United Kingdom: నెలకు ఉచితంగా లక్షన్నర రూపాయలు..! ఎక్కడ.. ఎందుకు.. ఎలా..?

మీ అకౌంట్‌లో లక్షన్నర రూపాయలు క్రెడిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. ఆ డబ్బులను మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. మీ ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 9, 2023 | 10:26 AMLast Updated on: Jun 09, 2023 | 10:26 AM

Universal Basic Income Plans Drawn Up For 1600 Pound A Month Trial In England

United Kingdom: ప్రతి నెలా ఒకటో తారీఖు.. క్రమం తప్పకుండా.. మీ ఫోన్‌కు ‌ఎస్సెమ్మెస్. మీ అకౌంట్‌లో లక్షన్నర రూపాయలు క్రెడిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. ఆ డబ్బులను మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. మీ ఇంటి అవసరాలు తీర్చుకోవచ్చు.. బ్యాంక్ వాళ్లు గానీ.. ప్రభుత్వం గానీ.. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు గానీ మిమ్మల్ని ఒక్క మాట కూడా అడగరు. ఇది కేవలం ఒక్కనెల ముచ్చట కాదు.. మీకు ఎప్పటికీ ప్రతి నెలా మీరు బతికి ఉన్నంత కాలం డబ్బులు వస్తూనే ఉంటాయి.
అంత డబ్బు ఎవరు ? ఎందుకిస్తున్నట్టు ?
నెలనెలా అంత డబ్బు ఎవరైనా ఎందుకిస్తారు ? కచ్చితంగా ఇవ్వరు. మరి బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయ్ ? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. ప్రభుత్వమే నెలనెలా మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. అవును ప్రతి నెలా క్రమం తప్పకుండా కొంత అమౌంట్ దేశంలో ఉన్న పౌరులందరికీ అందుతుంది. మీ ఊరేంటి.. మీరేం చేస్తున్నారు.. మీరెక్కడుంటారు.. మీకెన్ని ఆస్తులున్నాయ్.. మీరు పేదలా.. లేక ధనికులా.. ఇలా ఒక్క ప్రశ్న కూడా వేయకుండానే ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది. దీనికి యూకే ప్రభుత్వం పెట్టుకున్న పేరు యూనివర్శల్ బేసిక్ ఇన్‌కమ్.. సింపుల్‌గా దీన్ని యూబీఐ అని పిలుస్తున్నారు.
యూనివర్శల్ బేసిక్ ఇన్‌కమ్ అంటే ఏంటి ?
సాధారణంగా స్నేహితుల దగ్గర చేబదులు తీసుకున్నా.. బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్నా.. ఏవో ఒక షరతులైతే కచ్చితంగా ఉంటాయి.. కానీ బ్రిటన్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ప్రతి వ్యక్తికి నెలకు 1600 పౌండ్స్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇంచుమించు ఇది కరెన్సీలో లక్షన్నర రూపాయలకు సమానం. పుట్టిన ప్రతి వ్యక్తికి ఆర్థిక అవసరాలు కచ్చితంగా ఉంటాయి. అయితే ఏదేశంలోనైనా కనీస ఆర్థిక అవసరాలు కూడా తీర్చుకోలేక ఇబ్బందులు పడే వాళ్లు కోట్లలో ఉంటారు. అలాంటి వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ ను డిజైన్ చేసింది యూకే ప్రభుత్వం. యూనివర్శల్ బేసిక్ ఇన్‌కమ్ ఎవరికి ఇవ్వాలా అన్న విషయంలో బ్రిటన్ సర్కార్ ఎలాంటి కండిషన్స్ విధించలేదు. అంటే బ్రిటన్ పౌరులు అయి ఉంటే చాలు.. పేద, మధ్యతరగతి, ధనికులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి 1600 పౌండ్లు అందించే ఆలోచనలో ఉంది.
యూనివర్శల్ బేసిక్ ఇన్‌కమ్ అవసరం ఏంటి ?
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అని గొప్పగా చెప్పుకునే యునైటెడ్ కింగ్‌డమ్.. చరిత్రలో ఎప్పుడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తోంది. యూరోప్ దేశాల్లో ఇప్పటికే జర్మనీ ఆర్ధికమాంద్యంలోకి వెళ్లిపోగా.. ఇప్పుడు బ్రిటన్ కూడా ఆ అంచున ఉంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు సవాల్ విసురుతూ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. బ్రిటన్‌లో ధనిక వర్గాలు మినహాయించి అందరూ ద్రవ్యోల్బణం బాధితులే. ఎగువ మధ్యతరగతి ప్రజలు కూడా పేదవారిగా మారిపోయిన పరిస్థితి. అన్నింటి కంటే ముఖ్యంగా ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ బ్రిటన్ ప్రజలకు సవాల్‌గా మారింది. చేతిలో చిల్లిగవ్వ లేక.. తినడానికి తిండి లేని పరిస్థితిని లక్షలాది మంది అనుభవిస్తున్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి రిషి సునక్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల కనీస అవసరాలకైనా డబ్బులు అందించాలన్న ఆలోచన చేసింది యూకే ప్రభుత్వం. అందులో భాగంగానే యూనివర్సల్ బేసిక్‌ ఇన్‌కమ్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ముందు పైలెట్ ప్రాజెక్టు.. ఆ తర్వాతే అసలు స్కీమ్ అమలు
అసలే ఆర్థిక సంక్షోభాన్ని చవిచూస్తున్న బ్రిటన్ ప్రభుత్వం ఉన్నపళంగా ఈ పథకాన్ని అమలు చేయాలనుకోవడం లేదు. ప్రభుత్వమే ఎలాంటి షరతులు విధించకుండా ప్రతి వ్యక్తికి ప్రతి నెలా కొంత డబ్బు ఇస్తే.. వాళ్ల జీవితం ఎలా సాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా యూబీఐ స్కీమ్‌ను పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించింది. దేశంలోని రెండు భిన్నమైన ప్రాంతాల నుంచి 30 మందిని రాండమ్‌గా సెలక్ట్ చేసి వారికి ప్రతి నెలా 1600 పౌండ్లు అందిస్తారు. యూకేకు చెందిన ఇండిపెండెంట్ థింక్ టాంక్ అటానమీ అనే సంస్థ ఈ బాధ్యతలు చూసుకుంటుంది. రెండేళ్ల పాటు ప్రతి నెలా 30 మందికి బ్యాంక్ అకౌంట్ల ద్వారా నగదు అందిస్తారు. వాళ్ల జీతభత్యాలు, ఉపాధి మార్గాలతో సంబంధం లేకుండా రెండేళ్ల పాటు కనీస ఆదాయం ఉండటం ద్వారా వాళ్ల జీవితాల్లో జరిగే మార్పులను వీళ్లు నిశితంగా పరిశీలిస్తారు. దీన్ని సమర్థంగా అమలు చేస్తే పేదరికాన్ని రూపుమాపొచ్చని ప్రభుత్వం చెబుతుంది. అందుకే పైలెట్ ప్రాజెక్టులో వచ్చే ఫలితాల ఆధారంగా ఓ నివేదికను తయారు చేసి దానిని అధ్యయం చేసిన తర్వాత మాత్రమే ఈ స్కీమ్‌ను అమలు చేస్తారు.
యూబీఐపై భిన్న వాదనలు
బ్రిటన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంకా అమలు చేయడం ప్రారంభించకముందే.. దీనికి అనుకూలంగా, వ్యతిరేకంగా బలమైన వాదనలు మొదలయ్యాయి. యూకే న్యూస్ ఛానల్స్ నిండా దీనిపైనే సుధీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. పేదరిక నిర్మూలనతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి యూనివర్శల్ బేసిక్ ఇన్‌కమ్ స్కీమ్ ఉపయోగపడుతుందని అనుకూల వర్గాలు చెబుతున్నాయి. వివిధ పథకాల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్‌తో పోల్చితే దీనికి పెద్దగా ఖర్చు కాదని అంటున్నారు.

