Elon Musk: ట్విట్టర్‌లో ఎగిరిపోనున్న పిట్ట.. మస్క్ సంచలన నిర్ణయం..!

మస్క్ తాను ట్వీట్ చేసిన ఎక్స్ లోగో బాగుంటే.. రేపటి నుంచే లైవ్‌లోకి వస్తుందని కూడా పేర్కొన్నాడు. దీనర్థం ట్విట్టర్ బర్డ్ స్థానంలో ఎక్స్ అనే లోగో కనిపిస్తుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ట్విట్టర్ బ్రాండ్‌కు ఎక్స్ అనే పేరు పెట్టే అవకాశాలున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 23, 2023 | 02:45 PMLast Updated on: Jul 23, 2023 | 2:46 PM

Twitter Set To Replace Its Iconic Bird Logo Elon Musk Shares Its New Design X

Elon Musk: ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ సంస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ ద్వారా కీలక ప్రకటనలు చేస్తూ వస్తున్న మస్క్ తాజాగా కంపెనీ గురించి మరో సంచలన ప్రకటన చేశాడు. ట్విట్టర్ లోగో నుంచి పక్షి ఎగిరిపోనున్నట్లు వెల్లడించాడు. అంటే ట్విట్టర్ బ్రాండ్, లోగో మారబోతుందని తెలిపాడు.”త్వరలోనే ట్విట్టర్ బ్రాండ్‌కు, నెమ్మదిగా అన్ని పక్షులకు కూడా వీడ్కోలు పలకపబోతున్నాం” అని మస్క్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

అలాగే ఎక్స్ బ్రాండ్‌కు సంబంధించిన క్లిప్ కూడా రిలీజ్ చేశాడు. మస్క్ తాను ట్వీట్ చేసిన ఎక్స్ లోగో బాగుంటే.. రేపటి నుంచే లైవ్‌లోకి వస్తుందని కూడా పేర్కొన్నాడు. దీనర్థం ట్విట్టర్ బర్డ్ స్థానంలో ఎక్స్ అనే లోగో కనిపిస్తుందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ట్విట్టర్ బ్రాండ్‌కు ఎక్స్ అనే పేరు పెట్టే అవకాశాలున్నాయి. మస్క్‌కు ఎక్స్ అనే అక్షరం చాలా ఇష్టం. అందుకే ఈ పేరుతో లోగో వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మస్క్ గతంలో ఎక్స్ కార్ప్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ట్విట్టర్ సంస్థను అందులో విలీనం చేస్తున్నట్లు చాలా కాలం క్రితం ప్రకటించాడు. ఇప్పుడు మస్క్ అదే చేస్తుండొచ్చని అంచనా. ట్విట్టర్ నూతన సీఈవోగా లిండా యాకరినో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె ఈ సంస్థను ఎవ్రీథింగ్ యాప్ ఎక్స్‌గా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుందని కూడా మస్క్ అప్పట్లో ట్వీట్ చేశాడు. దీంతో అతి త్వరలో ట్విట్టర్ లోగో మారిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న మస్క్ కంపెనీకి తనదైన మార్క్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. దీనిలో భాగంగా ఇప్పటికే బ్లూటిక్ వంటి ఫీచర్లు తెచ్చిన మస్క్.. తాజాగా అన్‌వెరిఫైడ్ ఖాతాలకు సంబంధించిన ట్వీట్ల సంఖ్యను పరిమితం చేశాడు. అలాగే త్వరలోనే కంపెనీలు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అనువుగా కొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు కూడా మస్క్ వెల్లడించాడు. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వివిధ యాప్స్, వెబ్‌సైట్స్ సర్వీస్ అందిస్తుండగా.. ట్విట్టర్ ద్వారా కూడా ఆ పని చేసేలా ప్లాట్‌ఫామ్‌పై మార్పులు తీసుకురాబోతున్నాడు. కంపెనీకి అడ్వర్‌టైజ్‌మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు సగానికి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలపై మస్క్ దృష్టిపెట్టాడు. ట్విట్టర్‌ను పూర్తి పెయిడ్ సర్వీస్ యాప్‌గా మారుస్తున్నాడు.