపై మోపినా కూడా అది తలకు మించినదే అవుతుంది.

యాపిల్‌ ఐఫోన్స్ ప్రస్తుతం ఎక్కువగా చైనాలో తయారవుతున్నాయి. తైవాన్‌లో కూడా భారీగానే ప్రొడక్షన్ అవుతోంది. అక్కడి నుంచి అమెరికాకు ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు చైనాపై అదనంగా ట్యాక్సులు వేయడంతో వాటి రేట్లు పెరగనున్నాయి. గతంలో యాపిల్‌ పన్నుల భారం లేకుండా ప్రభుత్వం నుంచి కొంత మినహాయింపు పొందింది. కానీ ఈసారి ఆ అవకాశం కనిపించడం లేదు. చైనా నుంచి తయారీని మళ్లీ అమెరికాకు రప్పించాలన్నది ట్రంప్ వ్యూహం. దీంతో ఈసారి ట్రంప్ మినహాయింపులు ఇచ్చే అవకాశాల్లేవు. ఇప్పటికే అమెరికా మార్కెట్లలో ఐఫోన్ అమ్మకాలు పడిపోయాయి. ఈ సమయంలో రేట్ల పెంపు అంటే అది యాపిల్‌కు భారమే. ప్రస్తుతం యాపిల్‌ ఏటా 22కోట్ల ఐఫోన్లను విక్రయిస్తోంది. దానికి అతిపెద్ద మార్కెట్ అమెరికా, చైనాలే.

సరే ట్రంప్ చైనాపై పన్నులు బాదేశాడు. మన దేశంలో ఉత్పత్తి అయినవో లేక చైనా నుంచి వచ్చిన ఐఫోన్లో మనం కొంటాం కదా మధ్యలో మనకెందుకు రేట్లు పెరుగుతాయన్న ప్రశ్న కొందరిలో ఉంది. అది నిజమే.. కానీ అమెరికన్ మార్కెట్లలో భారీగా రేట్లు పెంచి మన దగ్గర పెంచకపోతే బ్యాలెన్స్ అవదు. కాబట్టి యాపిల్ కొంత భారాన్ని మనపైన కూడా మోపుతుంది. అంటే ఎంతో కొంత మనల్ని బాదేసి అమెరికన్లకు కాస్త ఊరట కలిగిస్తుంది. కాబట్టి మన దగ్గర కూడా భారీగానే రేట్లు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఐఫోన్‌ రేట్లు పెరిగితే కస్టమర్లు ఆల్టర్‌నేటివ్స్ చూసుకునే అవకాశాలు లేకపోలేదు. అంటే శాంసంగ్‌ ఫోన్లకు డిమాండ్ పెరగొచ్చు. శాంసంగ్‌ ఎక్కువ ఇతర దేశాల్లోనే తయారవుతోంది. చైనా, దాని చుట్టుపక్కల దేశాల్లో దాని ఉత్పత్తి అసలు లేనట్లే. దక్షిణ కొరియాపై వేసిన 25శాతం టారిఫ్‌లు చైనాపై వేసిన 54శాతం పన్నులతో పోల్చితే చాలా తక్కువ. కాబట్టి శాంసంగ్‌కు ఇది కలసి వస్తుందని చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే ట్రంప్ దెబ్బ అందరికీ గట్టిగానే తగిలింది. మరి ఆయన ఈ మొండి వైఖరితో ఎన్నాళ్లు ఉంటారో ఏం చేస్తారో చూడాల్సిందే.