Twitter: నువ్వు సెలబ్రిటీ అయితే నాకేంటి ? డబ్బులు కట్టాల్సిందే. ట్విట్టర్ కమర్షిలైజేషన్ వెనుక మస్క్ లెక్క వేరే ఉంది

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొనగోలు చేసినప్పటి నుంచి అనేక ప్రయోగాలు చేస్తున్న అమెరికన్ బిలయనీర్ ఎలాన్ మస్క్‌ ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలకు షాక్ ఇచ్చారు. ట్విట్టర్‌లో నిన్న మొన్నటి వరకు సెలబ్రిటీలుగా కనిపించిన వాళ్లు కాస్త సడన్‌గా సామాన్యులుగా మారిపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2023 | 05:43 PMLast Updated on: Apr 22, 2023 | 5:43 PM

Twitter Musk Business Strategy

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్ వరకు, రాహుల్ గాంధీ నుంచి చంద్రబాబు వరకు ఒక్కరేంటి వాళ్లు వీళ్లు అని తేడాలేకుండా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖల బ్లూ టిక్‌ను తొలగించేశారు. డబ్బులు కడితేనే వెరిఫైడ్ అకౌంట్‌గా బ్లూ టిక్ ఉంటుందని… సబ్‌స్క్రైబ్ చేసుకోతే బ్లూ టిక్ తీసేస్తామని ట్విట్టర్ కొన్న వెంటనే ప్రకటించిన మస్క్ అన్నంత పని చేశారు.

బ్లూటిక్‌‌తో మస్క్ గేమ్స్

ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వెరిఫైడ్ ఎకౌంట్ ఉంటే.. ఆ కిక్కే వేరు. సాధారణంగా అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ బ్లూ టిక్ వెరిఫికేషన్ రాదు. ట్విట్టర్ మస్క్ చేతికి రానంత వరకూ బ్లూ టిక్ రూల్స్ వేరేలా ఉండేవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలకు, సినీ, రాజకీయ, వ్యాపారల ప్రముఖులకు, జర్నలిస్టులకు, ప్రముఖ సంస్థలకు ట్విట్టర్ తనకు తానే బ్లూ టిక్ ఇచ్చేది. దీంతో బ్లూ టిక్ ఉన్న వెరిఫైడ్ అకౌంట్ నుంచి చేసే ప్రతి ట్వీట్ అధికారిక ట్వీట్‌గా నిలిచిపోయేది. సోషల్ మీడియాలో ప్రముఖులను ఫాలో అయ్యే వారు కూడా బ్లూటిక్ వెరిఫికేషన్ ఉన్న అకౌంట్లను ఫాలో అయ్యేవారు. కానీ మస్క్ ట్విట్టర్ ఆఫీసులో అడుగు పెట్టగానే రూల్స్ మారిపోయాయి. స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే వేదికగా ట్విట్టర్‌ను మార్చుతానని ప్రకటించిన మస్క్ యూజర్ అకౌంట్స్ తో ఓ ఆట ఆడుకుంటున్నారు
బ్లూటిక్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందేనా ?
కచ్చితంగా కట్టాల్సిందేనంటున్నారు మస్ట్. ట్వట్టర్‌లో సామాన్యులకు అన్ని సర్వీసులు ఉచితంగానే అందిస్తామని…కానీ ప్రీమియం ఫీచర్స్ కావాలంటే మాత్రం సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిందేనని కుంటబద్దలు కొడుతున్నారు. గతేడాది అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన మస్క్ అప్పటి నుంచి సమూల మార్పులు మొదలు పెట్టారు.

మస్ట్‌కు మనీ ఈజ్ పవర్

మస్క్‌ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన పక్కా వ్యాపారి. రూపాయి పెట్టుబడి పెడితే కనీసం 10 రూపాయలైనా లాభం రావాలనుకునే సగటు వ్యాపారి. ఇప్పటి వరకు ఆయన చేస్తున్న వ్యాపారాలు కూడా అలాంటివే. సంస్థ ఏదైనా సరే అందులో పెట్టుబడి పెట్టామంటే బరాబర్ ప్రతిఫలం కచ్చితంగా ఉండాలంటారు మస్క్. స్పేస్ ఎక్స్, టెస్లా, ఎక్స్ కార్ప్ వంటి ఎన్నో సంస్థలను నిర్వహిస్తున్న మస్ట్ నెట్ వర్త్ 192 బిలయన్ డాలర్లు. అలాంటి మస్క్ నష్టాలు వచ్చే వ్యాపారాన్ని ఎందుకు చేస్తారు. ఆదాయం సరిగా లేక ఆపసోపాలు పడుతున్న ట్విట్టర్‌ను కొనుగోలు చేసి… దాన్ని తన వ్యూహాలతో లాభాలబాట పట్టించాలనుకున్నారు మస్క్.

ఖర్చులు తగ్గాలి.. ఆదాయం పెరగాలి

మస్క్‌ తో డీల్ ఓకే అవ్వకముందే ట్విట్టర్ షేక్ అవడం మొదలు పెట్టింది. వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సీఈవో సహా చాలా మంది ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పేశారు. టెస్లా షేర్లు అమ్మి మరీ 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న మస్క్ ఆ మేరకు ట్విట్టర్‌ను పూర్తి స్థాయిలో కమర్షియల్ చేయడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించేశారు. మన దేశంలో బెంగళూరు కార్యాలయాన్ని కూడా మూసేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ కోసం పనిచేస్తోంది కేవలం 1500 మాత్రమే.

ట్విట్టర్ విషయంలో మస్క్ లెక్క తప్పిందా ?

