Tupperware‎: ఇల్లాలి నేస్తం… టప్పర్‌వేర్ డబ్బా కనిపించదా? టప్పర్‌వేర్ ఇక గత చరిత్రేనా?

ఇంతకాలం సక్సెస్‌ఫుల్ బ్రాండ్‌గా నిలిచిన టప్పర్‌వేర్ ఇప్పుడు నష్టాల ఊబిలో చిక్కుకుంది. ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో తమ ఉత్పత్తులను సరిగా మార్కెటింగ్ చేసుకోలేక టప్పర్‌వేర్ ఇబ్బంది పడుతోంది. ఆదాయం తగ్గి నిధుల కొరత ఏర్పడటంతో ఇక టప్పర్‌వేర్ కంటైనర్ల ఉత్పత్తికి మంగళం పాడాలని కంపెనీ నిర్ణయించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2023 | 11:52 AMLast Updated on: Apr 17, 2023 | 2:05 PM

Tupperware Announces Substantial Doubt That They Can Stay In Business After 77 Years

Tupperware: పరిచయం అవసరం లేని బ్రాండ్. ఏ ఇంట్లో చూసినా టప్పర్‌వేర్ ప్లాస్టిక్ డబ్బాలు కచ్చితంగా ఉంటాయి. టప్పర్‌వేర్ కంటైనర్స్‌తో భారతీయ మహిళలకు విడదీయరాని అనుబంధం. వంటింటి దినుసుల నుంచి ఆహార పదార్ధాల వరకు దేనిని స్టోర్ చేసుకోవాలన్నా టప్పర్‌వేర్ డబ్బాలే వాడటం అందరికీ అలవాటు. టప్పర్‌వేర్ డబ్బాల్లో నిల్వ ఉంచిన ఎలాంటి పదార్థమైనా వెంటనే చెడిపోయే అవకాశమే లేదు. ఎందుకంటే దానికున్న ఎయిర్ టైట్ లాకింగ్ సిస్టమ్ అలాంటింది.
టప్పర్‌వేర్ కిట్టీ పార్టీలు
టప్పర్‌వేర్ డబ్బాలను అమ్మేందుకు జరిగే మహిళల కిట్టీ పార్టీల సంగతి సరేసరే. టప్పర్‌వేర్‌ను ప్రతి ఇంటికీ చేర్చడం కోసం మహిళలు ఓ చైన్ మార్కెటింగ్‌లా ఏర్పడి వాటిని ప్రమోట్ చేసేవారు. అమెరికాలో మొదలైన ఈ మార్కెటింగ్ కల్చర్ అన్ని దేశాలకు వ్యాపించింది. హై క్వాలిటీ ప్లాస్టిక్ కంటైనర్స్ కావడంతో టప్పర్‌వేర్ డబ్బాలకు మహిళల్లో చాలా క్రేజ్ ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ మంచి బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న టప్పర్‌వేర్ డబ్బాలు భవిష్యత్తులో కనిపించకపోవచ్చు. 77 సంవత్సరాలుగా.. భారత్ సహా 70కి పైగా దేశాల్లో ప్లాస్టిక్ డబ్బాల సేల్స్‌లో నెంబర్‌వన్‌గా ఉన్న టప్పర్‌వేర్ కథ కంచికి చేరే సమయం వచ్చింది.
నష్టాల ఊబిలో టప్పర్‌వేర్
ఇంతకాలం సక్సెస్‌ఫుల్ బ్రాండ్‌గా నిలిచిన టప్పర్‌వేర్ ఇప్పుడు నష్టాల ఊబిలో చిక్కుకుంది. ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో తమ ఉత్పత్తులను సరిగా మార్కెటింగ్ చేసుకోలేక టప్పర్‌వేర్ ఇబ్బంది పడుతోంది. ఆదాయం తగ్గి నిధుల కొరత ఏర్పడటంతో ఇక టప్పర్‌వేర్ కంటైనర్ల ఉత్పత్తికి మంగళం పాడాలని కంపెనీ నిర్ణయించింది. 2021 వరకు 1.3 బిలియన్ డాలర్ల సేల్స్ తో లాభాల్లో ఉన్న టప్పర్‌వేర్ ఆ తర్వాత నుంచి పతనాన్ని చూస్తోంది. ఒకప్పుడు ప్రపంచ మార్కెట్‌లో పయనీర్‌గా ఉన్న టప్పర్‌వేర్.. కొత్త మార్కెటింగ్ టెక్నిక్స్‌‌ను ఫాలో కాలేక బొక్కబోర్లా పడుతోంది.