ఆర్థిక వ్యవస్థలు తలకిందులై ఉద్యోగాలు ఉంటాయో.. ఊడుతాయో.. తెలియని పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి అందే ఈ చిన్న భరోసా ప్రజలకు రిలీఫ్ గా ఉంటుందన్నది యూబీఐని సమర్థించే వాళ్ల వాదన. అయితే అదే స్థాయిలో దీన్ని వ్యతిరేకించే వాళ్లు కూడా ఉన్నారు. ప్రతి వ్యక్తికి ఉచితంగా డబ్బులు ఇవ్వడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద గుదిబండను వేయడమేనని దీన్ని వ్యతిరేకించే ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దీన్ని అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా పన్నుల విధానంతో పాటు సోషల్ సెక్యూరిటీ వ్యవస్థను కూడా మార్చాల్సి వస్తుందని.. అది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని వీళ్లు చెబుతున్నారు.

సమాజంలో ఎవరికి అవసరమో వాళ్లకు ప్రభుత్వం అండగా ఉండకుండా పౌరులందరికీ డబ్బులు పందారం చేయడం సరైన విధానం కాదంటున్నారు. వేల్స్, స్కాట్‌లాండ్, ఫిన్‌లాంటి దేశాలు ఈ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఆయా దేశాల్లో పరిస్థితులను బట్టి వీటిని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్న బ్రిటన్ ప్రభుత్వం..ఈ పథకం ద్వారా ప్రజలకు ఎంత మేలు చేస్తుందో.. ట్రయల్ పీరియడ్ పూర్తయితే గానీ తెలియదు.