కార్ల తయారీ, అంతరిక్ష పరిశోధనలు, న్యూరోలింక్ వంటి ప్రాజెక్టుల్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టి వాటి ద్వారా భారీగా ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్న మస్క్ లెక్క ట్విట్టర్ విషయంలో మాత్రం తప్పింది. బ్లూమ్‌బర్గ్ బిలయనీర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే సెకండ్ రిచ్చెస్ట్ పర్సన్ గా ఉన్న మస్క్ ట్విట్టర్ ను కూడా పూర్తి కమర్షియల్ మోడల్ లోనే చూస్తున్నారు. అందుకే రకకరాల ఫీచర్స్ పేరుతో యూజర్ల నుంచే డబ్బులు వసూలు చేస్తున్నారు.

బ్లూ టిక్ – సెలబ్రిటీస్ -మస్క్ ఆలోచన

స్మోకింగ్, డ్రింకింగ్ లాగానే సోషల్ మీడియా అన్నది ఇప్పుడో వ్యసనంలా మారిపోయింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా వంటి వాటికి అలవాటు పడ్డ వాళ్లు వాటి నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పుకుంటూ మెసేజ్‌ను ఎక్కువ మందికి చేరవడానికి, దానికి తోడు ఫ్యాన్ బేస్, ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి ట్విట్టర్ వంటివి ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ట్విట్టర్ యూజర్స్ ఉన్నారు. వారందర్నీ కమర్షియల్ ప్లాట్‌ఫామ్ పైకి తీసుకురావాలన్నదే మస్క్ ఆలోచన. ఇప్పటికే బాగా ట్విట్టర్‌కు అలవాటు పడిన సెలబ్రిటీలు కచ్చితంగా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ చేసుకుంటారని మస్క్ ధీమాగా ఉన్నారు. అందుకే కొంతగడువిచ్చి.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోని ప్రముఖుల ఖాతాలకు బ్లూ టిక్ తొలగించారు.

ట్విట్టర్‌పై మస్క్ బ్రాండింగ్

ట్విట్టర్‌ను పూర్తిగా కమర్షియల్ కోణంలో మాత్రమే చూస్తున్న మస్క్.. దాని నుంచి గరిష్టంగా ఆదాయం ఎలా రాబట్టాలా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఆయన కొత్త కొత్త ప్లాన్లు ప్రకటించారు. కమర్షియల్ , గవర్నమెంట్ యూజర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్న మస్క్… మరో ఆలోచన కూడా చేశారు. నెలకు 325 రూపాయలు పెట్టి ఓ ప్లాన్ తీసుకుంటే…. నేరుగా మస్క్ తోనూ చాట్ చేయవచ్చు. ఏ అంశంపైనైనా సబ్‌స్క్రైబర్స్ చేసే ట్వీట్స్ కు నేరుగా మస్క్ సమాధానమిస్తారు. అంతే కాదు. ask-me-anything పేరుతో దీనిని డిజైన్ చేశారు. దీంతో పాటు ట్విట్టర్ సర్కిల్స్ లో జరిగే డిస్కషన్స్ లో మస్క్ తో పాటు పాల్గొని ఆయనతో మాట్లాడొచ్చు.

ట్విట్టర్‌ మస్క్‌కు గుదిబండేనా?

ఎంత బిలియనీర్ అయినా.. చేస్తున్న వ్యపారాలు లాభాల్లో నడవకపోతే ఉన్న సంపద మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ప్రస్తుతం మస్క్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ట్విట్టర్ నష్టాల సంగతి పక్కన పెడితే టెస్లా, స్పేస్ ఎక్స్ నుంచి కూడా ఆశించినంత ఆదాయం రావడం లేదు. తాజా లెక్కల ప్రకారం టెస్లా నెట్ ఇన్‌కమ్ గతంతో పోల్చితే 20 శాతం తగ్గిపోయింది. టెస్లా షేర్లు 10 శాతం పడిపోవడంతో 13 బిలియన్ డాలర్ల మస్క్ సంపద తుడిచిపెట్టుకుపోయింది. మరోవైపు ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ కూడా మొన్న గాలిలోకి ఎగిరిన కొంత సేపటికే పేలిపోయింది. దీంతో మస్క్ మైండ్ బ్లాంక్ అయ్యింది. అటు ఇన్వెస్టర్లు కూడా మస్క్ విధానాలను ప్రశ్నిస్తూ ఇటీవలే ఆయనకు లేఖ సంధించారు. ఓవైపు టెస్లా, మరోవైపు స్పేస్ ఎక్స్, ఇంకోవైపు ట్విట్టర్.. కొన్ని రోజులుగా ఈ వ్యాపారాల నుంచి మస్క్ కు ఎలాంటి శుభవార్త అందడం లేదు. దీంతో ఆయన ఫ్రస్టేషన్ లో ఉన్నారు. ట్విట్టర్ తనకు ఎప్పటికైనా గుదిబండేనని… ఇటీవల బీబీసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మస్క్. ఎవరైనా కొంటానంటే అమ్మేస్తానని కూడా చెప్పారు. ఇదీ సంగతి అందుకే… ట్విట్టర్ తో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్న మస్క్ డబ్బులు వచ్చే ఏ ఒక్క మార్గాన్ని వదిలిపెట్టడం లేదు. అందులో భాగంగానే సెలబ్రిటీ ప్రొఫైల్స్ ను టార్గెట్ చేశారు. బ్లూటిక్ కావాలంటే చచ్చినట్టు వాళ్లే కదతారన్నది మస్క్ ధీమా.