టప్పర్‌వేర్‌ది సుదీర్ఘ ప్రస్థానం
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఆహారసంక్షోభాన్ని చవిచూసింది. దీంతో ఆహారపదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునేందుకు కంటైనర్ల అవసరం ఏర్పడింది. ఆ అవసరంలో నుంచి పుట్టుకొచ్చిందే టప్పర్‌వేర్ బ్రాండ్. ఇందులో ఉంచిన ఆహార పదార్థాలు తాజాగా ఉండటంతో వీటిని వండర్ బౌల్స్ అని కూడా పిలిచేవారు. టప్పర్‌వేర్ ఉత్పత్తులు ఏ స్థాయికి చేరుకున్నాయంటే అమెరికన్ కల్చర్‌లో టప్పర్‌వేర్ ఓ భాగంగా మారిపోయింది. ఇతర కంపెనీల కంటైనర్స్ కూడా మార్కెట్‌ను ముంచెత్తినా టప్పర్‌వేర్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అమెరికా నుంచి అన్ని దేశాలకు టప్పర్‌వేర్ కల్చర్ వేగంగా పాకింది. ఆస్ట్రేలియాలో తొలి టప్పర్‌వేర్ పార్టీని 1961లో మెల్బోర్న్‌లో నిర్వహించారు. ఇక మనదేశంలో కూడా టప్పర్‌వేర్ సక్సెస్‌ఫుల్ బ్రాండ్‌గా నిలిచిపోయింది. 1950, 60 దశకాల్లో టప్పర్‌వేర్ పార్టీలు పాపులర్ సోషల్ మార్కెటింగ్ ఈవెంట్స్‌‌గా పేరుతెచ్చుకున్నాయి. ఆ రోజుల్లో మహిళలకు పెద్ద ఆదాయ వనరుగా కూడా టప్పర్‌వేర్ పార్టీలు నిలిచేవి. టీ పార్టీలుగా మొదలై… టప్పర్‌వేర్ కంటైనర్స్‌ను సేల్ ‌చేయడంతో పార్టీలు ముగిసేవి. ఒక రకంగా ఈ టప్పర్‌వేర్ పార్టీలు సోషల్ గేదరింగ్‌గా, అనేక కుటుంబాల మధ్య నెట్‌వర్క్‌‌గా ఉండేవి.

Tupperware‎

కోవిడ్‌ తర్వాత సీన్ రివర్స్
ప్రపంచ వ్యాప్త ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చిన కరోనా మహమ్మారి టప్పర్‌వేర్ భవిష్యత్తుపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. కోవిడ్ సమయంలో ఒక్కసారిగా టప్పర్‌వేర్ అమ్మకాలు పడిపోయాయి. మార్కెట్‌ను పెంచుకునేందుకు సంస్థ చేసిన ప్రయోగాలు కూడా వికటించాయి. దీంతో అప్పటి నుంచి టప్పర్‌వేర్ పతనం మొదలవుతూ వచ్చింది.
టప్పర్‌వేర్ ఎక్కడ తప్పు చేసింది?
ఏ కంపెనీ అయినా కాలంతో పాటు మారాలి. మార్కెటింగ్ వ్యూహాలు మార్చుకోవాలి. కానీ టప్పర్‌వేర్ ఆ పనిచేయలేకపోయింది. కాంపిటీటర్స్ అంచనాలను అందుకోలేకపోయింది. డైరెక్ట్ సేల్స్ ‌క్రమంగా తగ్గుతున్న సమయంలో టప్పర్‌వేర్ రిటైల్ మార్కెట్ ద్వారా అమ్మకాలు జరిపే ఆలోచన చేయలేదు. తనకున్న బ్రాండ్, టప్పర్‌వేర్ పార్టీలే ప్రొడక్ట్స్‌ను కలకలం నెంబర్‌వన్‌గా ఉంచుతాయని టప్పర్‌వేర్ యాజమాన్యం భావించింది. కానీ సీన్ రివల్స్ అయ్యింది.
ఇక టప్పర్‌వేర్ డబ్బాలు కనిపించవా?

ప్రస్తుతానికి టప్పర్‌వేర్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఎవరైనా ఈ కంపెనీని కొని కొత్త మార్కెటింగ్ పద్దతుల్లో టప్పర్‌వేర్‌ను బతికించుకోవాలి. లేదంటే టప్పర్‌వేర్ డబ్బాలు ఒకప్పుడు ఉండేవని భవిష్యత్తులో మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది.